దేశంలోనే అత్యధిక క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రిగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిలిచారు. దేశంలో క్రిమినల్ కేసులున్న ముఖ్యమంత్రులకు సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) సంస్థ విడుదల చేసిన జాబితాలో ఆయన తొలి స్థానంలో నిలిచారు. దేశంలో 30 మంది ముఖ్యమంత్రుల్లో 40 శాతం అంటే 12 మందిపై క్రిమినల్ కేసులు నమోదై ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. రేవంత్ రెడ్డి తర్వాతి స్థానాల్లో తమిళనాడు సీఎం ఎం.కె.స్టాలిన్ తనపై 47 క్రిమినల్ కేసులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై 19 కేసులు, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై 13 కేసులు, ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌పై ఐదు కేసులు నమోదై ఉన్నాయి. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్‌లపై నాలుగేసి కేసులు ఉన్నాయి. కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌పై రెండు, పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్‌పై ఒక కేసు ఉన్నాయి.

ముఖ్యమంత్రుల్లో పదిమందిపై హత్యాయత్నం, కిడ్నాప్, లంచగొండితనం, నేరపూరిత బెదిరింపు వంటి తీవ్రమైన నేరారోపణలు నమోదయ్యాయి. దేశంలోని 30 మంది ముఖ్యమంత్రులు ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్‌ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు వెల్లడించింది. నేరారోపణలు ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్లో చంద్రబాబు నాయుడు, ఫడణవీస్ తప్ప మిగిలిన అందరూ ఎన్డీయే ప్రతిపక్ష పార్టీలకు చెందినవారు కావడం విశేషం. తీవ్రమైన నేరానికి పాల్పడినట్టు కేసు నమోదై 30 లేదా అంతకన్నా ఎక్కువ రోజులు జైలులో ఉన్న ప్రధానమంత్రి, ముఖ్యమంత్రులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులకు ఉద్వాసన పలికే బిల్లును కేంద్రం పార్లమెంటులో ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఈ సమాచారం ప్రాధాన్యం సంతరించుకుది. ఈ జాబితాలో టాప్ 3లో తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉండటం గమనార్హం.
