కాటకోంబ్స్.. ప్రపంచంలోనే అత్యంత భయానక ప్రదేశం

Telugu BOX Office

ప్యారిస్‌‌‌‌ అంటే.. లవ్‌‌ సిటీ. ఫ్యాషన్ సిటీ. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాల నుంచి ప్రేమికులు ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తుంటారు. ప్రపంచంలో ఉన్న ఎన్నో రొమాంటిక్‌‌ సిటీల్లో ఇది కూడా ఒకటి. అలాంటి అందమైన సిటీలో కూడా ఓ రహస్యమైన ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో ఉన్న సొరంగాల గోడలు లక్షల మంది ఎముకలు, పుర్రెలతో కట్టారు! ఇంతకీ అవి ఎవరివి? గుహల గోడలకి ఎందుకు ఎక్కాయి?

ప్యారిస్‌‌కు వెళ్తే.. ఈఫిల్ టవర్‌‌‌‌, అందమైన బిల్డింగ్‌‌లు కనిపిస్తాయి. వాటితోపాటు… చూడగానే చెమటలు పట్టించే భయంకరమైన ప్రదేశం కూడా ఒకటి ఉంది. అదే క్యాటకోంబ్స్. ప్రపంచంలోనే అత్యంత భయం కలిగించే ప్రాంతం ఇది. అందుకే ఇప్పటికీ ఈ ప్రాంతాన్ని పూర్తిగా విజిట్ చేసేందుకు పర్మిషన్‌‌ ఇవ్వడంలేదు. ఈ ప్రదేశంలో ఏకంగా 60 లక్షలకుపైగా శవాల ఎముకలు, పుర్రెలు ఉన్నాయి.

ఆధునిక ప్రపంచంలో అతిపెద్ద, అత్యంత సంపన్నమైన నగరాల్లో ఒకటిగా పేరు తెచ్చుకున్న ప్యారిస్‌‌ వేగంగా అభివృద్ధి చెందింది. దాని వల్ల జనాభా విపరీతంగా పెరిగింది. దాంతో మరణాల సంఖ్య కూడా సిటీలో ఎక్కువగానే ఉండేది. అందుకే అక్కడి శ్మశాన వాటికలు శవాలతో నిండిపోయాయి. కొత్త శవాలను పూడ్చడానికి కూడా ప్లేస్‌‌ లేకుండా పోయింది. కొన్ని శవాలను శ్మశాన వాటికల్లో అలాగే వదిలేశారు. దాంతో అవి కుళ్లిపోయి సిటీ అంతటా దుర్వాసన మొదలైంది. అదే వర్షాకాలంలో అయితే వర్షాలు బాగా పడినప్పుడు శవాలు రోడ్ల మీదకు కొట్టుకొచ్చేవట! ఆ శవాల వల్ల సిటీలోని కొన్ని ప్రాంతాలలో అంటువ్యాధుల వ్యాప్తి మొదలైంది. దాంతో ప్రజారోగ్యం ప్రమాదంలో పడింది. పరిస్థితి చేయిదాటి పోతుందనే భయంతో నగర పాలకులు ఓ నిర్ణయానికి వచ్చారు. ఆ నిర్ణయం వల్లే ఇప్పుడు ఇక్కడ ఈ రహస్య నేలమాళిగ తయారైంది.

60 లక్షల శవాలు
అప్పట్లో ఇన్నోసెంట్స్ శ్మశానవాటిక ప్యారిస్‌‌లోనే అత్యంత పెద్దది. ప్రధానమైనది. ఈ ఒక్క శ్మశానవాటికలోనే దాదాపు రెండు మిలియన్ల శవాలను పూడ్చిపెట్టారు. ఇక మిగతా శ్మశానవాటికల్లో పూడ్చిన శవాలను లెక్కిస్తే ఆ సంఖ్య ఆరు మిలియన్లకుపైనే. వాటన్నింటిని శ్మశానవాటికల నుంచి తొలగించాలని డిసైడ్​ అయ్యారు. కానీ.. వాటిని ఎక్కడ వేయాలి? అదే పెద్ద సమస్యగా మారింది. మరో చోట శ్మశానం కట్టాలంటే అంత పెద్ద స్థలం చుట్టు పక్కల ఎక్కడా లేదు. మతవిశ్వాసాలకు విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ వాటిని పారేయలేరు. కచ్చితంగా భూమిలోనే పూడ్చాలి అని ఆలోచిస్తున్నప్పుడు వాళ్లకు ఒక ఐడియా వచ్చింది.

