‘బెదురులంక 2012’ మూవీ రివ్యూ

Telugu BOX Office
Highlights
‘బెదురులంక 2012’ మూవీ రివ్యూ
2.8

చిత్రం: బెదురులంక 2012; నటీనటులు: కార్తికేయ, నేహాశెట్టి, అజయ్‌ ఘోష్‌, శ్రీకాంత్‌ అయ్యంగార్‌, సత్య, ఎల్బీ శ్రీరామ్‌, జబర్దస్త్‌ రామ్‌ ప్రసాద్‌; సంగీతం: మణిశర్మ; సినిమాటోగ్రఫీ: సాయి ప్రకాష్‌ , సన్నీ కూరపాటి; ఎడిటింగ్‌: విప్లవ్‌ నైషధం; నిర్మాత: రవీంద్ర బెనర్జీ ముప్పలనేని; రచన, దర్శకత్వం: క్లాక్స్‌; విడుదల తేదీ: 25-08-2023

‘ఆర్‌ఎక్స్‌ 100’తో తొలి అడుగులోనే సినీప్రియుల్ని మెప్పించిన హీరో కార్తికేయ. కానీ, ఆ తర్వాత ఆయన నుంచి ఆ స్థాయి చిత్రమేదీ రాలేదు. అయినా జయాపజయాలతో సంబంధం లేకుండా వైవిధ్యభరితమైన కథలతోనే ప్రయాణిస్తూ వస్తున్నారు కార్తికేయ. ఈ క్రమంలోనే ఇప్పుడాయన ‘బెదురులంక 2012’ అంటూ మరో విభిన్నమైన కథతో బాక్సాఫీస్‌ ముందుకొచ్చారు. విడుదలకు ముందే పాటలు మంచి ఆదరణ దక్కించుకోవడం.. టీజర్, ట్రైలర్లు కొత్తదనం నింపుకొని ఆసక్తికరంగా ఉండటంతో ప్రేక్షకుల దృష్టి దీనిపై పడింది. మరి ఈ బెదురులంక కథేంటి? ఇది సినీప్రియుల్ని ఏమేర ఆకట్టుకుంది?

అది 2012 డిసెంబర్ నెల. యుగాంతం అంటూ ప్రచారం హోరెత్తిపోతోంది. బెదురులంక అనే గ్రామంలో భూషణం (అజయ్ ఘోష్) ఓ ప్లాన్ వేస్తాడు. ఆ ఊరి బ్రాహ్మణుడైన బ్రహ్మం (శ్రీకాంత్ అయ్యంగార్), చర్చి ఫాదర్ కొడుకు డేనియల్ (రాం ప్రసాద్)లతో కలిసి ప్రజలను మరింతగా భయపెట్టాలని చూస్తాడు. యుగాంతం ఆగాలంటే ఊర్లోని బంగారం అంతా కరిగించి శివలింగం, శిలువ తయారు చేయించి గంగలో వదిలేయాలని ఆ ఊరి ప్రెసిడెంట్ (గోపరాజు రమణ)తో చెప్పిస్తాడు. దీంతో ఊరంతా భయంతో ఒప్పేసుకుంటుంది. కానీ శివ (కార్తికేయ) మాత్రం వినడు. శివ ఆల్రెడీ ప్రెసిడెంట్ కూతురు చిత్ర (నేహా శెట్టి)తో ప్రేమలో ఉంటాడు. తన మాటను ఎదురించిన శివను ఊరి నుంచి వెలేస్తాడు ప్రెసిడెంట్? ఆ తరువాత శివ ఏం చేస్తాడు? ఊరి ప్రజల మూఢ నమ్మకాలను పోగొట్టేందుకు ఏం చేస్తాడు? తన ప్రేమను ఎలా గెలిపించుకుంటాడు? యుగాంతం ఎలా ఉంటుందో ఊరి ప్రజలకు ఎందుకు చూపిస్తాడు? అసలు ఈ కథలో కసిరాజు పాత్ర ఏంటి? అన్నది కథ.

2012 డిసెంబరు 21తో ప్రపంచమంతా అంతమైపోతుందంటూ దశాబ్ద కాలం క్రితం జరిగిన ప్రచారం యావత్‌ ప్రజానీకాన్ని ఎంతగా ఆందోళనకు గురిచేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ యుగాంతపు కథాంశంతో వార్తా ఛానెళ్లలో ప్రత్యేక కార్యక్రమాలు, ఎన్నో సినిమాలు పెద్ద ఎత్తున వచ్చాయి. అదే సమయంలో ప్రజల్లో ఉన్న భయానికి.. మతం, భక్తి పేరుతో ఓ ముసుగు తొడిగి ఎంతో మంది మోసగాళ్లు దోచుకునే ప్రయత్నం చేశారు. నిజానికి ఇలా ప్రజల్లో ఉన్న భక్తిని.. భయాన్ని అడ్డం పెట్టుకొని మూఢనమ్మకాలతో పేరుతో అనేక అకృత్యాలకు పాల్పడుతున్న వ్యక్తుల్ని ఇప్పటికీ అనేక చోట్ల తరచూ చూస్తూనే ఉంటాం. ఇదే అంశాన్ని వినోదాత్మకంగా చర్చిస్తూ.. ఈ ‘బెదురులంక’తో ఓ మంచి సందేశమిచ్చే ప్రయత్నం చేశాడు దర్శకుడు క్లాక్స్‌.  ఓవైపు యుగాంతపు వార్తలు.. మరోవైపు బెదురులంక ప్రజల వ్యక్తిత్వాల్ని చూపిస్తూ సినిమాని ఆరంభించిన తీరు ఫర్వాలేదనిపిస్తుంది. ఆ వెంటనే ఓ సింపుల్‌ సీన్‌తో హీరో పాత్రను.. అతని వ్యక్తిత్వాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశాడు. బెదురులంక ప్రజల్లో ఉన్న భయాల్ని అడ్డం పెట్టుకొని భూషణం ఓ పెద్ద కుట్రకు తెరలేపడం.. అదే సమయంలో హీరో ఊరిలోకి అడుగుపెట్టడంతో వెంటనే కథలోకి తీసుకెళ్లిపోయాడు. కానీ, విరామానికి ముందు గానీ అసలు కథ మొదలవ్వదు. ఈ మధ్యలో అంతా నాయకానాయికల ప్రేమకథతోనూ.. బెదరులంకలోని పాత్రల పరిచయాలతోనూ కాలక్షేపం చేశాడు దర్శకుడు.

