కిటికీలోంచి దర్శనమిచ్చే హనుమంతుడు

Telugu BOX Office

దేశవ్యాప్తంగా ఆంజనేయుడి ఆలయాలు చాలానే ఉన్నా… ఈ గుడిలో కొలువైన స్వామి కిటికీలోంచి కనిపిస్తూ దాసాంజనేయుడిగా పూజలు అందుకుంటున్నాడు. అనారోగ్యాలను నయం చేసి, భక్తుల కోర్కెలను నెరవేర్చే వరప్రదాతగా ప్రసిద్ధి పొందిన ఈ స్వామిని దర్శించుకునే భక్తులు మొక్కు రూపంలో నెయ్యిని సమర్పిస్తారు. మరికొన్ని ప్రత్యేకతలకూ నెలవైన ఈ ఆలయాన్ని సుమారు నాలుగువందల యాభై సంవత్సరాల క్రితం నిర్మించారని ప్రతీతి.

ఇక్కడ కొలువైన హనుమంతుడిని స్త్రీలు కిటికీలోంచి మాత్రమే దర్శించుకుంటే పురుషులకు నేరుగా గర్భగుడిలోకి ప్రవేశం ఉంటుంది. ఆ గర్భగుడి కూడా గుహ తరహాలో బాగా కిందకు ఉంటుంది. స్వామి చెంత ముడుపు కట్టడం, కోరిక తీరాక శక్తికొలదీ నెయ్యిని సమర్పించుకోవడం…ఈ ఆలయంలో నిత్యం చూడొచ్చు. స్వామి పాదాల నుంచి నీరు ఊరడం, అఖండ దీపాలు వంటి ప్రత్యేకతలు కలిగిన ఈ ఆలయం భాగ్యనగరంలోని పాతబస్తీ కార్వాన్‌లో ఉంది.


స్థల పురాణం
ఈ ఆలయ నిర్మాణం వెనుకా ఆసక్తికరమైన కథనం ఉంది. సీతాదేవిని రావణుడు అపహరించి తీసుకెళ్లాక హనుమంతుడు అమ్మవారికోసం వెతుకుతూ ముచుకుందా(మూసీ) నది ప్రాంతానికి చేరుకున్నాడనీ.. నదిలో స్నానమాచరించి తన తలపైన ఉన్న నీటిని విదిలించుకోవడంతో ఆ నీటి చుక్కలు పరిసర ప్రాంతాల్లో పడ్డాయని అంటారు. దాన్ని గుర్తించే ఛత్రపతి శివాజీ గురువైన సమర్థ రామదాస్‌ అనే స్వామీజీ ఈ ఆలయాన్ని ఇక్కడ నిర్మించాడు. మహారాష్ట్రలో పుట్టిన ఈ స్వామిజీ చిన్నతనం నుంచీ రామభక్తుడు. ఔరంగజేబు పాలిస్తున్న కాలంలో మతమార్పిడి ఎక్కువగా ఉండటాన్ని గమనించిన ఈ స్వామీజీ తన శిష్యులతో దేశవ్యాప్తంగా పర్యటిస్తూ రామ నామ ప్రచారం చేసేవాడట. ఆ క్రమంలో హైదరాబాద్‌కు వచ్చిన ఆయన 1647లో మూసీనది దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడట. అలా రామదాసు స్వామిజీ తాను వెళ్లిన ప్రతిచోటా వందల సంఖ్యలో ఆంజనేయుడి విగ్రహాలను ప్రతిష్ఠించి ఆలయాలు కట్టించాడని చెబుతారు.

సింధూరం రాయరు
ఆలయంలోకి ప్రవేశించే భక్తులకు పెద్ద కిటికీ కనిపిస్తుంది. ఆ కిటికీలోంచే హనుమంతుడిని దర్శించుకోవచ్చు. పురుషులు మాత్రం మెట్లమార్గం ద్వారా వెళ్లి.. గుహలా కనిపించే గర్భగుడిలో స్వామిని నేరుగానే చూడొచ్చు. హనుమంతుడు బ్రహ్మచారి కావడం వల్ల ఇక్కడ స్త్రీలకు గర్భగుడిలోకి ప్రవేశం ఉండదనీ.. అయితే ఏ ఇబ్బందీ లేకుండా స్వామిని దర్శించుకునేందుకే ఇలా కిటికీ ఏర్పాటు చేశారనీ చెబుతారు.

సాధారణంగా హనుమంతుడికి సిందూరాన్ని లేపనంగా పూస్తారు. కానీ ఇక్కడ సిందూరానికి బదులు కుంకుమపువ్వూ, గంధం కలిపి తయారుచేసిన లేపనాన్ని పట్టిస్తారు. స్వామి కలలో కనిపించి తనకు కుంకుమపువ్వు, గంధం కలిపిన లేపనాన్ని రాయమని చెప్పడంవల్లే ఇప్పటికీ అదే కొనసాగిస్తున్నారట. అలాగే స్వామి పాదాల నుంచి నీరు ఊరడం కూడా ఇక్కడ చూడొచ్చు. సర్వరోగ నివారణి అయిన ఆ నీటిని ఎప్పటికప్పుడు సేకరించి.. ఇక్కడకు వచ్చే భక్తులపైన చల్లుతారు. ఇక, అఖండదీపం అంటే నిరంతరం వెలుగుతూ ఉండటం. ఈ ఆలయంలోపల నేతితో వెలిగించిన అయిదు అఖండ దీపాలు కనిపిస్తాయి. వాటిని ఏడాదిలో 363 రోజులు మాత్రమే ఉంచి.. తరువాత మళ్లీ కొత్తవి వెలిగిస్తారు. చైత్రశుద్ధ త్రయోదశి నాడు రామదాసు సమాధి అయిన రోజు కావడంతో ఆ దీపాలను తొలగించి చైత్రశుద్ధపౌర్ణమినాడు హనుమజ్జయంతి సందర్భంగా మళ్లీ దీపాలను వెలిగిస్తారట.

నెయ్యికి ప్రాధాన్యం
ఈ ఆలయ బాధ్యతల్ని రామదాసు స్వామీజీ వంశస్థులే చూస్తున్నారు. ఇక్కడకు వచ్చే భక్తులు మనసులో ఏదయినా అనుకుని మంగళవారం లేదా శనివారం నాడు ముడుపు కట్టి స్వామి చెంత ఉంచుతారు. తమ కోరిక తీరాక నెయ్యిని మొక్కుగా చెల్లించుకుంటారు. అలా భక్తులు చెల్లించిన నెయ్యినే దీపారాధనకూ, నైవేద్యాల తయారీకీ ఉపయోగిస్తారు. పాతతరం నిర్మాణశైలిలో కనిపించే ఈ ఆలయాన్ని ఛత్రపతి శివాజీ కూడా దర్శించుకున్నాడట. రేణుకామాత ఆలయాన్నీ, గోశాలనూ ఇక్కడ చూడొచ్చు భక్తులు.

Share This Article
Leave a comment