ఐదేళ్లలో 41 శాతం పెరిగిన జగన్ ఆస్తులు

Telugu BOX Office

దేశంలోనే అత్యంత ధనిక ముఖ్యమంత్రి అని ప్రతిపక్షాలు విమర్శించే YS Jaganmohan Reddy మొత్తం ఆస్తుల విలువ రూ.529.87 కోట్లు. ఆయన భార్య వైఎస్‌ భారతి పేరిట మరో రూ176.63 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. Jagan సంపద గత ఐదేళ్లలో భారీగా పెరిగింది. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న YSRCP అధ్యక్షుడు జగన్‌ తరపున సోమవారం ఆయన చిన్నాన్న వైఎస్‌ మనోహర్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. అఫిడవిట్‌లో జగన్‌ తన చరాస్తుల విలువను రూ.483,08,35,064గా, స్థిరాస్తుల విలువను రూ.46 కోట్లుగా పేర్కొన్నారు. తన చేతిలో కేవలం రూ.7 వేలు నగదు ఉన్నట్టు చూపారు.

 

అలాగే తన సతీమణి YS Bharathi Reddy పేరిట రూ.119,38,07,190 విలువైన చరాస్తులు, రూ.56 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు చూపించారు. వీరిద్దరి పేరిట మొత్తం రూ.706.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. భారతి వద్ద రూ.10,022 నగదు, పెద్ద కూతురు హర్షిణీరెడ్డి వద్ద రూ.9 వేలు, రెండో కూతురు వర్షితరెడ్డి వద్ద రూ.6,989 నగదు ఉన్నట్టు అఫిడవిట్‌లో తెలిపారు. నలుగురి పేరిట నగదు మొత్తం రూ.40 వేలు కూడా లేకపోవడం గమనార్హం. ఇద్దరు కుమార్తెల పేరిట 51.50 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నాయి. 2019 ఎన్నికల్లో జగన్‌ ఆస్తి రూ.375.20 కోట్లు ఉండగా, ఐదేళ్లు తిరిగే సరికి ఆయన సంపద దాదాపు 41 శాతం పెరిగింది. భార్య, పిల్లల ఆస్తులు కూడా భారీగా పెరిగాయి. 2019 ఎన్నికల్లో భారతి పేరిట రూ.124 కోట్లు, ఇద్దరు కుమార్తెల పేరిట రూ.11 కోట్లు ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు. 2022-23లో ఆదాయపన్నులో చూపించిన ఆదాయం జగన్‌కు రూ.47,74,90,600, భారతికి రూ.10.96 కోట్లుగా ఉంది.

జగన్‌ ఆస్తులివే

జగన్‌ ఆస్తుల్లో ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, బీమా, ఇతరులకు ఇచ్చిన అప్పులు, స్థిరాస్తులు ఉన్నాయి. ఇడుపులపాయలో రూ.35.50 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. ఇడుపులపాయ, భాకరాపురం, బంజారాహిల్స్‌, సాగర్‌ సొసైటీలో ఆస్తులున్నాయి. వ్యవసాయేతర భూముల విలువ రూ.46,78,89,900గా చూపించారు. భారతి సిమెంట్స్‌లో జగన్‌కు రూ.36 కోట్లు, కార్మియల్‌, ఏసి యో హోల్డింగ్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.8లక్షలు, క్లాసిక్‌రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.65.19 కోట్లు, సండూర్‌ పవర్‌లో రూ.130 కోట్లు, సరస్వతి పవర్‌ ఇండస్ట్రీ్‌సలో రూ.27.60 కోట్లు, సిలికాన్‌ బెండర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.2.86 కోట్లు.. మొత్తం రూ.263.64 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు రూ.1.10 కోట్లు ఉన్నట్టు తెలిపారు. జగన్‌ రూ.4.56 కోట్లు ట్యాక్స్‌ కట్టినట్టు తెలిపారు. జగన్‌ కుటుంబానికి సొంత కారు లేకపోవడం విశేషం. అలాగే జగన్‌కు తులం బంగారు కూడా లేదు.

భారతి ఆస్తులివే

భారతి పేరిట రూ.5.29 కోట్ల విలువ చేసే 6.47 కిలోల బంగారు, వజ్రాలు ఉన్నాయి. ఎర్రగుడిపల్లె, కచివారిపల్లె, పులివెందుల, రాయదుర్గం, తాడేపల్లిలో ఆస్తులు ఉన్నాయి. వీటి విలువ రూ.56,92,19,104గా చూపించారు. అలాగే సండూర్‌ పవర్‌లో రూ.11.45 కోట్లు, సరస్వతిలో రూ.13.80 కోట్లు, హేల్‌వన్‌ టెక్నాలజీలో రూ.12.84 కోట్లు, క్లాసిక్‌ రియాలిటీ ప్రైవేటు లిమిటెడ్‌లో రూ.4.55 కోట్లు, సిలికాన్‌లో రూ.2.99 లక్షలు, ఆకాశ్‌లో రూ.10.24 కోట్లు.. మొత్తం ఆమె పేరిట రూ.53.8 కోట్లు పెట్టుబడులు ఉన్నాయి. అప్పులు రూ.7.40 కోట్లు ఉన్నట్టు వెల్లడించారు.

 

జగన్‌ కుమార్తెల ఆస్తులు

జగన్‌ పెద్దకూతురు హర్షిణీరెడ్డి పేరిట రూ.4.43 కోట్ల విలువ చేసే 4.187 కిలోల బంగారం, చిన్నకూతురు వర్షితరెడ్డిల పేరిట రూ.4.40 కోట్ల విలువ చేసే 3.450 కిలోల బంగారు ఉంది. జగన్‌ పెద్దకూతురు పేరిట కర్ణాటకలో రెండు వాణిజ్యయేతర స్థలాలు, ఇడుపులపాయలలో 4.5 ఎకరాలు, 5.50 ఎకరాలు, కే.ఎల్లమవారిపల్లెలో, పాలెంపల్లెలో రూ.1.63 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. ఇక చిన్న కూతురుకు అదే ప్రాంతంలో అంతే సమానంగా ఆస్తులు ఉన్నాయి. పెద్ద కుమార్తెకు 25.89 కోట్లు, చిన్నకుమార్తెకు 25.57 కోట్లు విలువైన ఆస్తులు ఉన్నట్టు వెల్లడించారు.

 

జగన్‌పై 26 కేసులు

సీఎం జగన్‌ తనపై 26 కేసులు ఉన్నాయి. 11 సీబీఐ కేసులు, 9 ఈడీ కేసులున్నాయి. నంద్యాల, విజయవాడ, మంగళగిరి, పొన్నూరు, సరూర్‌నగర్‌ పోలీసు స్టేషన్లలో ఆరు కేసులు ఉన్నాయి.

Share This Article
Leave a comment