సినిమాల్లో సక్సెస్.. జీవితంలో ఫెయిల్యూర్… స్టార్ హీరోయిన్ విషాద కథ

Telugu BOX Office

మనీషా కొయిరాలా ఈ పేరు తెలుగువారికి సైతం పరిచయం చేయాల్సిన పనిలేదు. ‘క్రిమినల్‌’ తెలుగు తెరకు పరిచయమైన ఈ నేపాలీ ముద్దుగుమ్మ.. ఆ తర్వాగ ఒకేఒక్కడు సినిమాలో ‘నెల్లూరి నెరజాణ’ అంటూ తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో ఆమె నటించిన చిత్రాలు సూపర్ హిట్‌గా నిలిచాయి. మనీషా కొయిరాలా ఒకప్పుడు తిరుగులేని అందం, అభినయం ఆమె సొంతం. బాలీవుడ్ సినీ ప్రపంచంలో మనీషాకు సరితూగే నటి అప్పట్లో మరొకరు లేరనే చెప్పాలి. బొంబాయి, భారతీయుడు వంటి చిత్రాలతో తమిళంలో మంచి స్థానాన్ని సంపాదించుకుంది మనీషా కొయిరాలా.

మనీషా నేపాల్‌లోని సంపన్న కుటుంబంలోనే జన్మించింది. నేపాల్‌లో ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన తొలి ప్రధాని మనవరాలు మనీషా. అక్కడ రాజకీయ పరిస్థితులు దిగజారడంతో మనీషా తల్లిదండ్రులు వారణాసిలో స్థిరపడ్డారు. అయితే పదో తరగతి తర్వాత నేపాల్‌కు తిరిగి వచ్చిన మనీషా కొయిరాలా ఓని అనే నేపాలీ చిత్రం ద్వారా నటనా ప్రపంచంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత భారతదేశానికి తిరిగి వచ్చి మోడలింగ్‌పై ఎక్కువ దృష్టి పెట్టింది. అలా హిందీ సినిమాల్లో అవకాశం వచ్చింది.

సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకున్న భామ.. వ్యక్తిగత జీవితంలో మాత్రం సక్సెస్ కాలేకపోయింది. ఆమెకు పెళ్లయిన రెండేళ్లకే విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచింది. నేపాల్‌కి చెందిన సమ్రాట్‌ దహల్‌తో 2010లో వివాహం జరగగా.. పెళ్లైన ఆరు నెలలకే వీరిమధ్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నానని… కానీ ఆర్నెళ్లకే తమ మధ్య గొడవలు మొదలయ్యాయని… తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడంటూ గతంలో ఓ ఇంటర్వూలో వెల్లడించింది. అయితే తాజాగా ఆమె తన ఇన్‌స్టాలో కొన్ని ఫోటోలు షేర్ చేసింది. బ్యాక్‌ టూ ఖాఠ్మండు అంటూ తల్లిదండ్రులతో విమానంలో వెళ్తున్న ఫోటోలు పంచుకుంది. ఇది చూసిన ఆమె అభిమానులు షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతలా మారిపోయారేంటీ అంటూ పోస్టులు పెడుతున్నారు.

సినిమాల్లోకి వచ్చాక మానసిక ఒత్తిడికి గురైన మనీషా మద్యానికి బానిసగా మారింది. దీనికి తోడు ఆమె పెళ్లి, విడాకులతో మరింత డిప్రెషన్‌కు గురైంది. ఆ తర్వాత తాగడం మొదలుపెట్టిన మనీషా కొయిరాలా ప్రవర్తన అంతా మారిపోయింది. పార్టీలు, మద్యపానం తన జీవితంలో భాగమైపోయాయని మనీషా కొయిరాలా స్వయంగా తానే చెప్పుకొచ్చింది. విడాకుల ప్రక్రియ జరుగుతున్న సమయంలోనే మనీషా గర్భాశయ క్యాన్సర్‌ చివరి దశలో ఉన్నట్లు తెలిసింది. ఇక ఆమె జీవితం ముగిసిపోయిందని అంతా భావించారు. కానీ క్యాన్సర్‌ను జయించి పోరాట యోధురాలిగా నిలిచింది. ఈ పోరాటం కొత్త జీవితాన్ని ఇచ్చిందని మనీషా కొయిరాలా తన ఆత్మకథ హీల్డ్ పుస్తకంలో ప్రస్తావించింది. ఆ తర్వాతే మనీషాకు జీవనశైలి, అలవాట్లే క్యాన్సర్‌కు కారణమని తెలిసింది.

Share This Article
Leave a comment