అమరావతికి రాచబాట: ఈ-3 సీడ్ యాక్సెస్ రోడ్డు, స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరొక అత్యంత కీలకమైన ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని ప్రాంత రవాణా వ్యవస్థకు వెన్నెముకలా నిలిచే ఈ-3 సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుతో పాటు బకింగ్‌హామ్‌ కెనాల్‌పై నూతనంగా నిర్మించిన స్టీల్‌ వంతెనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైభవంగా ప్రారంభించారు. విజయవాడ – మంగళగిరి మార్గానికి సీడ్‌ యాక్సెస్‌ రోడ్డును నేరుగా అనుసంధానించడంతో, రాజధానికి వెళ్లే ప్రయాణికులకు సులభమైన మార్గం అందుబాటులోకి వచ్చింది. భవిష్యత్తు నగర అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచస్థాయి ప్రమాణాలతో గ్రిడ్‌ తరహాలో అభివృద్ధి చేస్తున్న అమరావతి రహదారుల నిర్మాణంలో ఈ ప్రాజెక్టు ఒక మైలురాయిగా నిలవనుంది.

కీలక ప్రాంతాలను అనుసంధానించే 9 లేన్ల ఆధునిక రహదారి

అమరావతిలో సాంకేతికంగా ‘ఈ-3’ గా పిలిచే ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు దొండపాడు వద్ద ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్‌ ఆసుపత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. మొత్తం 21.77 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రహదారి నిర్మాణాన్ని మూడు దశల్లో రూ.1519 కోట్ల వ్యయంతో చేపడుతున్నారు. 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్లుగా తీర్చిదిద్దుతున్న ఈ మార్గంలో ప్రత్యేకంగా బిఆర్‌టిఎస్ (BRTS) కారిడార్, ఇరువైపులా సర్వీసు రోడ్లు ఏర్పాటు చేస్తున్నారు.

ఈ రహదారి ద్వారా అమరావతిలోని సచివాలయం, హైకోర్టు, శాసనసభ్యులు, అఖిల భారత సర్వీస్ (IAS/IPS) అధికారుల నివాసాలు, పరేడ్ మైదానం వంటి అత్యంత ముఖ్యమైన ప్రాంతాలకు సులభంగా చేరుకోవచ్చు. కేవలం రహదారి నిర్మాణమే కాకుండా, భవిష్యత్తు అవసరాలకు తగ్గట్లుగా డ్రైనేజీ, తాగునీటి సరఫరా, విద్యుత్, గ్యాస్, ఇంటర్నెట్ నెట్‌వర్క్ లైన్లను భూగర్భంలోనే ఏర్పాటు చేస్తున్నారు. సైకిల్ ట్రాక్, ఫుట్‌పాత్, గ్రీన్‌బెల్ట్‌లతో ఈ మార్గం ఆధునిక నగర రహదారిగా రూపుదిద్దుకుంటోంది.

 

అడ్డంకులను అధిగమించి స్టీల్ వంతెనల నిర్మాణం

సీడ్ యాక్సెస్ రోడ్డు రెండో దశ నిర్మాణంలో ఎదురైన భూసేకరణ సమస్యలను, న్యాయపరమైన చిక్కులను ప్రభుత్వం రైతులతో చర్చించి విజయవంతంగా పరిష్కరించింది. ఈ రహదారి మార్గంలో ఉన్న కొండవీటి వాగు, గుంటూరు వాహిని, బకింగ్‌హామ్ కెనాల్‌లపై వంతెనలను నిర్మించారు. ప్రత్యేకించి బకింగ్‌హామ్ కెనాల్‌పై రూ.82 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన నాలుగు వరుసల స్టీల్ వంతెన ఇంజనీరింగ్ అద్భుతంగా నిలిచింది. ఈ వంతెన అందుబాటులోకి రావడంతో విజయవాడ నుంచి వచ్చే వాహనాలు కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా నేరుగా అమరావతి చేరుకునే వెసులుబాటు కలిగింది.

పైలాన్ ఆవిష్కరణ

ఉండవల్లి వద్ద అమరావతి నిర్మాణ సంకేతంగా ‘A’ ఆకారంలో రూపొందించిన పైలాన్, శిలాఫలకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆవిష్కరించారు. అనంతరం స్టీల్ వంతెనను పరిశీలించి, అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. ఆ తర్వాత కొండవీటి వాగుపై నిర్మించిన మేజర్ స్టీల్ వంతెనను, రాయపూడి వద్ద సిద్ధమవుతున్న ప్రజాప్రతినిధుల గృహ సముదాయాలను ఆయన పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పురపాలక శాఖ మంత్రి పి. నారాయణ, సివిల్ సప్లైస్ మంత్రి నాదెండ్ల మనోహర్, తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్, ఎంపీ భాష్యం రామకృష్ణ తదితర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు మూడో దశ పనులు కూడా త్వరలోనే ప్రారంభం కానున్నాయి.

Share This Article
Leave a Comment