‘చంద్రముఖి-2’ రివ్యూ

Telugu BOX Office
ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే ‘చంద్రముఖి 2’
2.5

చిత్రం: చంద్రముఖి -2; నటీనటులు: రాఘవా లారెన్స్‌, కంగనా రనౌత్‌, మహిమా నంబియార్‌, రాధిక, రావు రమేశ్‌, వడివేలు, లక్ష్మీ మేనన్‌, సుబిక్షా, తదితరులు; సంగీతం: ఎం.ఎం.కీరవాణి; ఎడిటింగ్‌: అంథోనీ; సినిమాటోగ్రఫీ: ఆర్‌.డి.రాజశేఖర్‌; నిర్మాణ సంస్థ: లైకా ప్రొడెక్షన్స్‌; నిర్మాత: సుభాస్కరన్‌ అలీరాజ్‌; రచన, దర్శకత్వం: పి.వాసు; విడుదల తేదీ: 28-09-2023

హారర్ మూవీలు చేయడంలో, తీయడంలో రాఘవ లారెన్స్ నేర్పరి. హారర్ కామెడీని మిక్స్ చేసి లారెన్స్ ఎన్నో సార్లు హిట్ల మీద హిట్లుకొట్టాడు., ఈ సారి హారర్, థ్రిల్లర్, కామెడీ ఇలా అన్ని జానర్లను కలిపి చంద్రముఖి 2 అంటూ పి. వాసు డైరెక్షన్‌లో పని చేశాడు. ఇక చంద్రముఖిగా జ్యోతిక అదరగొట్టేసింది. ఈ పార్ట్ 2లో కంగనా ఏ విధంగా చేసింది? లారెన్స్, కంగనా, పి వాసుల ప్రయత్నం జనాలను ఏ మేరకు ఆకట్టుకుందో ఓ సారి చూద్దాం.

రంగనాయకి (రాధిక శరత్‌ కుమార్‌)ది పెద్ద కుటుంబం. అయితే ఆ కుటుంబాన్ని అనేక సమస్యలు వేధిస్తుంటాయి. ఈ కష్టాల నుంచి గట్టెక్కాలంటే వేటయ్యపాలెంలో ఉన్న వారి కుల దైవం దుర్గమ్మ గుడిలో పూజ జరిపించాలని స్వామీజీ (రావు రమేష్‌) సలహా ఇస్తారు. దీంతో రంగనాయకి కుటుంబ సమేతంగా వేటయ్యపాలెంకు పయనమవుతుంది. ఆ కుటుంబానికే చెందిన మరో ఇద్దరు పిల్లల్ని తీసుకొని మదన్‌ (రాఘవ లారెన్స్‌) కూడా ఆ ఊరు వస్తాడు. వారంతా కలిసి అక్కడే గుడికి సమీపంలో ఉన్న చంద్రముఖి ప్యాలెస్‌ (తొలి చంద్రముఖి సినిమా కథ జరిగిన ప్యాలెస్‌)లోకి అద్దెకు దిగుతారు. అయితే ఆ ఇంట్లోకి అడుగు పెట్టి దుర్గ గుడిలో పూజలు చేయాలని ప్రయత్నాలు ప్రారంభించినప్పటి నుంచి రంగనాయకి కుటుంబంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. 17ఏళ్ల క్రితం బయటకి వెళ్లిపోయిన చంద్రముఖి ఆత్మ తిరిగి వచ్చి రంగనాయకి కుటుంబంలో ఒకరిని ఆవహిస్తుంది. మరి ఆ తర్వాత ఏం జరిగింది? మళ్లీ తిరిగొచ్చిన చంద్రముఖి 200ఏళ్ల క్రితం చనిపోయిన వేటయ్య రాజు అలియాస్‌ సెంగోటయ్య (లారెన్స్‌) మీద ఎందుకు పగ తీర్చుకోవాలనుకుంది. వీళ్లిద్దరి కథేంటి? వీరి కథ ఎలా కంచికి చేరింది? అన్నది తెరపై చూసి తెలుసుకోవాలి.

