పవన్‌కళ్యాణ్‌కే నా మద్దతు.. ముద్రగడకు షాకిచ్చిన కూతురు

TBO
By TBO

జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ని పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు మార్చుకుంటానని వైసీపీ నేత ముద్రగడ పద్మనాభం చేసిన సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ముద్రగడ ఛాలెంజ్‌పై ఆయన సొంత సామాజికవర్గ నేతలు పార్టీలకతీతంగా మండిపడుతున్నారు. జగన్ రెడ్డి కోసం సొంత కాపు నేతనే ఓడించి తీరుతానంటూ సవాల్ చేయడం దారుణమని వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ముద్రగడకు మరో షాక్ తగిలింది. తన తండ్రి చేసిన వ్యాఖ్యలను ముద్రగడ పద్మనాభం కుమార్తె క్రాంతి తీవ్రంగా వ్యతిరేకిస్తూ వీడియో విడుదల చేశారు.

పిఠాపురంలో పవన్ కల్యాణ్ ను ఓడించడానికి వైసీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేయాలో అన్నీ చేస్తున్నారన్న క్రాంతి…. పవన్ కల్యాణ్ ను ఓడించకపోతే తన పేరును ముద్రగడ పద్మానాభరెడ్డిగా మార్చుకుంటానని చాలెంజ్ చేయడం బాధాకరమన్నారు. ముద్రగడ ప్రకటన తన సొంత అభిమానులకు కూడా నచ్చలేదన్నారు. వంగా గీత గెలుపు కోసం పనిచేసుకోవచ్చు కానీ పవన్ కల్యాణ్‌ను ఆయన అభిమానులను కించపరిచేలా వ్యాఖ్యల చేయడం సహించరానిదన్నారు.

పవన్ కల్యాణ్‌ను తిట్టేందుకే జగన్… తన తండ్రిని వాడుకుంటున్నారని, ఎన్నికలు అయ్యాక ఆయన్ని వదిలేయడం పక్కా అని క్రాంతి అన్నారు. తన తండ్రికి నచ్చకపోయినా పిఠాపురంలో పవన్‌కళ్యాణ్‌కు మద్దతుగా తాను ఎన్నికల ప్రచారం నిర్వహిస్తానని ప్రకటించారు. ముద్రగడ కూతురు చేసిన వ్యాఖ్యలపై జనసేన, టీడీపీ, బీజేపీ నేతలు హర్షం వ్యక్తం చేస్తుండగా.. వైసీపీ నేతలు మాత్రం మింగలేక కక్కులేక అన్న పరిస్థితిలో ఉన్నారు.

Share This Article