జంతుప్రేమ నాకు అలా మొదలైంది : అనంత్ అంబానీ

Telugu BOX Office

అపర కుబేరుడు ముకేశ్‌ అంబానీ వారసుల్లో ఒకడిగా అనంత్‌ అంబానీకి ఉన్న గుర్తింపు తెలిసిందే. తన ప్రీవెడ్డింగ్‌ వేడుకల్ని అంగరంగవైభవంగా నిర్వహించి… సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్‌ అయిన అనంత్‌ తన గురించి మనకు తెలిసింది కొంతే.. తెలియాల్సింది కొండంత ఉందని ఈ వేడుకల సందర్భంగా అందరికీ అర్ధమైంది. అయితే తాజాగా ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో అనంత్‌ తనలోని మరో కోణాన్ని ఆవిష్కరించాడు. తన వ్యక్తిగత జీవితం, ఆరోగ్య సమస్యలు ఇలా అన్ని విషయాల గురించి పూసగుచ్చినట్లు వివరించాడు.

అందుకే మళ్లీ బరువు పెరిగా
చిన్నతనం నుంచీ నాకు ఆస్తమా ఉండటంతో స్టెరాయిడ్లు వాడేవాడిని. ఆ మందుల కారణంగా ఆకలి పెరగడంతో విపరీతంగా తినేసేవాడిని. ఫలితంగా దాదాపు రెండువందల కిలోల బరువు పెరిగా. ఒకానొక సమయంలో బరువు తగ్గేందుకు ఆహారంలో మార్పులు చేసుకుంటూనే రోజూ ఇరవై కిలోమీటర్లు నడవడంతోపాటు యోగా, ఇతర వ్యాయామాలూ చేసేవాడిని. దాంతో పద్దెనిమిది నెలల్లో దాదాపు వందకిలోల వరకూ తగ్గా. కానీ స్టెరాయిడ్ల కారణంగా మళ్లీ బరువు పెరిగిపోయా.

రాధిక… నా చిన్ననాటి స్నేహితురాలు
నేనూ, రాధికా చిన్నతనం నుంచీ స్నేహితులం. చదువుల కారణంగా ఇద్దరం వేర్వేరు కాలేజీలకూ, ప్రాంతాలకూ వెళ్లిపోయినా ఆ స్నేహం అలాగే కొనసాగింది. నేను అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు రాధిక చెప్పిన మాటలూ, అందించిన ధైర్యం మర్చిపోలేను. నిజానికి నేను జంతు ప్రేమికుడిని కావడం, అనారోగ్యం… వంటి కారణాలతో నాకు అసలు పెళ్లి కాదని అనుకునేవాడిని. అలాంటిది రాధికను చూశాక తను నా కలల రాణి అనిపించింది. అన్నింటికీ మించి.. తను కూడా నాలా జంతుప్రేమికురాలే.

తిరుమల వెంకన్న అంటే భక్తి
మా ఇంట్లో అందరికీ దైవభక్తి ఎక్కువ. నాన్న వినాయకుడిని పూజిస్తే.. అన్న శివ భక్తుడు. అమ్మ నవరాత్రుల సమయంలో ఉపవాసం ఉంటుంది. నాకు వేంకటేశ్వరస్వామి అంటే నమ్మకం. అందుకే కుదిరినప్పుడల్లా తిరుమలకు వెళ్లి వేంకటేశ్వరస్వామిని దర్శించుకుంటా. అలా వెళ్లినప్పుడే ఓసారి నా దగ్గరున్న ఏనుగుల్లో ఒకదాన్ని ఆలయానికి కానుకగా ఇచ్చా.

వాళ్లిద్దరే బలం
మా అన్న ఆకాశ్‌ నాకు రాముడిలాంటివాడైతే అక్క ఈషా అమ్మతో సమానం. మా బంధం ‘ఫెవిక్విక్‌’తో అతికించినంత బలంగా ఉంటుంది. నేను చేసే ప్రతి పని లేదా తీసుకునే ప్రతి నిర్ణయం వెనుక వాళ్లిద్దరి సలహా తప్పనిసరిగా ఉంటుంది. అక్కా అన్నా ఏం చెప్పినా చేస్తాను కాబట్టే వాళ్లకు నేను హనుమంతుడిలాంటి వాడినని అనుకుంటా.


అందుకే ‘వన్‌తార’
నేను కూడా అన్నలా బ్రౌన్‌ యూనివర్సిటీలో చదువుకుని రిలయెన్స్‌లో చేరినా.. జంతువుల సంరక్షణకోసం పనిచేయడం మొదలుపెట్టా. అందులో భాగంగానే ‘వన్‌తార’ పేరుతో జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రారంభించా. ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతువుల్ని కాపాడటం, వాటికి అవసరమైన వైద్య చికిత్సలు చేయించడం, నివాసం కల్పించడం వంటివి వన్‌తార కార్యక్రమాల్లో కొన్ని. ఇప్పటికే మా ‘రాధాకృష్ణ ఎలిఫెంట్‌ వెల్ఫేర్‌ ట్రస్ట్‌’లో భాగంగా రెండువందల ఏనుగుల్ని సంరక్షించి వాటికి అవసరమైన ఆయుర్వేద చికిత్సలూ శస్త్రచికిత్సలూ చేయిస్తున్నాం.

జంతుప్రేమ అలా వచ్చిందే…
అమ్మానాన్నలిద్దరూ జంతు ప్రేమికులే. వాళ్లను చూస్తూ పెరగడం వల్లే నాకూ వాటిపైన ఇష్టం పెరిగింది. జంతువులకు సంబంధించిన ప్రతి విషయాన్నీ నేను చెప్పగలను. అందుకే నా స్నేహితులు నన్ను ‘యానిమల్స్‌ ఎన్‌సైక్లోపీడియా’ అని పిలుస్తారు. ఆ ఇష్టంతోనే ఇంట్లోనూ కొన్నిరకాల ఎగ్జోటిక్‌ పెట్స్‌ను పెంచుతున్నా. నా దగ్గర అలస్కన్‌ మలామ్యూట్‌ జాతికి చెందిన కుక్క కూడా ఉంది. అది ఇక్కడి వేడి వాతావరణాన్ని తట్టుకోలేదు. అందుకే అది ఉండే చోట పూర్తిగా చల్లగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయించా.

Share This Article
Leave a comment