చంద్రముఖిని చూసిన ప్రేక్షకుల కళ్లు.. నాగవల్లిని చూడలేకపోయాయి. చంద్రముఖిని ఫాలో అయి నాగవల్లి సినిమాను తీశారు. సేమ్ టెంప్లట్ వాడారు. పాత్రధారులు మారుతారు అంతే. ఇక ఇప్పుడు చంద్రముఖి 2 అని తీశారు. ఇందులోనూ అంతే. కొత్తగా ఏం అనిపించదు. కనిపించదు. ఆ బంగ్లాలో దక్షిణం వైపు వెళ్లొద్దని హెచ్చరిస్తారు.. కానీ వెళ్తారు.. చంద్రముఖి ఎవరిని ఆవహించిందో అనుమానం కలిగేలా ఓ రెండు పాత్రలను తీసుకొస్తారు.. ఇక ఇంటర్వెల్‌కు అసలు కథ రివీల్ చేస్తారు. సెకండాఫ్‌లో కాస్త ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. చివరకు ఆ చంద్రముఖిని మాయచేసి, పిచ్చి దాన్నిలా చేసి ఎవరో ఒకరిని కాల్చేయడం, తలనరికేయడం వంటివి చేస్తారు. దీంతో ఆత్మ శాంతపడి.. ఆ చంద్రముఖి వెళ్లిపోతుంది.


‘చంద్రముఖి’లో కనిపించిన థ్రిల్, వినోదం ఈ సినిమాలో పండలేదు. దర్శకుడు ఒకే తరహా స్క్రీన్‌ప్లేతో ముందుకెళ్లడం.. కథనంలో పెద్దగా సంఘర్షణ లేకపోవడం ఇందులో ఉన్న ప్రధాన లోపం. ఇక హీరో పాత్రను కూడా దర్శకుడు చాలా సామాన్యుడిలాగే చూపించాడు. తొలి భాగంలో గంగ (జ్యోతిక)ను చంద్రముఖి ఆవహించినట్లు రజనీ కనిపెట్టే తీరు.. దాన్ని బయటపెట్టే విధానం చాలా ఆసక్తి రేకెత్తిస్తుంది. ఇందులో హీరో పాత్ర అలాంటి ప్రయత్నాలేమీ చేయదు. అలాగే, చంద్రముఖి ఆత్మ ఎవరిని ఆవహిస్తుంది, దాని వల్ల పీడించబోయే యువతి ఎవరన్నది సినిమా ఆరంభంలోనే అర్థమైపోతుంది. విరామ సన్నివేశాలు మరీ కొత్తగా లేకున్నా ద్వితీయార్ధంపై ఆసక్తి పెంచేలా చేస్తాయి.

ద్వితీయార్ధాన్ని ఆరంభించిన తీరు చప్పగా ఉన్నా.. చంద్రముఖి – వేటయ్య రాజు ఫ్లాష్‌బ్యాక్‌ మొదలయ్యాక కథ వేగం పుంజుకుంటుంది. తొలి భాగంలో చంద్రముఖి ఆత్మ వల్ల కథానాయిక మాత్రమే బాధపడితే.. ఈ రెండో భాగంలో రాజు ఆత్మ వల్ల హీరో కూడా సమస్యల్లో చిక్కుకోవడం కొత్తగా అనిపిస్తుంది. అయితే ఈ ఇద్దరికీ సంబంధించిన గతంలోనూ బలమైన సంఘర్షణ కనిపించదు. చంద్రముఖి పాత్ర వేటయ్యపై పగ పెంచుకోవడానికి వెనకున్న కారణం తొలి చంద్రముఖిలాగే ఉంటుంది. అయితే దీంట్లో కాస్త రిలీఫ్‌ అనిపించిన విషయమేంటంటే ఆ చంద్రముఖి పాత్రలో కొత్తగా కంగనా రనౌత్‌ కనిపించడమే. చంద్రముఖిని అంతమొందించేందుకు వేసే ప్రణాళిక కూడా పాత చింతకాయ పచ్చడిలాగే ఉంటుంది. పతాక సన్నివేశాలు ఊహకు తగ్గట్లుగానే ఉన్నా.. కంగనా-లారెన్స్‌ల మధ్య వచ్చే పోరాటం ఆకట్టుకుంటుంది.

ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించే ‘చంద్రముఖి 2’
2.5
Acting 3 out of 5
Production 3 out of 5
Music 2 out of 5
Direction 2 out of 5
Share This Article
Leave a review