Ice Apple: తాటిముంజెలు… కోటి లాభాలు

Telugu BOX Office

‘ఇక్కడి నుంచి చూస్తే ఇనుము, దగ్గరికిపోతే గుండు, పట్టి చూస్తే పండు, తింటే తీయగనుండు’ ఈ పొడుపుకథకు జవాబు తాటిపండు అని అందరూ చెప్పకపోవచ్చు కానీ ‘దాహం తీర్చే గుణం, వెన్నలా కరిగిపోయే తీరు, ఎండల్లో చలువనిచ్చే ఐస్‌ పండు’ ఏమిటది… అంటే మాత్రం కాసేపు ఆలోచించి అయినా తాటిముంజె అని చెబుతారు. మంచు ముద్దలాంటి ముంజె- వేసవి కాలంలో చల్లదనాన్ని మాత్రమే కాదు, అంతకుమించిన మేలే చేస్తుందట.

ఎండాకాలపు ఉక్కపోతలు ఎంతలా ఇబ్బంది పెట్టినా… వేసవి వడగాలులు విలవిలలాడిపోయేలా చేసినా… సూర్యుడి ప్రతాపం మనల్ని మరెంత తాపానికి గురిచేసినా… వాటిని కాస్త మరిపించేవి- ఈ కాలంలోనే దొరికే ప్రత్యేకమైన పండ్లు. వాటిల్లో మామిడికాయలతో సమానంగా అందరికీ నచ్చేవి తాటి ముంజెలు. మంచు ముక్కల్లాంటి ముంజెల్లో తినడానికి ఏముంటుంది అని కొంతమంది అనుకుంటారు కానీ నిజానికి బోలెడన్ని పోషకాలున్నాయి. శరీరానికి కావాల్సిన నీళ్లను అందించడం దగ్గర్నుంచి క్యాన్సర్‌ కారకాల్ని తరిమికొట్టే వరకూ ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి.

నిజానికి జామ, మామిడి, అరటిలాంటి పండ్ల సంగతి వేరు, ముంజెల విషయం వేరు. ఎక్కువగా సహజసిద్ధంగా మాత్రమే పెరిగే తాటిచెట్ల నుంచి కొబ్బరికాయల్లాంటి తాటికాయల్ని దింపడం, వాటిని ఒక దగ్గరకు చేర్చడం, కాయల్ని కత్తితో కొట్టడం… అబ్బో ఇదంతా కూడా పెద్ద ప్రయాసే. అంతేకాదు, తినడమూ అంత సులువేం కాదు… గుండ్రని తాటికాయకి పైన ఉన్న డిప్పను కోయగానే మూడు రంధ్రాలు కనిపిస్తాయి. వాటిల్లోనే పసుపు, నారింజ రంగు తొక్కలతో ముంజెలు ప్రత్యక్షమవుతాయి. అవి మరీ లేతవైతే వేళ్లతో జుర్రుకోవడమో కాస్త ముదురుగా ఉంటే తీసుకుని తినడమో చేస్తుంటారు. ఆ తతంగమంతా ఎలా ఉన్నా, చెట్టు మీద నుంచి నోట్లోకి చేరేవరకూ ఎంత శ్రమైనా… ‘అబ్బ, జెల్లీ లాంటి ఆ ముంజె తినకుండానే వేసవి గడిచిపోతుందేమో’ అంటూ వాటికోసం ఎదురుచూసేవాళ్లెందరో.

తాటి ముంజెల ఉపయోగాలు
శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజల్లో ఎక్కువగా ఉంటుంది. ముంజల్లో విటమిన్ ఎ, బి, సి,ఐరన్ జింక్, పాస్ఫరస్, పొటాషియం వంటి ఖనిజ లవణాలున్నాయి. ఇవి శరీరంలోని అనవసర పదార్థాలను బయటికి పంపుతాయి. ఈ కారణంగా శరీరం అంతర్గతం శుభ్రమవుతుంది. వీటిని తినడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.వీటిలోని నీటిశాతం పొట్ట నిండుగా ఉన్న ఫీలింగ్‌ని కలిగిస్తుంది. ఈ కారణంగా త్వరగా ఆకలి వేయదు. ముఖ్యంగా ఎండాకాలంలో ఈ ముంజలు మంచి ఉపశమనాన్ని ఇస్తాయి. శరీరాన్ని చల్లబరిచే గుణం ముంజలకు ఉంటుంది. వీటిని తినడం వల్ల అలసట తగ్గుతుంది. మలబద్ధక సమస్యను నివారించడంలో తాటి ముంజలు బాగా పనిచేస్తాయి. రెగ్యులర్‌గా వీటిని తినడం వల్ల జీర్ణ క్రియ మెరుగుపడి, ఎసిడిటీ సమస్య తగ్గుతుంది. గర్భిణీలు వీటిని తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలుంటాయి. కేవలం ఆరోగ్యపరంగానే కాదు.. అందం పరంగా కూడా ముంజలు బాగా పనిచేస్తాయి. వీటిని తినడం వల్ల మొటిమలు కూడా తగ్గుతాయి.

Share This Article
Leave a comment