Zepto: ఇద్దరు మిత్రులు.. 21 ఏళ్లకే రూ.15వేల కోట్ల వ్యాపారం!

Telugu BOX Office

మనదేశంలో టీనేజ్‌ అంటే… బాల్యం కిందే లెక్క. 19 ఏళ్ళొచ్చినా సరే వాళ్ళని చిన్నపిల్లలుగానే తల్లిదండ్రులు చూస్తుంటారు. కానీ అదే టీనేజ్‌లో ఈ ఇద్దరూ కోట్ల రూపాయల విలువచేసే సంస్థని పెట్టారు. ఆర్డర్‌ చేసిన పదినిమిషాల్లోనే కిరాణా సరకులని ఇంటికి తెచ్చిచ్చే ‘జెప్టో’తో కొత్త విప్లవమే సృష్టించారు. ఆదిత్‌ పాలిచా, కైవల్య ఓహ్రా… అంత చిన్న వయసులో ఇవన్నీ ఎలా సాధించారో చూద్దామా…

అంకుర సంస్థలు బిలియన్‌ డాలర్ల మార్కెట్‌ విలువని అందుకోవడమన్నది ఓ మైలురాయి. దాన్ని చేరుకున్న స్టార్టప్‌లని ‘యూనికార్న్‌’లని అంటారు. 2021లో మనదేశంలో 32 సంస్థలు యూనికార్న్‌లుగా మారి రికార్డు సృష్టిస్తే… నిరుడు 23 సంస్థలు ఆ హోదాని సొంతం చేసుకున్నాయి. కానీ ఈ ఏడాది… ఆగస్టు దాకా ఒక్క సంస్థ కూడా యూనికార్న్‌ కాలేదు. అంకురాల్లో పెట్టుబడులు పెట్టి… వాటిని యూనికార్న్‌లుగా విలువకట్టాల్సిన మదుపుసంస్థలు ఆచితూచి అడుగేస్తుండటమే ఇందుక్కారణం. కానీ ఆ అపనమ్మకాలన్నింటినీ పారదోలి ‘స్టెప్‌స్టోన్‌’ సంస్థ నుంచి 15 వందలకోట్ల భారీ పెట్టుబడులు రాబట్టింది జెప్టో… దాంతో తన మార్కెట్‌విలువని సుమారు 15 వేల కోట్లరూపాయలకి పెంచుకుంది. అలా ఈ ఏడాది తొలి యూనికార్న్‌గా బోణీకొట్టింది. సరిగ్గా ఏడాది ముందు… హురూన్‌ ఇండియా అన్న బిజినెస్‌ సర్వే ఏజెన్సీ ఈ సంస్థ వ్యవస్థాపకులు ఆదిత్‌ పాలిచా, కైవల్య ఓహ్రాలని మనదేశంలో ‘అతితక్కువ సమయంలో మిలియనీర్లుగా మారిన పిన్నవయస్కులుగా ప్రకటించింది. ఈ విజయాల వెనక ఆదిత్‌, కైవల్యల అద్భుతమైన మేధస్సే కాదు… అంతకన్నా గొప్ప సాహసమూ ఉంది.

‘మన చుట్టూ ఎన్నో సమస్యలున్నాయి. పెద్దయ్యాక వాటికి పరిష్కారం వెతకాలి’ – ఒకప్పటి పిల్లలు ఇలాగే ఆలోచించేవారు. కానీ నేటితరంవాళ్ళు పెద్దయ్యేదాకా ఆగాలనుకోవడం లేదు. టెక్నాలజీ ద్వారా అప్పటికప్పుడు పరిష్కారం సాధించాలనుకుంటున్నారు. వాళ్ళు నేర్చుకుంటున్న కంప్యూటర్‌ కోడింగ్‌ ఈ ఆత్మవిశ్వాసాన్ని అందిస్తోంది! ఆదిత్‌, కైవల్యల విషయంలో అదే జరిగింది. ఆ ఇద్దరిదీ ముంబయి అయినా తల్లిదండ్రుల ఉద్యోగం కారణంగా దుబాయ్‌లో చదివారు.

