వివాదంలో ఇరుక్కున్న కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి

Telugu BOX Office

కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ వివాదంలో ఇరుక్కున్నారు. ఆయనపై వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఉదయ్ నామినేషన్‌ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారని… ఆయన చదువు విషయంలో చెప్పింది వేరు.. ఇచ్చిన డాక్యుమెంట్లు వేరని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఉదయ్‌శ్రీనివాస్‌పై దుబాయ్‌ పోలీసులు లుక్‌అవుట్‌ నోటీసులు ఇచ్చారని, దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు.

టీ టైమ్ అధినేత తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ను కాకినాడ ఎంపీ అభ్యర్థిగా జనసేన పార్టీ ప్రకటించిన నాటి నుంచే ఆయనపై ఆరోపణలు మొదలయ్యాయి. ఆర్థిక నేరాలకు పాల్పడే వ్యక్తికి పవన్‌కల్యాణ్‌ ఎంపీ అభ్యర్థిగా టికెట్‌ ఇచ్చారని ప్రత్యర్థి నేతలు విమర్శలు గుప్పించడం మొదలుపెట్టారు. దుబాయ్‌లో ఆర్థిక మోసాలు చేసి ఇండియాకు పారిపోయి వచ్చాడని ఉదయ్‌ శ్రీనివాస్‌పై ఆరోపణలున్నాయి. ఇంటర్‌ చదివి.. ఇంజనీరింగ్‌ పూర్తి చేశానని చెప్పుకునే ఉదయ్‌ శ్రీనివాస్‌ లాంటి వాళ్లు తమ వ్యక్తిగత స్వార్థం చూసుకుంటారు తప్ప, ప్రజలకు ఏం సేవ చేస్తాడని కొందరు సోషల్‌ మీడియా వేదికగా కూడా పోస్టులు పెట్టారు. ఇలాంటి వ్యక్తి ఎంపీగా గెలిస్తే ఇంకెన్ని మోసాలు చేస్తాడోనని ఆరోపిస్తున్నారు.

కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్‌ కూడా ఇదే విషయంపై ఆరోపణలు సంధిస్తున్నారు. తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ లాంటి వ్యక్తిని అభ్యర్థిగా నిలిపినందుకు జనసేన పార్టీ తీరుపై మండిపడుతున్నారు. ఉదయ్‌ శ్రీనివాస్‌ ఇంజనీరింగ్‌ చదివానని చెప్పుకున్నాడని.. అయితే చదివింది ఇంటర్మీడియట్‌ మాత్రమేనని సునీల్ అంటున్నారు. నామినేషన్‌ సమయంలో అఫిడవిట్‌లో కూడా ఇంటర్‌ అనే ఇన్ఫర్మేషన్‌ ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు దుబాయ్‌లో ఉదయ్‌ శ్రీనివాస్‌పై లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారని, దానిపై ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు సునీల్‌.


దుబాయ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్‌గా పనిచేసే సమయంలో తంగెళ్ల ఉదయ్‌ శ్రీనివాస్‌ అక్కడ ఆర్థిక మోసాలకు పాల్పడ్డాడని, అందుకే అక్కడి పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు ఇచ్చారని చెబుతున్నారు. దానికి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా బయటపెట్టారు. ఇలాంటి వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటే మరిన్ని ఆర్థిక మోసాలు చేస్తాడు తప్ప ప్రజలకు ఏం సేవ చేస్తాడని సునీల్‌ ప్రశ్నిస్తున్నారు. దీంతో కాకినాడ జనసేన ఎంపీ అభ్యర్థి ఉదయ్‌ శ్రీనివాస్‌ వివాదం ఎన్నికల వేళ మరింత హీట్‌ రాజేస్తోంది.

Share This Article
Leave a comment