ఆ గ్రామంలోకి ఏడాదికి ఒక్కరోజే ఎంట్రీ!

Telugu BOX Office

ప్రపంచంలో అక్కడక్కడా జనసంచారం లేని ఊళ్లు ఉంటాయి. రకరకాల కారణాల వల్ల జనాలు ఆ ఊళ్లను విడిచిపెట్టి, అక్కడి నుంచి వేర్వేరు చోట్లకు తరలిపోయి ఉంటారు. అలాంటి ఊళ్లను ఆసక్తిగా చూడటానికి అప్పుడప్పుడు పర్యాటకులు వస్తుంటారు. ఇంగ్లండ్‌లోని సాలిస్‌బరీ మైదాన ప్రాంతంలోని ఇంబర్‌ గ్రామం కూడా అలాంటిదే! ఎనిమిది దశాబ్దాలుగా ఇక్కడ జనసంచారం లేదు. రెండో ప్రపంచయుద్ధం జరుగుతున్న కాలంలోనే ఈ ఊరు పూర్తిగా ఖాళీ అయిపోయింది. మిత్రశక్తులకు చెందిన సైనిక బలగాలకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం కోసం ఈ ఊరిని ఖాళీ చేయించారు.

యుద్ధంలో అణుబాంబుల వల్ల ఒకవేళ పెనువిపత్తు తలెత్తితే, ఎదుర్కోవడానికి మిత్రశక్తుల సైనికులకు ఈ గ్రామంలో శిక్షణ శిబిరాలను ఏర్పాటు చేశారు. అదృష్టవశాత్తు అణుబాంబులు జపాన్‌ మీద పడ్డాయి గాని, ఇంగ్లండ్‌ మీద పడలేదు. యుద్ధం ముగిసిన తర్వాత ఇక్కడి సైనిక శిబిరాలను కూడా ఖాళీ చేసేశారు. ఈ ఊరికి ఒక రైల్వే స్టేషన్‌ ఉంది. బ్రిటిష్‌ సైనికులు మాత్రమే ఇక్కడి నుంచి రాకపోకలు జరుపుతుంటారు. నిరంతరం ఇక్కడ సైనికులు కాపలా ఉంటారు. మామూలు సమయాల్లో జనాలు ఇక్కడ అడుగు పెట్టకుండా నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయి. ఈ ఊరి ప్రవేశమార్గం సమీపంలోనే నిషేధాజ్ఞల హెచ్చరిక బోర్డులు కనిపిస్తాయి.

అయితే, ఏడాదికి ఒకసారి మాత్రమే ఇక్కడకు జనాలను అనుమతిస్తారు. ఏటా ఆగస్టు 19న ఈ గ్రామ ప్రవేశ ద్వారం జనాల కోసం తెరుచుకుంటుంది. వందల సంఖ్యలో జనాలు ఆ రోజు ఇక్కడకు చేరుకుంటారు. ఇక్కడి శ్మశానవాటికలోని తమ పూర్వీకుల సమాధుల వద్ద పుష్పగుచ్ఛాలను ఉంచి ప్రార్థనలు జరుపుతారు. అలాగే, ఈ ఊళ్లోని పురాతనమైన సెయింట్‌ జైలిజ్‌ చర్చిలోనూ ప్రార్థనలు జరుపుతారు. ఈ ఒక్కరోజు జనాల రాకపోకలకు వీలుగా వార్‌మినిస్టర్‌ పట్టణం నుంచి ఇక్కడకు ప్రత్యేక బస్సులను నడుపుతారు.

Share This Article
Leave a comment