సింగపూర్ అధ్యక్షుడిగా ప్రవాస భారతీయుడు

Telugu BOX Office

ప్రపంచంలో ఇతర దేశాలను ఏలుతున్న భారతీయుల సంఖ్య పెరిగిపోతోంది. ఇప్పటికే బ్రిటన్‌తో పాటు పలు దేశాలను భారతీయులు పాలిస్తుండగా.. తాజాగా ఆ జాబితాలోకి సింగపూర్ చేరింది. సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో భారత సంతతి వ్యక్తి చరిత్ర సృష్టించారు. మాజీ మంత్రి థర్మన్ షణ్ముగరత్నం సింగపూర్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. షణ్ముగరత్నం విజయాన్ని ఎన్నికల కమిటీ ధృవీకరించింది. 2011 తర్వాత ఆ దేశంలో తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ఇద్దరు చైనా సంతతికి చెందిన అభ్యర్థులను ఓడించిన 66 ఏళ్ల షణ్ముగరత్నం.. నూతన అధ్యక్షుడిగా రికార్డుల్లోకి ఎక్కారు.

2011 నుంచి 2019 వరకు సింగపూర్ డిప్యూటీ ప్రధానిగా పనిచేసిన షణ్ముగరత్నంకు 90.4 శాతం ఓట్లు రాగా.. ఆయన ప్రత్యర్థులు ఎంజ్ కోక్ సోంగ్, టాన్ కిన్ లియాన్‌లకు వరుసగా 15.7 శాతం, 13.88 శాతం ఓట్లు వచ్చినట్లు ఎన్నికల కమిటీ అధికార ప్రతినిధి వెల్లడించారు. అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన థర్మన్‌కు ప్రధాని లీ సీన్ లూంగ్ అభినందనలు తెలిపారు. సింగపూర్ ప్రజలు నిర్ణయాత్మక ఓట్ల తేడాతో థర్మన్ షణ్ముగరత్నంను తదుపరి అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని ఆయన తెలిపారు. తమ దేశాధినేతగా థర్మన్ షణ్ముగరత్నం విదేశాల్లో ప్రాతినిథ్యం వహిస్తారని పేర్కొన్నారు.

ప్రస్తుతం అధ్యక్షురాలిగా ఉన్న హలీమా యాకూబ్ పదవీ కాలం సెప్టెంబర్ 13న ముగియనుంది. షణ్ముగరత్నం సింగపూర్‌లో 2011 నుంచి 2019 మధ్య కాలంలో ఆర్థిక, విద్యాశాఖ మంత్రిగా, ఉపముఖ్యమంత్రిగా సేవలందించారు. అంతేగాక, షణ్ముగరత్నం రాజకీయాల్లోకి రాకముందు ఆర్థిక వేత్తగా, పౌర సేవకుడిగా ఉన్నారు. సింగపూర్ నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన షణ్ముగం అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

Share This Article
Leave a comment