ప్యారిస్‌‌లో కొత్త బిల్డింగ్‌‌లు కట్టడానికి అవసరమైన సున్నపురాయి కోసం అప్పటికే దాదాపు 200 మైళ్ల మేర భూగర్భ సొరంగాలు తవ్వారు. వాస్తవానికి ఈ మైనింగ్‌‌ 13వ శతాబ్దంలో మొదలైంది. ప్యారిస్‌‌ పెరిగేకొద్దీ సొరంగాలు పెరిగాయి. అలా సొరంగాలు ప్యారిస్‌‌ వీధుల కిందకి కూడా వచ్చేశాయి.18వ శతాబ్దపు చివరి నాటికి ప్యారిస్‌‌ బరువు వల్ల పాత సొరంగాలు కూలిపోవడం మొదలైంది. అదే టైంలో శ్మశానవాటికల్లో స్థలం కరువైంది. దాంతో శవాలను సొరంగాల్లో వేసి అవి కూలిపోకుండా కాపాడాలనే నిర్ణయానికి వచ్చారు. అలా చేయడం వల్ల ఆచారం ప్రకారం శవాలను పూడ్చినట్టు కూడా ఉంటుంది. భవిష్యత్తులో ఆ సొరంగాలు కూలి, వాటిపైన ఉన్న ఇండ్లు నేలమట్టం కాకుండా ఉంటుంది అనుకున్నారు.

గని కూలిపోకుండా…
అప్పటి రాజు(1777లో) తన ఆస్థాన ఆర్కిటెక్ట్ చార్లెస్-ఆక్సెల్ గుయిలౌమోట్‌‌ను గనుల్లో శవాల ఎముకలను షాఫ్ట్‌‌ల్లా పెట్టించాలని ఆదేశించాడు. రాజు ఆదేశించిన వెంటనే పని మొదలైంది.1785 నాటికి పని పూర్తయిపోయింది. దాదాపు 2.2 కిలోమీటర్ల మేర సొరంగాల గోడలకు సపోర్ట్‌‌గా ఎముకలు, పుర్రెలు పెట్టారు. ఇందుకు కార్మికులు ప్రతి రోజు రాత్రి శవాలను తవ్వి, గనులను ఎముకలతో నింపేశారు. ఆ ఎముకలే ఇప్పటికీ అక్కడ ఉన్నాయి. అప్పట్లో ‘‘క్యాథలిక్‌‌ ఆఫీస్ ఆఫ్ ది డెడ్” ప్రార్థనల కోసం ఒక ప్రీస్ట్‌‌ని కూడా నియమించింది. అవశేషాలను తీసుకెళ్లే ప్రతి బండితో వెళ్లి ప్రార్ధించేవాడు ఆయన. అలా చేస్తే.. ఆ ఆత్మలు శాంతిస్తాయని నమ్మేవాళ్లు. ఆ తర్వాత ఫ్రాన్స్‌‌లో తిరుగుబాటు జరిగి చాలామందిని ఉరితీశారు. ఆ శవాలను కూడా ఈ గనుల్లోనే పూడ్చారు.

