మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి.. రివ్యూ

Telugu BOX Office

చిత్రం: మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి; నటీనటులు: నవీన్‌ పొలిశెట్టి, అనుష్క, జయసుధ, మురళీ శర్మ, తులసి, అభినవ్‌ గోమఠం, సోనియా దీప్తి, హర్షవర్ధన్, భద్రమ్‌ తదితరులు; సంగీతం: రధన్‌; నేపథ్య సంగీతం: గోపీసుందర్‌; ఛాయాగ్రహణం: నీరవ్‌ షా; రచన, దర్శకత్వం: పి.మహేష్‌బాబు; నిర్మాణ సంస్థ: యూవీ క్రియేషన్స్‌; విడుదల తేదీ: 07-09-2023

‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు నవీన్‌ పొలిశెట్టి. వైవిధ్యమైన నాయికా ప్రాధాన్య చిత్రాలు ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తానేంటో నిరూపించుకుంది అనుష్క. ఇప్పుడీ ఇద్దరి కాంబినేషన్‌ నుంచి వచ్చిన కొత్త సినిమానే ‘మిస్‌ శెట్టి.. మిస్టర్‌ పొలిశెట్టి’. పి.మహేష్‌బాబు తెరకెక్కించారు. టీజర్, ట్రైలర్లు వినోదాత్మకంగా కనిపించడం.. అనుష్క-నవీన్‌ల లవ్‌ ట్రాక్‌లో ఓ ఆసక్తికర అంశం దాగి ఉండటం ప్రేక్షకుల దృష్టి ఈ చిత్రంపై పడింది. ఈ సినిమా ఎలా ఎందో రివ్యూలో చూద్దాం..

అన్వి అలియాస్‌ అన్విత రవళి శెట్టి (అనుష్క) మాస్టర్‌ చెఫ్‌. లండన్‌లో ఓ పెద్ద స్టార్‌ హోటల్‌లో పని చేస్తుంటుంది. తనకు ప్రేమ, పెళ్లి, రిలేషన్‌ షిప్స్‌పై ఏమాత్రం నమ్మకం ఉండదు. దీనికి కారణం తన తల్లి (జయసుధ)ని ప్రేమించి.. పెళ్లి చేసుకున్న వాడు మోసం చేయడమే. అయితే, తన తల్లి అనారోగ్యంతో కన్నుమూశాక అన్వి ఒంటరవుతుంది. దాని నుంచి బయట పడటానికి తోడు వెతుక్కోవాలని నిర్ణయించుకుంటుంది. ఈ క్రమంలోనే ఓ సాహసోపేతమైన నిర్ణయం తీసుకుంటుంది. పెళ్లి చేసుకోకుండానే ఐయూఐ విధానంలో ఓ బిడ్డకు జన్మనివ్వాలనుకుంటుంది. దీనికోసం వీర్య దాత కోసం వెతుకుతుండగా.. స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి (నవీన్‌ పొలిశెట్టి) పరిచయమవుతాడు. తన బిడ్డకు ఎలాంటి తండ్రి కావాలనుకుంటుందో అలాంటి లక్షణాలన్నీ సిద్ధులో కనిపించడంతో అతని సహాయం తీసుకోవాలని అనుకుంటుంది.

అయితే అన్వి తనపై చూపిస్తున్న కేర్‌ను చూసి ఆమెతో ప్రేమలో పడిన సిద్ధు ఓరోజు తనకు ప్రపోజ్‌ చేస్తాడు. కానీ, ప్రేమ, పెళ్లిపై నమ్మకం లేని అన్వి తాను సిద్ధుకు దగ్గరవ్వడానికి వెనకున్న అసలు కారణాన్ని వివరిస్తుంది. తల్లి కావడానికి తనకు సహాయం చేయమని కోరుతుంది. అయితే ఆమె నిర్ణయం తెలిసి సిద్ధు ఒక్కసారిగా కంగు తింటాడు. పెళ్లి చేసుకోకుండా బిడ్డకు జన్మనివ్వాలనుకోవడం సమాజానికి విరుద్ధమని తన అభిప్రాయాన్ని వెల్లడిస్తాడు. పెళ్లి ప్రతిపాదన తీసుకొస్తాడు. దీంతో ఇద్దరి మధ్య దూరం పెరుగుతుంది. మరి అన్విత తాను అనుకున్నది సాధించిందా?.. సిద్ధు తన ప్రేమను గెలుచుకోవడానికి ఏం చేశాడు? ప్రేమ, పెళ్లికి వ్యతిరేకంగా ఉన్న అన్వితను ఎలా మార్చాడు? చివరికి ఇద్దరూ కలిశారా? లేదా? అన్నది మిగతా కథ.

