ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కల్వకుంట్ల కవిత అరెస్ట్

Telugu BOX Office

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. లిక్కర్ స్కాం కేసులో తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఎదుర్కొంటోన్న కేసీఆర్ కుమార్తె, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇంటిపై మధ్యాహ్నం నుంచి సోదాలు నిర్వహించిన ఈడీ, ఐటీ అధికారులు.. ఆమెను అదుపులోకి తీసుకున్నారు. కవితకు ఈడీ అధికారులు అరెస్ట్ నోటీసులు ఇచ్చారు. అయితే.. సోదాల్లో భాగంగా.. కవిత నుంచి సుమారు 16 మొబైల్ ఫోన్లను అధికారులు సీజ్ చేసినట్టు సమాచారం. లిక్కర్ స్కాంకు సంబంధించి ఆమె వాంగ్మాలాన్ని రికార్డు చేసినట్టు తెలుస్తోంది. సుమారు 5 గంటల పాటు సోదాలు నిర్వహించిన అధికారులు.. చివరికి అరెస్ట్ వారెంట్ ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

అయితే.. ఇప్పటికే కవిత నివాసానికి మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుతో పాటు పలువురు కీలక నేతలు, పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుని.. ఆందోళన చేశారు. కవితను ఈ రాత్రికే ఢిల్లీకి తరలించనున్నట్టు సమాచారం. ఈడీ అధికారులు ప్రీ ప్లాన్డ్‌గానే.. సెర్చ్ వారెంట్‌తో పాటు అరెస్ట్ వారెంటును తీసుకురావడంతో పాటు ముందుగానే 8:45 ఫ్లైట్ కోసం కవితకు కూడా టికెట్ కూడా బుక్ చేసినట్టుగా తెలుస్తోంది. అయితే.. స్థానిక కోర్టు అనుమతి లేకుండా ఢిల్లీకి ఎలా తీసుకెళ్తారు అని ఈడీ అధికారులతో హరీశ్ రావు, కేటీఆర్.. వాగ్వాదానికి దిగారు.

మరోవైపు.. ప్రధాని నరేంద్ర మోదీ హైదరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మల్కాజ్‌గిరిలో.. మోదీ రోడ్ షో నిర్వహిస్తున్నారు. అయితే.. ఇదే సమయంలో కవిత ఇంటిపై సోదాలు చేయటం, ఐదు గంటల సోదాల అనంతరం అరెస్ట్ చేయటం సర్వత్రా సంచలనంగా మారింది.

దేశంలో సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కుమార్తె.. కల్వకుంట్ల కవిత కీలక పాత్ర పోషించినట్టు సంచలన ఆరోపణలు వచ్చాయి. ఈ పాలసీలో కవితకు సుమారు 100 కోట్ల వరకు ముడుపులు ముట్టినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే.. ఈ కేసుతో సంబంధమున్నట్టుగా భావించిన పలువురిని.. అధికారులు అదుపులోకి తీసుకుని విచారించగా.. కవితకు సంబంధించిన మూలాలు బయటపడినట్టుగా అధికారులు తెలిపారు.

ఇప్పటికే.. ఈ కేసు మాగుంట శ్రీనివాసులు రెడ్డి, మాగుంట రాఘవతో పాటు అభిషేక్ బోయినపల్లి, కవిత పీఏ అశోక్ కౌశిక్ లాంటి కీలక వ్యక్తులు అప్రూవర్లుగా మారిపోయి.. సంచలన విషయాలను వెల్లడించినట్టు అధికారులు తెలిపారు. వాళ్లు ఇచ్చిన సమాచారం ఆధారంగానే.. ఛార్జ్ షీట్లు నమోదు చేసిన అధికారులు.. అందులో కవిత పేరును పలుమార్లు ప్రస్తావించారు. అయితే.. ఇప్పటికే ఈడీ ఎదుట రెండు మార్లు కవిత విచారణకు హాజరుకాగా.. ఆ తర్వాత పలుమార్లు ఇచ్చిన నోటీసులను కవిత తోసిపుచ్చారు. ఈడీ ఇచ్చిన నోటీసులను సవాలు చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. కవిత వేసిన పిటిషన్‌ను సుప్రీం ఈ నెల 19కు వాయిదా వేసింది.

Share This Article
Leave a comment