రోడ్డు పక్కన హోటల్.. నెలకి రూ.4.5కోట్ల బిజినెస్

Telugu BOX Office

సాధారణంగా చిన్న హోటళ్లు అంటే నెలకు వేలల్లో… పెద్ద హోటళ్లు అయితే లక్షల్లో సంపాదిస్తాయి. కానీ ఒక చిన్న హోటల్ నెలకు రూ.నాలుగున్నర కోట్ల టర్నోవర్ సాధిస్తోందంటే నమ్మగలరా.. కచ్చితంగా నమ్మాల్సిందే. చూడటానికి చిన్న హోటల్‌లాగే కనిపిస్తుంది గానీ అక్కడ ఎప్పుడూ రద్దీయే. గంటల తరబడి క్యూలో నిలబడి అయినా సరే అక్కడ టిఫిన్ చేయాలని జనాలు ఉవ్విళ్లూరుతుంటారు. అలాగని అక్కడ ఏమైనా స్పెషల్ వెరైటీలు దొరుకుతాయా అంటే.. అవీ ఉండవు.. అన్ని హోటళ్ల మాదిరిగానే మెనూ ఉంటుంది. కానీ అక్కడ నిత్యం ఏడువేల మందికి పైగా టిఫిన్ చేయడానికి వస్తుంటారు.

ఇప్పుడు చెప్పేదంతా కర్ణాటక రాజధాని బెంగళూరులో ఉన్న ‘రామేశ్వరం కెఫె’ గురించే. 2021లో చిన్న స్థలంలో ప్రారంభమైన రామేశ్వరం కెఫెకి నిత్యం సుమారు 7500 మంది కస్టమర్లు వస్తారు. దివ్య, రాఘవేంద్రరావు అనే జంటకు అబ్దుల్‌ కలాం అంటే ఇష్టం కావడంతో ఆయన స్వస్థలం రామేశ్వరం పేరు మీద హోటల్ ప్రారంభించారు. తక్కువ ధరకే ఆహారం అందిస్తున్న రామేశ్వరం కెఫె రుచి గురించి ఏడాది తిరిగే సరికి కేవలం నోటి ప్రచారంతోనే నగరమంతా తెలిసింది.

ప్లేట్ల నుంచి పార్శిళ్ల వరకు ఎక్కడా ప్లాస్టిక్‌ను ఉపయోగించకపోవడం ఈ హోటల్ ప్రత్యేకత. వడ్డించే ప్లేటు నుంచి పార్శిళ్ల వరకూ స్టీల్‌వే వాడతారు. పండుగ, ప్రత్యేక సందర్భాల్లో దక్షిణ భారతదేశ ప్రసాదాలను వడ్డిస్తారు. కాంబో రూపంలో దొరికే ఈ ప్రసాదాల కోసం పెద్ద సంఖ్యలో వెళుతుంటారు. పైగా ప్రతిరోజూ జాతీయగీతం ఆలపించాకే సిబ్బంది వంటగదిలో అడుగుపెడతారు. రుచీ, శుచీ పాటిస్తామని ప్రమాణం చేశాకే పనులు మొదలుపెడతారు. ఉదయం, సాయంత్రం వేళ ఈ హోటల్‌ ఎదుట కస్టమర్లు బారులు తీరి ఉంటారు. బెంగళూరు వెళ్లే వారు ఒక్కసారైనా ఈ హోటల్‌లో టిఫిన్ తిని తీరాల్సిందే.

Share This Article
Leave a comment