ప్రజల ఖర్చులు డబుల్.. పదేళ్లలో రెట్టింపైన నెలవారీ వ్యయం

Telugu BOX Office

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఖర్చులు భారీగా పెరిగాయి. నెలవారీ తలసరి ఖర్చులు దేశ సగటుతో పోలిస్తే తెలంగాణలోనే అధికంగా ఉన్నాయి. రాష్ట్రంలో ఖర్చులు గత పదేండ్లలో రెట్టింపు అయ్యాయి. వివిధ రాష్ట్రాలతో పోల్చి చూస్తే, తలసరి ఖర్చుల్లో మన రాష్ట్రం దేశంలో ఐదో స్థానంలో ఉంది. నేషనల్​ శాంపిల్​సర్వే ఆఫీస్​ చేసిన కుటుంబ ఖర్చుల సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి.

సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 2,61,746 కుటుంబాల (పల్లెల్లో 1,55,014.. పట్టణాల్లో 1,06,732) నెలవారీ ఖర్చులను అడిగి తెలుసుకున్నారు. మన రాష్ట్రంలో పల్లెల్లో 3,553.. పట్టణాల్లో 3,233 కుటుంబాలను సర్వే చేశారు. తిండి, చదువులు, పెట్రోల్/డీజిల్, గ్యాస్, వైద్యం తదితర అవసరాలకయ్యే ఖర్చుల గురించి అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ  పల్లెల్లో ఒక్కొక్కరికి నెలకు రూ.4,802.. పట్టణాల్లో రూ.8,158 ఖర్చు అవుతున్నట్టు సర్వేలో తేల్చారు. ఇది దేశ సగటు కన్నా ఎక్కువ కావడం గమనార్హం. దేశంలో నెలవారీ తలసరి ఖర్చు పల్లెల్లో రూ.3,773గా ఉండగా, పట్టణాల్లో రూ.6,459గా ఉన్నట్టు సర్వేలో తేలింది. ఈ లెక్కన దేశ సగటుతో పోలిస్తే మన రాష్ట్రంలో పల్లెల్లో రూ.1,100.. పట్టణాల్లో రూ.1,700 అధికంగా ఖర్చవుతున్నట్టు వెల్లడైంది.

రాష్ట్రంలో 1,10,05,700 కుటుంబాలు ఉన్నట్టు ఎన్ఎస్ఎస్​వో అంచనా వేసింది. కాగా, మొత్తంగా దేశంలో గత పదేండ్లలో నెలవారీ తలసరి ఖర్చులు పల్లెల్లో రెట్టింపునకు మించి, పట్టణాల్లో దాదాపు మూడు రెట్లు పెరిగినట్టు సర్వే తేల్చింది. 2011–12 ఆర్థిక సంవత్సరంలో పల్లెల్లో ఒక్కరిపై అయిన ఖర్చు రూ.1,430 కాగా.. 2022–23 నాటికి అది రూ.3,773కి పెరిగింది. అదే పట్టణాల్లో ఆ ఖర్చు రూ.2,630 నుంచి రూ.6,459కి పెరిగింది. ఇక ఈ ఖర్చులు 2000వ సంవత్సరంలో పల్లెల్లో రూ.486, పట్టణాల్లో రూ.855 కావడం గమనార్హం.

టాప్ – ​5లో తెలంగాణ..

దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సర్వే చేయగా.. రాష్ట్రాల జాబితాలో తెలంగాణ ఐదో స్థానంలో ఉన్నది. ఈ జాబితాలో అత్యధిక ఖర్చులతో సిక్కిం మొదటి స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో పల్లెల్లో తలసరి ఖర్చు రూ.7,731, పట్టణాల్లో రూ.12,105గా ఉంది. అతి తక్కువ ఖర్చు కలిగిన రాష్ట్రంగా చత్తీస్​గఢ్​ నిలిచింది. అక్కడ పల్లెల్లో ఒక్కొక్కరి సగటు నెల ఖర్చు కేవలం రూ.2,466గా, పట్టణాల్లో రూ.4,483గా ఉన్నట్టు సర్వే తేల్చింది. ఖర్చులు అధికంగా ఉన్న టాప్​5 రాష్ట్రాల జాబితాలో సిక్కిం తర్వాతి స్థానాల్లో వరుసగా గోవా, అరుణాచల్​ప్రదేశ్, ఢిల్లీ, తెలంగాణ ఉన్నాయి.