నెపోలియన్ కాలంలో…
ఫ్రెంచి విప్లవం తర్వాత నెపోలియన్ అధికారంలోకి వచ్చాడు. వేగవంతమైన ఆధునికీకరణ కోసం పాలనలో అనేక మార్పులు చేశాడు. యూరప్‌‌లో ప్రముఖ స్మారక నగరంగా గుర్తించిన రోమ్‌‌లో అప్పటికే అండర్‌‌‌‌గ్రౌండ్ టూర్ ఉంది. అలాంటిదే ఫ్రాన్స్‌‌లో కూడా ఉండాలని నెపోలియన్ భావించాడు. అందుకే నికోలస్ ఫ్రోచోట్, క్వారీల ఇన్‌‌స్పెక్టర్-జనరల్ లూయిస్–ఎటియెన్ హెరికార్ట్ డి థురీలకు ఆ బాధ్యత అప్పగించాడు. ఒక చిన్న చార్నల్ హౌస్(చనిపోయిన వాళ్ల అస్థికలు ఉంచే ప్రదేశం) నుండి సొరంగాల్లోకి వెళ్లడానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించాడు. ప్రజలు కిందికి వెళ్లి అక్కడి ఎముకల గోడలను చూసి, తిరిగి వచ్చేందుకు ఏర్పాట్లు చేశారు అధికారులు. అలా క్యాటాకోంబ్స్ టూరిజం మొదలైంది. పెద్ద పెద్ద కుప్పలుగా ఉన్న ఎముకలను, అస్థిపంజరాలను హెరికార్ట్ డి థురీ ఆధ్వర్యంలో అందంగా పేర్చారు. ఈ మార్పులు చేయడం వల్ల అదొక టూరిస్ట్ ఎట్రాక్షన్‌‌గా మారింది. కానీ.. మొదట్లో దాన్ని చూసేందుకు ఎక్కవగా ఇంట్రెస్ట్ చూపించేవాళ్లు కాదు. అందుకే1810లో హెరికార్ట్ డి థురీ రిలీజ్​ చేసిన ఒక మార్కెటింగ్ బ్రోచర్ వల్ల క్యాటాకోంబ్స్‌‌కు ఎంతో గుర్తింపు వచ్చింది. టూరిస్ట్​లు రావడం మొదలైంది.

పార్టీలు తర్వాత అధికారంలోకి వచ్చిన చార్లెస్–X భయంగొలిపే ఈ సొరంగాలను పార్టీలు చేసుకోవడానికి కూడా వాడుకున్నాడనే పుకార్లు వచ్చాయి. కానీ.. ఇందులో పార్టీలు చేసుకోవడం అప్పట్లో చట్ట విరుద్ధం. ఏప్రిల్ 2, 1897న వంద మంది ఉన్న మ్యుజీషియన్స్​ టీంతో క్యాటాకోంబ్స్‌‌లో చట్టవిరుద్ధంగా కచేరీ పెట్టించారని చెప్తుంటారు. ఇలా చట్టవిరుద్ధంగా నిర్వహించిన కార్యక్రమాల వల్ల కొన్ని పుర్రెలు రహస్యంగా మాయమయ్యాయి. చాలామంది గెస్ట్‌‌లు వాటిని తమతో తీసుకెళ్లేవాళ్లు. దాంతో అక్కడ పనిచేసే కార్మికులు వాటి స్థానాల్లో కొత్త పుర్రెలను పెట్టేవాళ్లు.

కళాకృతులకు నిలయం
ఇక్కడ ఎముకలు మాత్రమే కాదు.. వాటితో చేసిన రకరకాల కళాకృతులు ఉన్నాయి. కొందరు ప్రసిద్ధ వ్యక్తుల అవశేషాలు కూడా ఇక్కడ ఉన్నాయి. కళాకృతులు ప్యారిస్‌‌చరిత్ర, గొప్పదనాన్ని, కళలు, సంస్కృతిని చెప్తాయి. రచయితలు ఫ్రాంకోయిస్ రాబెలాయిస్, జీన్ డి లా, చార్లెస్ పెరాల్ట్, శిల్పి ఫ్రాంకోయిస్ గిరార్డన్, ప్రసిద్ధ చిత్రకారుడు సైమన్ వౌట్, వాస్తుశిల్పులు సాలమన్ డి బ్రోస్సే, క్లాడ్ పెరాల్ట్ సమాధులు కూడా ఇక్కడే ఉన్నాయి. ఈ సొరంగాలు పాతకాలపు పర్షియన్‌‌ సమాజాన్ని కళ్లకు కట్టినట్టు చూపిస్తాయి.

Share This Article
Leave a comment