ఈ సినిమాకైనా ఈడు జోడు సెట్ అయితే సినిమా సూపర్ సెట్టూ.. కానీ ఈ కథకి ఈడు జోడు సెట్ కాకపోవడమే పెద్ద ఎస్సెట్. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ కథ అలాంటిది మరి. సినిమాలో ఓ సీన్‌లో నర్సు అన్నట్టుగా.. చూడ్డానికి అనుష్క.. నవీన్ పోలిశెట్టికి సిస్టర్ మాదిరే ఉంది. కానీ ‘స్పెర్మ్ డొనేషన్’ అనే కామన్ పాయింట్‌‌కి స్టాండప్ కామెడీ జోడించి ఈ జోడీని ఆడియన్స్‌కి కనెక్ట్ చేశారు దర్శకుడు. అద్భుతమైన కథ.. అమోఘమైన కథ.. గుండెల్ని మెలిపెట్టే కథ.. ఇలాంటి బహు బ్రహ్మాండమైన పొగడ్తలకు అతీతంగా సింపుల్ కథను ట్రెండీగా చూపించారు. ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమాలో మిస్ శెట్టిగా అనుష్క శెట్టి.. మిస్టర్ పోలిశెట్టిగా నవీన్ పోలిశెట్టి రాకుండా వేరే వాళ్లు చేసి ఉంటే మాత్రం రిజల్ట్ మరో విధంగా ఉండేది కానీ.. వీళ్ల జోడీనే సినిమాని నిలబెట్టింది. ‘అన్నీ అయిపోయిన తర్వాత ఏమైనా మిగిలుంటే… అది ప్రేమ’ అని ప్రేమపై నమ్మకం కోల్పోయిన అమ్మాయి.. ‘నాలో ఊపిరి పోసుకున్న ప్రాణం మాత్రమే కాదు.. ప్రేమ కూడా’.. అని మారడానికి దారితీసిన పరిస్థితులే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా.

స్టాండప్‌ కమెడియన్‌ సిద్ధు పొలిశెట్టి పాత్రలో నవీన్‌ పొలిశెట్టిని తప్ప మరొకరిని ఊహించుకోలేం. తనదైన కామెడీ టైమింగ్‌తో ఆ పాత్రను అవలీలగా చేసి చూపించాడు. ప్రేక్షకుల్ని ఆద్యంతం కడుపుబ్బా నవ్వించాడు. పతాక సన్నివేశాల్లో ఎమోషన్‌ను చక్కగా పండించాడు. అన్విత పాత్రలో అనుష్క ఆద్యంతం చాలా సెటిల్డ్‌గా నటించింది. దర్శకుడు ఆమె పాత్రను చాలా హుందాగా తీర్చిదిద్దారు. ఆమెకు.. నవీన్‌కు మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. క్లైమాక్స్‌లో భావోద్వేగభరితమైన నటనతో ఆమె అందరి మదిని బరువెక్కిస్తుంది. ఆమె తల్లిగా జయసుధ కొద్దిసేపు నిడివి ఉన్న పాత్రలో కనిపించారు. నాజర్, మురళీ శర్మ, తులసి.. తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉంటాయి. మొత్తంగా ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ గురించి ఒక్క ముక్కలో చెప్పాలంటే.. వీర్యదాతా సుఖీభవ!! మిస్ శెట్టి ఎమోషన్స్ పండించింది.. మిస్టర్ పోలిశెట్టి కామెడీ పండించాడు. హాయిగా నవ్వుకోడానికి ఓ సారి చూడొచ్చు.

Share This Article
Leave a comment