తొమ్మిదో ఏట నుంచీ మంచి స్నేహితులు. ఓ రోజు ఆదిత్‌ తన తమ్ముడు ఇషాన్‌ని బడిలో దిగబెట్టి రావడానికని వెళితే… ట్రాఫిక్‌ ఇబ్బందుల కారణంగా గంట లేటైందట. ‘దుబాయ్‌లో ఉన్న ప్రతి ఒక్కరూ సొంతకారులో వెళుతుండటమే ఈ రద్దీకి కారణం. దీనికి పరిష్కారం ఏమిటీ?’ అని ఆలోచిస్తే అతనికి ‘కార్‌ పూలింగ్‌’ గురించి తెలిసిందట. వెంటనే- బడిపిల్లల్ని దింపే తల్లిదండ్రుల కోసం కైవల్యతో కలిసి ‘గోపూల్‌’ అనే ఆప్‌ తయారుచేశాడు ఆదిత్‌. దుబాయ్‌ నగరంలోని అన్ని స్కూళ్లనీ, దాదాపు అన్ని రూట్లనీ దృష్టిలో ఉంచుకుని పరిచయం చేసిన ఈ ఆప్‌… అక్కడ మంచి ఆదరణ అందుకుంది. ‘ఎమిరేట్స్‌ ఎన్‌బీడీ’ బ్యాంకు పెట్టుబడితో దాన్ని అంకురసంస్థగానూ మార్చారు ఇద్దరూ. అప్పటికి వాళ్ళ వయసు 16 ఏళ్ళే!

గోపూల్‌ సంస్థని రెండేళ్ళు నడిపాక… దుబాయ్‌లోని ఓ పెద్ద సాఫ్ట్‌వేర్‌ సంస్థకి అమ్మితే ఇద్దరికీ చెరో మూడుకోట్ల రూపాయలదాకా వచ్చాయి. ఈలోపు ఇంటర్‌ పూర్తయి… అమెరికాలోని ప్రఖ్యాత స్టాన్‌ఫర్డ్‌ యూనివర్సిటీలో సీటు సాధించారు. కానీ కాలేజీకి వెళ్ళిన నెలకే కరోనా కారణంగా లాక్‌డౌన్‌ పడింది. స్నేహితులిద్దరూ దుబాయ్‌కి వెళ్ళకుండా ముంబయిలోని కైవల్య తాతయ్య వాళ్ళింటికొచ్చారు. లాక్‌డౌన్‌ కాలంలో ముంబయిలోని చిరు వ్యాపారులందరూ సొంతూళ్ళకి వెళ్ళిపోవడంతో కిరాణా సరకుల్లేక ఇబ్బందిపడ్డారు. దానికి పరిష్కారంగా ‘కిరాణాకార్ట్‌’ అన్న ఆప్‌ని రూపొందించారు. అది మొదట్లో బాగానే నడిచింది కానీ పెద్ద సంస్థల నుంచి పోటీ ఎదురవడంతో లాభాలు రాలేదు. దాంతో ‘కేవలం 10 నిమిషాల్లో సరకులు చేరవేస్తామ’ని ప్రకటిస్తూ కంపెనీ పేరుని ‘జెప్టో’ అని మార్చారు. ముంబయిలోని ప్రతి ఏరియాలోనూ ఓ చిన్నపాటి డార్క్‌ స్టోర్‌ ఏర్పాటుచేసి… 10 నిమిషాలకి కాదు… సగటున 8.47 నిమిషాలకే సరకులు చేరవేయడం మొదలుపెట్టారు.

‘జెప్టో’ తన సేవలు మొదలుపెట్టిన మొదటి నెలలోనే పెద్ద హిట్టయ్యింది! వాళ్ళ ఆదాయాన్ని చూసిన అమెరికన్‌ వై-కాంబినేటర్‌ సంస్థ తొలి పెట్టుబడులు పెట్టింది. కంపెనీ విలువని 1500 కోట్లకి లెక్కగట్టింది. ఆ పెట్టుబడితో వీళ్ళు సేల్స్‌, మేనేజ్‌మెంట్‌ విభాగాల్లో సీనియర్‌ ఎగ్జిక్యూటివ్‌లని చేర్చుకున్నారు. చిన్నపిల్లలైనా సరే తమని నమ్మి వచ్చిన ఆ సీనియర్లకి ఈక్విటీల రూపంలో కంపెనీలో పెద్ద ఎత్తున వాటాలు కేటాయించారు. అలా అందరూ కలిసి ఏడాది తిరక్కుండానే సంస్థ విలువని 7,500 కోట్ల రూపాయలకి చేర్చారు. మరో ఏడాదికల్లా కంపెనీ విలువని రెట్టింపు చేసి… ఇలా యూనికార్న్‌గా పట్టం కట్టారు.

బిజినెస్ సరే ఈ ఇద్దరి చదువు ఏమైందని అంటారా… లాక్‌డౌన్‌ తర్వాత స్టాన్‌ఫర్డ్‌లో ఎప్పటిలాగే క్లాసులు మొదలయ్యాయి కానీ వీళ్ళు పోలేదు. ‘మేం అక్కడ చదవాలను కున్నదే ఓ సంస్థని ఏర్పాటుచేయడం కోసం. అది ఇక్కడే సాధించాక మళ్ళీ వెళ్ళడం ఎందుకూ అనిపించింది…’ అంటున్నారు ఈ ఇద్దరు మిత్రులు.

Share This Article
Leave a comment