Jawan: జవాన్.. మూవీ రివ్యూ

Telugu BOX Office
జవాన్.. పక్కా మాస్ ఎంటర్‌టైనర్
3.5

చిత్రం: జవాన్‌; నటీనటులు: షారుక్‌ ఖాన్‌, నయనతార, విజయ్‌ సేతుపతి, దీపిక పదుకొణె, ప్రియమణి, సునీల్‌ గ్రోవర్‌, సాన్య మల్హోత్ర, యోగిబాబు తదితరులు; సంగీతం: అనిరుధ్‌ రవిచందర్‌; సినిమాటోగ్రఫీ: జి.కె.విష్ణు; ఎడిటింగ్‌: రుబెన్‌; నిర్మాతలు: గౌరీ ఖాన్‌, గౌరవ్‌ వర్మ; స్క్రీన్‌ప్లే: రమణ గిరివసన్‌; కథ, దర్శకత్వం: అట్లీ; విడుదల: 07-09-2023

‘ప‌ఠాన్‌’తో మ‌ళ్లీ ఫామ్‌లోకి వ‌చ్చిన షారుక్‌ ఖాన్ ఈ సారి ‘జ‌వాన్‌’గా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంత ఆత్రుత‌గా ఎదురుచూశారో దాని అడ్వాన్స్ బుకింగ్స్ చాటి చెప్పాయి. బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ ఖాన్… తమిళ ద‌ర్శకుడు అట్లీ క‌లిసి చేసిన సినిమా కావ‌డంతో ఉత్తరాదిలోనే కాకుండా ద‌క్షిణాదిలోనూ ఆస‌క్తిని, అంచ‌నాల్ని పెంచింది. మ‌రి సినిమా ఎలా ఉంది?షారుక్‌ తన విజ‌య ప‌రంప‌ర‌ని కొనసాగించాడా?.. రివ్యూలో చూద్దాం

గుండుతో క‌నిపించే ఓ వ్యక్తి త‌న గ్యాంగ్‌లోని ఆరుగురు అమ్మాయిలతో క‌లిసి ముంబైలోని మెట్రో రైల్‌ని హైజాక్ చేస్తాడు. ప్రభుత్వాన్ని రూ.40 వేల కోట్లు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేస్తాడు. ఆ క్రమంలో ప్రయాణికుల ప్రాణాల్ని తీయ‌డానికి కూడా వెన‌కాడ‌డు. హైజాక‌ర్లని ప‌ట్టుకోవ‌డం కోసం ప్రభుత్వం ఐపీఎస్ న‌ర్మదని రంగంలోకి దింపుతుంది. అయినా తాను అనుకున్నది సాధించి చాక‌చ‌క్యంగా త‌ప్పించుకుంటాడు. ఆ రూ.40 వేల కోట్లని పేద‌ల ఖాతాల్లో జ‌మ చేస్తాడు.

న‌యా రాబిన్‌ హుడ్‌ లాంటి ఆ హైజాక‌ర్ వ్యవ‌హారం సంచ‌ల‌నంగా మారుతుంది. న‌ర్మద‌, త‌న బృందం సాగించిన ప‌రిశోధ‌న‌లో హైజాక‌ర్… జైల‌ర్ ఆజాద్ (షారుక్‌ ఖాన్) పోలిక‌ల‌తో ఉన్నట్టు తేలుతుంది. జైల‌ర్ ఆజాద్ హైజాక‌ర్‌గా మారాడా? ఆయ‌న వెంట ఉన్న ఆరుగురు యువ‌తులు ఎవ‌రు? ఒక‌ప్పుడు ఆర్మీలో ప‌నిచేసిన విక్రమ్ రాథోడ్ (షారుక్‌ ఖాన్‌)కీ, ఆజాద్‌కీ సంబంధం ఏంటి? ప‌్రపంచంలోనే ఐదో అతి పెద్ద ఆయుధాల వ్యాపారి కాళీ గైక్వాడ్ (విజ‌య్ సేతుప‌తి) క‌థేంటి? త‌దిత‌ర విష‌యాలు తెలియాలంటే థియేటర్లో చూడాల్సిందే.

అవినీతితో నిండిపోయిన వ్యవస్థపై ఒక హీరో చేసే పోరాటాలు వెండితెరపై చాలానే చూశాం. ఈ సినిమాలోనూ హీరో అవినీతి, సామాజిక సమస్యలపై పోరాడతాడు. అయితే, ఇప్పటి వరకు వెండితెరపై చూడని ఒక కొత్త అవినీతిని, కార్పోరేట్ మాఫియాను ఈ సినిమాలో చూపించారు దర్శకుడు అట్లీ. ఆర్మీకి ఎందుకూ పనికిరాని రైఫిల్స్‌ను సరఫరా చేస్తున్న ఒక కంపెనీపై తిరగబడిన జవాన్‌కు ఎలాంటి దుస్థితి పట్టిందనే విషయాన్ని వినోదభరితంగా, ట్విస్టులు ఇస్తూ చూపించారు. సినిమా మొత్తాన్ని తన రేసీ స్క్రీన్‌ప్లేతో పరిగెత్తించారు. ముఖ్యంగా షారుఖ్ ఖాన్ అభిమానులకు ఈ సినిమా గూస్‌బంప్స్ ఇస్తుంది.

సెకండాఫ్‌లో ఈవీఎమ్ నేప‌థ్యంలో స‌న్నివేశాలు సినిమాకే హైలైట్‌. షారుక్‌ క‌నిపించిన‌ప్పుడంతా అభిమానులు చ‌ప్పట్లు కొట్టేలా హీరోయిక్‌గా స‌న్నివేశాల్ని తీర్చిదిద్దాడు ద‌ర్శకుడు. ప‌తాక స‌న్నివేశాలు, పోరాట ఘ‌ట్టాలు అదరగొట్టేశాడు. షారుక్‌ అభిమానుల‌కి కావ‌ల్సినంత సంద‌డిని పంచే ఈ సినిమా… మాస్ మ‌సాలా సినిమాల ప్రియుల‌కీ మంచి కాల‌క్షేపాన్నిస్తుంది. హ్యాపీ ఓన‌మ్ అంటూ మాధ‌వ‌న్ నాయ‌ర్ పాత్రలో సంజ‌య్ ద‌త్ చేసిన సంద‌డి సినిమాలో కొస‌మెరుపు.

కాళీ గైక్వాడ్‌గా విజ‌య్ సేతుప‌తి ద్వితీయార్ధంపై ప్రభావం చూపిస్తారు. ప్రియ‌మ‌ణి, సాన్య మ‌ల్హోత్రా, రిద్ధి, సంజీత త‌దిత‌రులకి కీల‌క‌మైన పాత్రలు ద‌క్కాయి. సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. అనిరుధ్ పాట‌ల కంటే కూడా నేప‌థ్య సంగీతంతో షారుక్‌ హీరోయిజాన్ని మ‌రోస్థాయికి తీసుకెళ్లాడు. డైరెక్టర్ క‌థ‌ని మొద‌లుపెట్టిన విధానం, ముగింపు బాగుంది.

జవాన్.. పక్కా మాస్ ఎంటర్‌టైనర్
3.5
Acting 4 out of 5
Diretion 4 out of 5
Production 3 out of 5
Music 3 out of 5
Share This Article
Leave a review