‘పగ పగ పగ’ ప్రొడ్యూసర్ డేరింగ్ స్టెప్.. ఫస్ట్ డే ఫస్ట్ షో ఉచితం!

ప్రస్తుతం సినిమాల పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే మౌత్ టాక్ సరిగ్గా లేకపోతే మొదటి ఆట తరువాత కలెక్షన్లు డ్రాప్ అవుతున్నాయి. మొదటి ఆట ముగిసే సమయానికి సినిమా జాతకం అంతా బయటకు వచ్చేస్తోంది. సినిమాకు మంచి టాక్ వస్తేనే ఆ తరువాత నిలబడుతోంది. లేదంటే ఎంత పెద్ద స్టార్ హీరోల సినిమా అయినా ప్లాప్‌ల లిస్టులో చేరిపోతోంది.

టాలీవుడ్ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న ఈ టైమ్‌లో ఫస్ట్ డే ఫస్ట్ షోను ప్రేక్షకులను ఉచితంగా చూపించాలంటే నిర్మాతలకు ఎంత ధైర్యం కావాలి. అలాంటి సాహసోపేతమైన నిర్ణయమే తీసుకున్నారు ‘పగ పగ పగ’ చిత్ర నిర్మాతలు. సుంకర బ్రదర్స్ వారి సమర్పణలో అభిలాష్ సుంకర, దీపిక ఆరాధ్య హీరో హీరోయిన్లుగా ఈ సినిమా తెరకెక్కింది. ప్రముఖ సంగీత దర్శకుడు కోటి తొలిసారిగా విలన్ పాత్రలో కనిపిస్తుండటం విశేషం. వినోదంతో కూడిన క్రైమ్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని డైరెక్టర్ రవి శ్రీ దుర్గా ప్రసాద్ తెరకెక్కించారు. ప్రొడ్యూసర్ సత్య నారాయణ సుంకర ఖర్చుకు వెనుకాడకుండా ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. బెనర్జీ, జీవీకే నాయుడు, కరాటే కళ్యాణి, భరణి శంకర్, రాయల్ హరిశ్చంద్ర, సంపత్, జబర్దస్త్ వాసు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్న నటిస్తున్న ఈ చిత్రానికి కోటి సంగీతం అందించారు.

ప్రచార కార్యక్రమాల్లో భాగంగా ఇప్పటికే విడుదల చేసిన సినిమా పోస్టర్‌, మూవీ మోషన్ పోస్టర్‌, కోటి పాత్రకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌‌కు మంచి స్పందన వచ్చింది. సినిమా ప్రేక్షకులకు కచ్చితంగా నచ్చుతుందన్న నమ్మకంతో నిర్మాతలు టాలీవుడ్ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. సెప్టెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘పగ పగ పగ’ చిత్రాన్ని ఫస్ట్ డే ఫస్ట్ షో అందరికీ ఉచితంగా చూపించాలని నిర్ణయించుకున్నారు. ఈ డేరింగ్ స్టెప్‌తో ఇండస్ట్రీలోని వర్గాలు అవాక్కవుతున్నాయి. అయినప్పటికీ సినిమా మీదున్న నమ్మకంతోనే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ మూవీకి సినిమాటోగ్రఫర్‌గా నవీన్ కుమార్ చల్లా, ఎడిటర్‌గా పాపారావు వ్యవహరించారు. రామ్ సుంకర ఫైట్ మాస్టర్‌గా పని చేశారు. నిర్మాతలు తీసుకున్న ఈ డేరింగ్ డెసిషన్ సక్సెస్ అయి టాలీవుడ్‌కి మరో మంచి హిట్ దక్కాలని కోరుకుందాం..