మావయ్యా.. నీకే నా మద్దతు.. పవన్‌కు అండగా అల్లు అర్జున్

Telugu BOX Office

ఎన్నికలు సమీపిస్తున్న వేళ జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌కు టాలీవుడ్ నుంచి మద్దతు పెరుగుతోంది. ఇప్పటికే చిరంజీవి సహా మెగా కుటుంబమంతా ఆయనకు అండగా నిలబడిన సంగతి తెలిసిందే. తన తమ్ముడిని గెలిపించాలని చిరంజీవి ఇప్పటికే వీడియో ద్వారా ప్రజలను కోరారు. అలాగే మెగా హీరోలు వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, సాయిధరమ్ తేజ్ పిఠాపురంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. రామ్ చరణ్ కూడా చిరంజీవి వీడియోను తన ఎక్స్‌ వేదికగా షేర్ చేస్తూ ‘భవిష్యత్‌ కోసం పాటుపడే నాయకుడు పవన్‌ కల్యాణ్‌ను గెలిపించండి’ అని పోస్ట్‌ చేశారు. తాజాగా ఈ జాబితాలో జాతీయ ఉత్తమ నటుడు, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చేరారు. పవన్‌కళ్యాణ్‌కు మద్దతు ప్రకటిస్తూ గురువారం ఆయన ట్వీట్ చేశారు.

‘‘పవన్‌కల్యాణ్‌గారి ఎన్నికల ప్రయాణం విజయవంతంగా సాగాలని కోరుకుంటూ హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మీరు ఎంచుకున్న మార్గం, సేవ చేయాలన్న నిబద్ధత పట్ల నేను ఎంతో గర్విస్తున్నా. ఒక కుటుంబ సభ్యుడిగా నా ప్రేమ, మద్దతు ఎప్పటికీ మీకే ఉంటాయి. మీ ఆకాంక్షలు, లక్ష్యాలు నెరవేరాలని కోరుకుంటున్నా’’ అని అల్లు అర్జున్ పేర్కొన్నారు.

అల్లు అర్జున్ ట్వీట్‌ను మెగా అభిమానులు, జన సైనికులు తెగ వైరల్ చేస్తున్నారు. పవన్‌కళ్యాణ్‌‌కు అల్లు ఫ్యామిలీ మద్దతు లేదని వాగిన వాళ్లకు బన్నీ చెప్పుతో కొట్టినట్లు సమాధానం చెప్పాడంటూ ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మెగా కుటుంబమంతా ఒక్కటిగానే ఉందని అల్లు అర్జున్ మరోసారి చాటిచెప్పాడంటున్నారు.

మెగా ఫ్యామిలీ నుంచే కాదు ఇతర హీరోల నుంచి కూడా పవన్‌కళ్యాణ్‌కు క్రమంగా మద్దతు లభిస్తోంది. ఇటీవల జనసేన పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు హీరో నాని ప్రకటించారు. ‘పవన్‌ కల్యాణ్‌.. మీరు పెద్ద రాజకీయ యుద్ధాన్ని ఎదుర్కోనున్నారు. మీ సినిమా కుటుంబ సభ్యుడిగా మీరు కోరుకున్న విజయాన్ని సాధించాలని ఆశిస్తున్నా’ అని పేర్కొన్నారు.

‘ఆంధ్రప్రదేశ్‌ శ్రేయస్సు కోసం మీ కృషిని, ప్రయత్నాలను మొదటి రోజు నుంచి చూస్తున్నాను. కోట్ల మందికి మీరు ఆశాదీపం. మీరు గెలిచి ప్రజల తలరాతలు మార్చాలని కోరుకుంటున్నాను. ఇప్పటి జనాలకు మీరు కావాలి’ అని హీరో రాజ్ తరుణ్ జనసేనకు సపోర్ట్‌ చేశారు. అలాగే పవన్‌కు మద్దతు తెలుపుతున్నట్లు యువ నటుడు తేజ సజ్జా తన ఇన్‌స్టాలో స్టోరీ పెట్టారు. నటుడు సంపూర్ణేష్‌ బాబు కూడా పవన్‌కు మద్దతుగా ట్వీట్ చేశారు. ఎన్నికల రోజు వరకు సినీ ఇండస్ట్రీ నుంచి ఇంకెంతమంది పవన్‌కు మద్దతు ప్రకటిస్తారో వేచిచూడాలి.

Share This Article
Leave a comment