అభివృద్ధికి చిరునామా… ముఖరా(కె)

Telugu BOX Office

కొన్ని గ్రామాల్ని చూస్తే ‘ఈ ఊళ్లు ఎప్పటికీ మారవా’ అన్న భావన కలుగుతుంది. ఇంకొన్నింటిని చూస్తే మాత్రం ‘గ్రామాలూ ప్రగతి బాట పట్టాయి’… అనిపించకమానదు. అలాంటి గ్రామమే ముఖరా(కె). ఒకే మాటమీద నిలబడి… చైతన్యంతో అడుగులేస్తే… ప్రతి పల్లె అభివృద్ధికి చిరునామాగా మారుతుందని నిరూపిస్తోందీ తెలంగాణలో ఆదిలాబాద్‌ జిల్లాలోని ఓ మారుమూల గ్రామం. ఒకప్పుడు ఆ ఊరు నిండా సమస్యలే. తాగుబోతుల గొడవలు, శిథిలావస్థలో పాఠశాల భవనం, వాగు పొంగితే మిగతా ప్రపంచంతో సంబంధాలు తెగిపోవడం… అలాంటి గ్రామం ముఖచిత్రం మారిపోయింది.

తాగుడు పంచాయతీలు ఎక్కువవుతుండటంతో… 2010లో ముఖరా(కె) గ్రామ పెద్దలు మద్యపాన నిషేధాన్ని ప్రకటించారు. గ్రామంలో మద్యం తాగినా, తయారుచేసినా, అమ్మినా జరిమానా విధించాలని తీర్మానించారు. మద్యం మత్తు వదిలించుకున్న ఏడాదికే 2011లో సంత్‌ నారాయణ మహారాజ్‌ ఆధ్వర్యంలో ప్రత్యేక సత్సంగ్‌ ఏర్పాటుచేసి మాంసాహారాన్నీ నిషేధించారు. 70 శాతం మంది తులసి మాలలు ధరించి దీక్షబూని అందుకు ప్రతినబూనారు. ఆపైన పెళ్లిళ్ల ఖర్చు తగ్గించుకోవడానికి ఒకే వేదికమీద 10 జంటలకుపైగా వివాహాలు జరిపించడం మొదలుపెట్టారు. ఐక్యతలోని బలాన్ని తెలుసుకుంటూ వచ్చిన గ్రామ పెద్దలు తమ దృష్టిని ఈసారి బడి మీదకి మరల్చారు. శిథిలమైన భవనం, 26 మంది విద్యార్థులకు ఒకే ఒక్క టీచర్‌… ఇదీ 2014లో పాఠశాల దుస్థితి. గ్రామస్థుల అర్జీతో 2015లో నూతన భవనం కేటాయించారు అధికారులు. నిర్మాణం పూర్తయ్యాక గ్రామం నుంచి ఎవరూ ప్రైవేటు స్కూళ్లకు వెళ్లకూడదని తీర్మానించుకుని… ఇద్దరు విద్యా వాలంటీర్లనూ నియమించుకున్నారు. ప్రస్తుతం ఈ బడిలో 83 మంది చదువుతుండగా, ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులున్నారు. 2016లో డిజిటల్‌ చెల్లింపుల పైలట్‌ ప్రాజెక్టుని వంద శాతం అమలుచేసి కేంద్ర ప్రభుత్వ అవార్డుని దక్కించుకుందీ గ్రామం. ఆ సమయంలో కలెక్టర్‌గా ఉన్న జ్యోతి బుద్ధప్రకాశ్‌ గ్రామాన్ని సందర్శించి రూ.5లక్షలతో నీటి శుద్ధి పరికరాలు అందించారు. గ్రామస్థుల అభ్యర్థన మేరకు సాగుభూమి లేని 33 దళిత కుటుంబాలకు ‘దళిత బస్తీ’ పథకం కింద రూ.4.30 కోట్లు కేటాయించి… ఒక్కో కుటుంబానికి మూడేసి ఎకరాలు అందించారు. మిగిలిన దళిత రైతులకు బోర్లు వేయించుకునేందుకు నిధులు అందించారు.