మనిషిలోని భయాన్ని ఒక్కొక్కరు ఎలా వాడుకుంటారు? మతం పేరు చెప్పి జనాల్ని ఎలా ఆడుకుంటారు? మోసం చేస్తారు? అనేది ఈ దర్శకుడు ఏమైనా సందేశం ఇవ్వాలని అనుకున్నాడో ఏమో గానీ.. ఈ బెదురులంకలో అంతర్లీనంగా ఆ మెసెజ్ మాత్రం కనిపిస్తూనే ఉంటుంది. మతం ఏదైనా, పేరు ఏదైనా కూడా ప్రజలను మాత్రం గొర్రెలను చేసేందుకు అన్ని చోట్లా అలాంటి వారు ఉంటారని చెప్పకనే చెప్పేశాడు. మూఢ నమ్మకాల మీద వ్యంగ్యాస్త్రంగానే ఈ సినిమా కనిపిస్తుంది.
దేవుడి మీద భక్తి కంటే భయమే ఎక్కువగా కనిపిస్తుందంటూ హీరో చేత చెప్పించిన డైలాగ్‌లోనూ ఎంతో అర్థం కనిపిస్తుంది. ఊరి ప్రజలంతా యుగాంతం అంటూ భయపడిపోతుంటే.. వారి భయాన్ని ఆసరాగా చేసుకుని దోచేయాలనే మనిషి కూడా ఉండటం.. ఊరంతా ఒక వైపు నిలిచి.. ఓ వ్యక్తి మాత్రమే వ్యతిరేకంగా నిలిస్తే.. మూఢ నమ్మకాలతో నిండి పోయిన మనుషులను మార్చడం.. ఎంత కష్టమో చూపించాడు.

శివ పాత్రలో కార్తికేయ ఎంతో సహజంగా కనిపించాడు. ఆద్యంతం చాలా సెటిల్డ్‌గా నటించాడు. దర్శకుడు కూడా హీరోయిజం పేరుతో అనవసరమైన హడావుడి చేయకుండా శివ పాత్రను ఎంతో వాస్తవికంగా తెరపైకి తీసుకొచ్చాడు. నేహా శెట్టి తెరపై చాలా అందంగా కనిపించింది. కార్తికేయతో ఆమె కెమిస్ట్రీ చూడముచ్చటగా ఉంది. అయితే వీళ్లిద్దరి ప్రేమకథలో అంతగా ఫీల్‌ కనిపించలేదు. భూషణంగా అజయ్‌ ఘోష్, బ్రహ్మంగా శ్రీకాంత్‌ అయ్యంగార్, డేనియల్‌గా రామ్‌ ప్రసాద్‌ తమ తమ పాత్రలకు చక్కగా న్యాయం చేశారు. గోపరాజు రమణ, ఎల్బీ శ్రీరామ్‌ తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. సత్యలోని కామెడీ కోణాన్ని పెద్దగా ఉపయోగించుకోలేదు. వెన్నెల కిషోర్, రాజ్‌కుమార్‌ పాత్రలు ద్వితీయార్ధంలో చక్కటి వినోదాన్ని పంచిచ్చాయి. దర్శకుడు తాను ఎంచుకున్న కథను నిజాయితీగా తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. అయితే ప్రథమార్ధంలో పెద్దగా కథ లేకపోవడం.. పాత్రల పరిచయానికి ఎక్కువ సమయం కేటాయించడం.. స్లో నేరేషన్‌ కాస్త ఇబ్బంది పెట్టాయి. కథకు తగ్గట్లుగా మణిశర్మ భిన్నమైన రీతిలో సంగీతమందించే ప్రయత్నం చేశారు. అది సినిమాకి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. పాటలు అంతగా ప్రభావం చూపించలేకపోయాయి. సాయిప్రకాష్, సన్నీ కూరపాటి ఛాయాగ్రహణం బాగుంది. లంక గ్రామంలోని అందాలను తమ కెమెరాతో చక్కగా పట్టుకున్నారు. నిర్మాణ విలువలు బాగున్నాయి.

 

చివరిగా: బెదురులంక ప్రజలు బాగానే నవ్విస్తారు

‘బెదురులంక 2012’ మూవీ రివ్యూ
2.8
Acting 3 out of 5
Direction 3 out of 5
Music 2 out of 5
Production 3 3 out of 5
Share This Article
Leave a review