నటీనటులు: కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డి, ఉల్కా గుప్తా, జోవికా విజయ్‌కుమార్, భానుచందర్, వనితా విజయ్‌కుమార్, షిజు, వైవా రాఘవ తదితరులు
దర్శకత్వం: ఎం.ఎస్. రాజు
నిర్మాత: కాశీ విశాలాక్షి బలుసు
సమర్పణ: అజయ్ కేఆర్
బ్యానర్: శ్రీ ఆదివరాహ ప్రొడక్షన్స్
విడుదల తేదీ: ఆగస్టు 14
టాలీవుడ్‌లో ఎన్నో ఇండస్ట్రీ హిట్స్ అందించిన స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎస్. రాజు దర్శకుడిగా వైవిధ్యమైన కాన్సెప్ట్‌లతో ప్రయోగాలు చేస్తున్నారు. ‘పొలిమేర’ ఫేమ్ కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రలో, ఆయన తెరకెక్కించిన తాజా మిస్టికల్ డివైన్ థ్రిల్లర్ ‘అగధ’. క్షుద్ర శక్తులు, ఆత్మలు, దైవబలం చుట్టూ తిరిగే కథాంశంతో రూపొందిన ఈ చిత్రం థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ మిస్టిక్ థ్రిల్లర్ ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని ఇచ్చిందో రివ్యూలో తెలుసుకుందాం.

కథా నేపథ్యం
ఆంధ్ర – ఒడిశా సరిహద్దు ప్రాంతంలో ఉండే మహాదేవి (కామాక్షి భాస్కర్ల) దైవిక శక్తులతో ఆత్మల బాధల నుంచి ప్రజలను రక్షిస్తూ మోక్షం ప్రసాదిస్తుంటుంది. ఒకానొక సమయంలో తన కుటుంబం ప్రమాదంలో ఉందని గ్రహించి స్వగ్రామానికి చేరుకుంటుంది. అక్కడ తన బాబాయ్ (భానుచందర్) కుమార్తె మహిమ (ఉల్కా గుప్తా) గర్భవతిగా ఉండి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తుంది. మహిమ తన స్నేహితులతో కలిసి అడవిలోని నిగూఢమైన గుహ వద్దకు వెళ్లినప్పుడు స్నేహితుడు బబ్లూ (వైవా రాఘవ) హత్యకు గురవడం, ప్రియుడు సింహా (శ్రవణ్ రెడ్డి) అదృశ్యం కావడం వెనుక ‘కలి’ ప్రభావంతో ఉద్భవించిన ‘అగధ’ అనే క్షుద్రశక్తి ఉందని మహాదేవి గుర్తిస్తుంది. అసలు అగధ ఎవరు?… ఆ గుహలో ఏం జరిగింది?… మహాదేవి కుటుంబాన్నే ఆ దుష్టశక్తి ఎందుకు టార్గెట్ చేసింది?… తనకున్న దైవిక శక్తులతో మహాదేవి ఆ క్షుద్రశక్తిని ఎలా అంతమొందించింది? అనేదే మిగతా కథ.
ఎలా ఉందంటే…
మిస్టికల్, హారర్ జోనర్‌లో దైవశక్తికి, దుష్టశక్తికి మధ్య జరిగే పోరాటాలు తెలుగు ప్రేక్షకులకు కొత్తేమీ కాదు. దర్శకుడు ఎమ్మెస్ రాజు ఎంచుకున్న మూల కథాంశం రొటీన్‌గానే ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్ర, బస్తర్ సరిహద్దుల విలేజ్ బ్యాక్‌డ్రాప్‌ను నేపథ్యంగా ఎంచుకోవడం బాగుంది. సినిమా ప్రారంభం, మహిమ ఎదుర్కొనే వింత పరిణామాలు, ఆమె ఆత్మహత్యతో కథనం వేగం పుంజుకుంటుంది. మహాదేవి ఎంట్రీ, ఇంట్లోని వ్యక్తుల వింత ప్రవర్తన, గుహ మిస్టరీ చుట్టూ నడిచే సన్నివేశాలు ఇంటర్వెల్ వరకు ప్రేక్షకుల్లో తగినంత ఉత్సుకతను కలిగిస్తాయి. ఇంటర్వెల్ తర్వాత అసలు గుట్టు వీడే క్రమంలో కథనం నెమ్మదిస్తుంది. దైవశక్తి వర్సెస్ క్షుద్రశక్తి మధ్య ఉండాల్సిన తీవ్రమైన ఘర్షణ, ఉత్కంఠభరిత సన్నివేశాలు ఆశించిన స్థాయిలో పండలేదు. ఒక టైమ్-లాప్స్ ఎపిసోడ్ మినహా క్లైమాక్స్ చాలా సాధారణంగా తేలిపోయిన అనుభూతిని కలిగిస్తుంది.
ఎవరెలా చేశారంటే…
ఇలాంటి డివైన్, ఇంటెన్స్ రోల్స్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన కామాక్షి భాస్కర్ల ‘మహాదేవి’గా సినిమాను తన భుజాలపై మోశారు. ఆహార్యం, నటనలో పరిపక్వత చూపించారు. శ్రవణ్ రెడ్డి విభిన్న షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించి తనదైన విలనిజాన్ని చక్కగా పండించారు. ఉల్కా గుప్తా పరిధి మేరకు నటించగా, వనిత కుమార్తె జోవికా విజయ్‌కుమార్ ఆత్మ ఆవహించిన సీన్లలో తొలి సినిమాకే మంచి ప్రతిభ కనబరిచింది. భానుచందర్, వనిత, షిజు, వైవా రాఘవ, కనకవ్వ తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్‌గా
సినిమాకి ప్రధాన బలం రాకేశ్ వెంకటాపురం అందించిన నేపథ్య సంగీతం. థ్రిల్లర్ మూడ్‌ను ఎలివేట్ చేయడంలో బీజీఎం కీలక పాత్ర పోషించింది. నాని చమిడిశెట్టి సినిమాటోగ్రఫీ నేచురల్ విజువల్స్‌తో ప్రతి ఫ్రేమ్‌ను రిచ్‌గా చూపించింది. వీఎఫ్ఎక్స్ వర్క్ సాధారణంగా ఉంది. జునైద్ ఎడిటింగ్ ద్వితీయార్థంలో మరింత క్రిస్ప్‌గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
ప్లస్ పాయింట్లు:
- కామాక్షి భాస్కర్ల, శ్రవణ్ రెడ్డిల నటన
- నేపథ్య సంగీతం , విజువల్స్
- ఫస్టాఫ్‌లో సాగే కొన్ని మిస్టరీ ఎలిమెంట్స్
- నిర్మాణ విలువలు
మైనస్ పాయింట్లు:
- రొటీన్ కథాంశం, ఊహించదగిన క్లైమాక్స్
- వీఎఫ్ఎక్స్ లోపాలు
- సెకండాఫ్‌లో తగ్గిన ఉత్కంఠ, డ్రామా
చివరిగా…
‘అగధ’ సాంకేతికంగా, నటీనటుల పనితీరు పరంగా ఆకట్టుకున్నప్పటికీ, బలహీనమైన కథనం, సాదాసీదా క్లైమాక్స్ వల్ల సాధారణ మిస్టిక్ థ్రిల్లర్‌గానే మిగిలిపోయింది. ఎలాంటి భారీ అంచనాలు లేకుండా చూస్తే ఓ మోస్తరుగా అలరించే చిత్రమిది.