గతంలో ఈ గ్రామం ధరంపురి పంచాయతీలో భాగం. 2018లో నూతన పంచాయతీగా ఏర్పడింది. మొదటిసారి బీసీ మహిళకు రిజర్వ్‌ కావడంతో సర్పంచ్‌గా గాడ్గె మీనాక్షిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆ తర్వాత నుంచి గ్రామం మరింత ప్రణాళికాబద్ధంగా అడుగులువేసింది. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడు గుంత నిర్మాణం చేపట్టారు. ఉద్యానవనాలు అభివృద్ధిచేసేందుకు 2021లో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘పల్లె ప్రకృతివనం’ కార్యక్రమాన్ని మొదటగా ప్రారంభించి విజయవంతమయ్యారు. ఆపైన ‘పల్లె ప్రగతి’ కార్యక్రమంలో- ప్రతి పథకాన్నీ అద్భుతంగా అమలుచేస్తూ వచ్చారు. గ్రామంలో ఇప్పటి వరకూ లక్ష మొక్కలు నాటారు. చెత్త సేకరణకు ప్రభుత్వం ట్రాక్టర్‌ ఇచ్చి, డంపింగ్‌ యార్డ్‌ నిర్మించింది. దాంతో తడి, పొడి చెత్తను వేరుచేసి, సేంద్రియ ఎరువుని తయారుచేస్తూ ఏటా రూ.3-4 లక్షలు సంపాదిస్తున్నారు.

ఆ మొత్తంతో గ్రామ ప్రధాన వీధుల్లో సౌర విద్యుత్‌ దీపాలు ఏర్పాటుచేసుకున్నారు. ఇంకుడు గుంతల నిర్మాణంతోపాటు సమీపంలోని వాగుపై రూ.2.5కోట్లతో చెక్‌డ్యామ్‌ కట్టి భూగర్భజలాలు పెంచుకుని తాగునీటి సమస్యనీ పరిష్కరించుకున్నారు. ఇప్పటివరకూ అయిదు జాతీయ అవార్డుల్ని అందుకుందీ గ్రామం. సౌర విద్యుత్‌ వినియోగంలో ముందడుగు వేసినందుకు ‘గ్రామ్‌ ఉర్జా స్వరాజ్‌’ అవార్డుతోపాటు రూ.50 లక్షల రివార్డునీ అందుకుంది. ఆ సొమ్ముతో మరిన్ని సౌర దీపాలను ఏర్పాటుచేసుకున్నారు. ‘ప్రజల తోడ్పాటుతోనే అభివృద్ధివైపు అడుగులు పడుతున్నాయి. ప్రభుత్వ నిధులూ, అభివృద్ధి కార్యక్రమాలూ గ్రామానికి చేయూతనిచ్చాయి’ అని చెబుతారు సర్పంచ్‌ మీనాక్షి.

గ్రామాన్ని బయటి ప్రపంచంతో కలిపే మార్గంలో వాగుపైన మూడేళ్ల కిందట రూ.9 కోట్లతో వంతెన నిర్మించుకున్నారు. గ్రామ, ప్రభుత్వ నిధులు రూ.కోటి ఖర్చుచేసి కల్యాణ మండపం నిర్మించారు. మరో కోటి రూపాయలతో గ్రామ నిధిని ఏర్పాటు చేసుకున్నారు. ‘అవినీతికి తావులేకుండా పథకాల్ని అమలు చేస్తుండటంతో అధికార యంత్రాంగమూ అన్ని విధాలా సహకరిస్తోంది. అనేక పైలట్‌ ప్రాజెక్టులు ఇక్కడ విజయవంతమయ్యాయి’ అని చెబుతారు ఇచ్చోడ ఎంపీడీఓ రామ్‌ప్రసాద్‌. ఈ పల్లె ప్రగతిని చూడ్డానికి వచ్చిన వాళ్లంతా ‘ఇదెలా సాధ్యం’ అని అడుగుతుంటే… పై కథనే ఎంతో గర్వంగా చెబుతున్నారు గ్రామస్థులు.

Share This Article
Leave a comment