కాగా, రాష్ట్రంలో ధరలు పెరుగుతున్నా గత బీఆర్ఎస్​ప్రభుత్వం వాటి నియంత్రణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్న ఆరోపణలు ఉన్నాయి. గతంలో చాలా రాష్ట్రాలు పెట్రోల్, డీజిల్​పై వ్యాట్​ను తగ్గించుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తగ్గించలేదు. దీనిపై అప్పట్లో ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఫీజుల నియంత్రణ లేకపోవడం, ఫీజు రీయింబర్స్​మెంట్​అమలుకాక చేతుల నుంచి కట్టాల్సి రావడం, మెడికల్​ బిల్లులూ ఎక్కువైపోతుండడం వంటి కారణాలూ రాష్ట్రంలో ఖర్చుల పెరుగుదలకు కారణమయ్యాయన్న విమర్శలు వస్తున్నాయి.

దేశంలో తిండిపై ఖర్చు తక్కువే..

దేశంలో తిండిపై ప్రజలు తక్కువే ఖర్చు పెడుతున్నట్టు సర్వేలో వెల్లడైంది. పల్లెల్లో రూ.1,750.. పట్టణాల్లో రూ.2,530 ఖర్చు పెడుతున్నట్టు తేలింది. ఇతర అవసరాలపై పల్లెల్లో రూ.2,023.. పట్టణాల్లో రూ.3,929 మేర ఖర్చు పెడుతున్నట్టు వెల్లడైంది. మరోవైపు నిరుపేదవర్గాలకు సరైన ఆదాయం లేక ఖర్చులు కూడా తక్కువగా ఉన్నట్టు సర్వే పేర్కొంది. పల్లెల్లో అత్యంత నిరుపేదలు ఒక్కొక్కరిపై నెలకు రూ.1,373.. పట్టణాల్లో రూ.2,001 ఖర్చు అవుతున్నట్టు సర్వే వివరించింది. అయితే, పట్టణ ప్రాంతాల్లో ఉండే ధనికుల్లో ఒక్కొక్కరిపై సగటున రూ.20,824 ఖర్చవుతుండగా.. పల్లెల్లో రూ.10,501 ఖర్చు పెడుతున్నట్టు తేలింది.

సామాజిక వర్గాల వారీగా ఇలా..

వివిధ సామాజికవర్గాల వారీగానూ ఖర్చుల వివరాలపై ఎన్ఎస్ఎస్​వో సర్వే చేసింది. అగ్రవర్ణాల వారిని పక్కనపెడితే.. బీసీలకు అధికంగా ఖర్చులవుతున్నట్టు తేల్చింది. పల్లెల్లోని బీసీలు ఒక్కొక్కరు నెలకు రూ.3,848, పట్టణాల్లో రూ.6,177 ఖర్చు పెడుతున్నట్టు పేర్కొంది. ఎస్టీలకు పల్లెల్లో రూ.3,016, పట్టణాల్లో రూ.5,414, ఇక ఎస్సీలకు పల్లెల్లో రూ.3,474, పట్టణాల్లో రూ.5,307 ఖర్చవుతున్నట్టు వెల్లడించింది. ఇతర వర్గాల వారిలో సగటున ఒక్కొక్కరిపై నెలకయ్యే ఖర్చు పల్లెల్లో అయితే రూ.4,392, పట్టణాల్లో రూ.7,333గా ఉన్నట్టు తేల్చింది.

వీటికే ఖర్చెక్కువ..

ప్రజలు ఎక్కువగా ప్రాసెస్డ్​ఫుడ్/డ్రింక్స్, ట్రాన్స్​పోర్ట్​కే ఖర్చు పెడుతున్నట్టు సర్వే తేల్చింది. పల్లెలు, పట్టణాలు అనే తేడా లేకుండా దేశవ్యాప్తంగా వాటిపైనే ప్రజలు ఖర్చు ఎక్కువ పెడుతున్నట్టు వెల్లడించింది. పట్టణాల్లో ప్రాసెస్ట్​ఫుడ్/డ్రింక్స్​పై ఒక్కొక్కరు సగటున రూ.687, పల్లెల్లో రూ.363 ఖర్చు పెడుతున్నట్టు తేల్చింది. పప్పులు, బియ్యం, కూరగాయల ఖర్చుతో పోలిస్తే దీనికే ఎక్కువ ఖర్చు అవుతుండడం గమనార్హం. ఇక ట్రాన్స్​పోర్టేషన్​కు సగటున పల్లెల్లో రూ.285, పట్టణాల్లో రూ.555 ఖర్చవుతున్నట్టు తేలింది. పెట్రోల్/డీజిల్, ఇంటి అద్దె వంటి విషయాల్లోనూ ఖర్చులు ఎక్కువగా ఉంటున్నట్టు సర్వే పేర్కొంది

Share This Article
Leave a comment