టాలీవుడ్ నుంచి ఒకేఒక్కడు… అల్లు అర్జున్

Telugu BOX Office

అల్లు అర్జున్‌ తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఆయనకున్న క్రేజ్‌ మాటల్లో వర్ణించలేనిది. బాలనటుడిగా కెరీర్‌ను ఆరంభించిన ఆయన ‘గంగోత్రి’తో హీరోగా తెరంగేట్రం చేశారు. పరిశ్రమలోకి అడుగుపెట్టిన నాటి నుంచి ఎదురైన ప్రతి సవాల్‌ను, విమర్శను స్వీకరించి నటుడిగా తనని తాను మలుచుకున్నారు. ‘పుష్ప ది రైజ్‌’ తో బాక్సాఫీస్‌ వద్ద తన సత్తా చాటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 69వ జాతీయ చలన చిత్ర అవార్డుల్లో ఉత్తమ నటుడిగా ఎంపికయ్యారు. జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి తెలుగు హీరోగా ఆయన సరికొత్త రికార్డు సృష్టించారు.

ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య మనవడిగా.. అల్లు అరవింద్‌ తనయుడిగా.. అగ్ర కథానాయకుడు చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు అల్లు అర్జున్‌. 1985లో విడుదలైన ‘విజేత’, 1986లో వచ్చిన ‘స్వాతిముత్యం’ చిత్రాలతో ఆయన బాలనటుడిగా పరిచయమయ్యారు. 2003లో విడుదలైన ‘గంగోత్రి’ బాక్సాఫీస్‌ వద్ద మంచి టాక్‌ అందుకున్నా.. బన్నీ ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. ఆయన లుక్స్‌ను హేళన చేస్తూ పలువురు తీవ్రంగా కామెంట్స్‌ చేశారు. ఆ విమర్శలకు బన్నీ ‘ఆర్య’తో దీటుగా సమాధానం చెప్పారు. హేళన చేసిన వారితోనే ‘ఫీల్‌ మై లవ్‌’ అనిపించారు. ఈ సినిమా తర్వాత ఆయన్ని అభిమానించే వారి సంఖ్య ఇతర రాష్ట్రాలకు పాకింది. ‘కన్నవాళ్ల ప్రేమ ఎలాంటిదో అభిమానుల ప్రేమ కూడా అలాంటిదే’ అని చెబుతూ అభిమానులనూ తన కుటుంబ సభ్యుల్లాగే భావిస్తారాయన. ‘ఎవరికైనా ఫ్యాన్స్‌ ఉంటారు. నాకు మాత్రం ఆర్మీ ఉంటుంది. నా జీవితంలో నేను సాధించిన అతిపెద్ద ఆస్తి అభిమానులే’ అంటూ ఆయన మురిసిపోతుంటారు.

టాలీవుడ్‌లో సిక్స్‌ప్యాక్‌ మొదలైంది అల్లు అర్జున్‌తోనే. ‘దేశ ముదురు’ చిత్రంలో ఆయన తొలిసారిగా ఆరు పలకల దేహంతో కనిపించారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద బ్లాక్‌ బస్టర్‌ విజయం సాధించింది.ఇక, 2010లో ‘వరుడు’ రిలీజైనప్పుడు బన్నీ లుక్‌కి చాలామంది అమ్మాయిలు ఫిదా అయ్యారు. తమకు కాబోయే భర్త కూడా అలాగే సిక్స్‌ప్యాక్‌ లుక్‌తో మండపంలోకి రావాలనుకున్నారు. 2021లో విడుదలైన ‘పుష్ప’తో ఆయన ప్రపంచవ్యాప్తంగా ట్రెండ్‌ సెట్‌ చేశారు. ‘పుష్ప’ అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు..’ అంటూ ఒక్క డైలాగ్‌తో సోషల్‌మీడియాని షేక్‌ చేశారు.

టాలీవుడ్‌లో డ్యాన్స్‌తో అదరగొట్టే హీరోల జాబితాలో అల్లు అర్జున్‌ తప్పక ఉంటారు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన స్టెప్పేస్తే ‘టాప్‌ లేచిపోద్ది’. దక్షిణాదిలో మంచి డ్యాన్సర్‌గా పేరుపొందిన ఆయన మాత్రం.. ‘నన్ను అందరూ మంచి డ్యాన్సర్‌ అంటుంటారు. నా డ్యాన్స్‌లోనూ తప్పులుంటాయి. కానీ ఆ సంగతి ఎవరికీ తెలీదు. అయినా.. డ్యాన్స్‌ పెద్ద విషయం కాదనేది నా అభిప్రాయం. చిరంజీవిగారి పాటలు రీమేక్‌ చేయాలంటే.. ఆయనకు సరితూగలేమని భయమేస్తుంది’ అని అంటూ తన నిరాడంబరతను చాటుకుంటారు.

‘ఆర్య’తో బన్నీ కెరీర్‌లో ఎప్పటికీ మర్చిపోలేని విజయాన్ని అందించారు సుకుమార్‌. ఆ తర్వాత వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘ఆర్య2’ పర్వాలేదనిపించింది. దాదాపు పదేళ్ల తర్వాత ‘పుష్ప’ కోసం అల్లు అర్జున్‌, సుకుమార్‌ చేతులు కలిపారు. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో అల్లు అర్జున్‌ మునుపెన్నడూ లేనివిధంగా ఊరమాస్‌ లుక్‌లో దర్శనమిచ్చారు. ‘పుష్పరాజ్‌’ పాత్రలో ఆయన నటనకు బాక్సాఫీస్‌ సైతం సలాం కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా రూ.365 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసింది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్‌ అందించిన సంగీతం సినీ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ చిత్రానికి గాను దేవీశ్రీ ప్రసాద్ కూడా బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్‌‌గా జాతీయ అవార్డు అందుకోవడం విశేషం.

Share This Article
Leave a comment