ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ సోమవారం ముగిసింది. ఈ క్రమంలో రాష్ట్ర రాజకీయాల్లో గెలుపు ఓటములపై తీవ్ర చర్చలు కొనసాగుతున్నాయి. ఎవరికి వారే గెలుపు తమదంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక ఏపీలో ఎవరు అధికారం చేపడతారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనే చర్చలు జరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఏపీలో ఏర్పడబోయే ప్రభుత్వం గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో వంద శాతం ఎన్డీయే కూటమి ప్రభుత్వమే ఏర్పడుతుందని కిషన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అక్కడ కచ్చితంగా ఎన్డీయే ప్రభుత్వం నెలకొల్పుతుందని జోస్యం చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు అమలు చేయడం విస్మరించింది అన్నారు. రిజర్వేషన్లపై కాంగ్రెస్, బీఆర్‌ఎస్ దుష్ర్పచారం చేశాయని మండిపడ్డారు. అయినా ప్రజలు బీజేపీనే నమ్మి ఓట్లేశారని హర్షం వ్యక్తం చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలు మళ్లీ ప్రధాని మోడీనే కావాలని ఆకాంక్షిస్తున్నారని ఆశాభావం వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ఎన్డీయే కూటమికి 400 సీట్లు రాబోతున్నాయని తెలిపారు. తెలంగాణలోనూ అధిక ఎంపీ సీట్లు సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.