ఒవైసీల కోటపై ‘కమలం’ ఆశలు.. అందరి కళ్లూ హైదరాబాద్‌ పైనే !

Telugu BOX Office

భాగ్య నగరంలోని హైదరాబాద్‌ లోక్‌సభ స్థానం నుంచి ఓటమి ఎరుగని మజ్లిస్‌ అధినేత అసదుద్దీన్‌ ఓవైసీని ఢీకొట్టడానికి ధార్మికవేత్త, కళాకారిణి, వ్యాపారవేత్త డాక్టర్‌ కొంపెల్ల మాధవీలతకు బీజేపీ అధిష్ఠానం అవకాశం ఇచ్చింది. దీంతో అందరి చూపు ఇప్పుడు హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానం వైపు మళ్లింది. ఎన్‌సీసీ క్యాడెట్‌గా, క్లాసికల్‌ సింగర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె రాజకీయాలకు కొత్త అయినా టికెట్‌ వరించడంతో పార్టీలో తీవ్రంగా చర్చ జరుగుతోంది. పార్టీ కార్యకర్తలు, నాయకుల సమన్వయంతో తప్పక విజయం సాధిస్తానని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.

ఓసీ బ్రాహ్మణ సమాజానికి చెందిన మాధవీలత రెండేళ్లుగా పాత బస్తీ వేదికగా అనేక ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తూ సోషల్‌ మీడియాలో చురుగ్గా ఉంటున్నారు. గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగాలు, పాలన స్ఫూర్తితో బీజేపీలో చేరి రాజకీయ అరంగేట్రం చేశారు. సామాజిక కార్యకర్తగా చురుకైన పాత్ర పోషిస్తున్నారు. అనునిత్యం ప్రజల్లో ఉంటూ వారి సమస్యలు తెలుసుకుంటున్నారు. కొంతకాలంగా పాత బస్తీ ప్రజలతో మమేకమై ఆ ప్రాంతంలో పర్యటిస్తూ పేదలను ఆదుకుంటున్నారు. సామాజిక కార్యకర్తగా ఆమె త్రిపుల్‌ తలాక్‌పై అనేక ముస్లిం మహిళా సంఘాలతో కలిసి పనిచేశారు. ఎంఐఎం కంచుకోటలో అక్కడి ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీపై మాట్లాడుతూ ఇచ్చిన పలు ఇంటర్వ్యూలతో ఆమె పాపులర్‌ అయ్యారు. పాతబస్తీలో తరచూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టేవారు. అక్కడ ఏమైనా సమస్యలు వస్తే పరిష్కారం చూపేవారు. బీజేపీ ప్రతినిధిగా అసదుద్దీన్‌ విధానాలను తనదైన శైలిలో వ్యతిరేకించడంతో పార్టీ అధిష్ఠానం దృష్టిలో పడ్డారు.


అయితే అభ్యర్థిత్వం కోసం గట్టిగా ప్రయత్నాలు చేసిన బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా నాయకులు ఈ స్థానంపై పునరాలోచించాలని అధిష్ఠానాన్ని కోరుతున్నారు. రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌తోపాటు హైదరాబాద్‌ నుంచి పోటీ చేయాలని, లేదా ఎంపీ డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ పోటీ చేయాలని బీజేపీ భాగ్యనగర్‌ జిల్లా ఉపాధక్షుడు పొన్న వెంకట రమణ డిమాండ్‌ చేస్తున్నారు.

పుట్టింది.. పెరిగింది పాతబస్తీలోనే..

మాధవీలత పాతబస్తీలోని ఓల్డ్‌ సంతోష్‌ నగర్‌లో జన్మించారు. విద్యాదాయిని పాఠశాలలో ప్రాథమిక విద్యనభ్యసించారు. నిజాం కాలేజీలో డిగ్రీ, కోఠి ఉమెన్స్‌ కాలేజీలో పొలిటికల్‌ సైన్స్‌లో పీజీ పూర్తి చేశారు. ఆమె పుట్టి పెరిగిందంతా ఓల్డ్‌ సంతోష్‌ నగర్‌లోనే. 25 సంవత్సరాలపాటు అక్కడే ఉన్నారు. వివాహం అనంతరం భర్త కె.విశ్వనాథ్‌ (విరించి గ్రూప్‌ ఫౌండర్‌)తో కలిసి జూబ్లీహిల్స్‌కు వెళ్లిపోయారు. వీరికి ముగ్గురు పిల్లలు. ఇపుడు ఆమె బంజారాహిల్స్‌లోని విరించి హాస్పిటల్‌ చైర్‌పర్సన్‌. లతా ఫౌండేషన్‌ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకురాలు.


1984 నుంచి ఓవైసీల అడ్డా
గతంలో ఈ స్థానం నుంచి బరిలోకి దిగిన బీజేపీ నేతలు రెండో స్థానంలో నిలిచారు. కానీ విజయాన్ని అందుకోలేకపోయారు. తెలంగాణలో ఎంఐఎం గెలిచే ఒకే ఒక్క ఎంపీ స్థానం హైదరాబాద్‌. ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ 2004 నుంచి నాలుగు వరుస లోక్‌సభ ఎన్నికల్లో నెగ్గుతూ వస్తున్నారు. అంతకుముందు ఆయన తండ్రి సలావుద్దీన్‌ ఓవైసీ ఎంపీగా ఉన్నారు. మొత్తంగా 1984 నుంచి 2024 వరకు నాలుగు దశాబ్దాలపాటు ఎంఐఎందే ఆధిపత్యం. ఈసారి ఎలాగైనా దానికి చెక్‌పెట్టి విజయం సాధించాలని భావిస్తున్న బీజేపీ అధిష్ఠానం అనూహ్యంగా మాధవీలతకు ఛాన్స్‌ ఇచ్చింది. అసదుద్దీన్‌పైనే పోటీకి నిలపడంతో ఆమె హాట్‌ టాపిక్‌గా మారారు.

గతంలో తక్కువ మెజారిటీతోనే..
పాతబస్తీ అంటే మజ్లిస్‌, మజ్లిస్‌ అంటే పాతబస్తీగా ఇన్నాళ్లూ ఆ పార్టీకి ఎదురు గాలి లేకుండా ఉన్న వారికి ఇటీవల అసెంబ్లీ ఎన్నికలో యాకుత్‌పురాలో ఎంబీటీ అభ్యర్థి అంజదుల్లా ఖాన్‌ గట్టి పోటీ ఇచ్చారు. నాంపల్లిలో సైతం కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ఖాన్‌ గట్టిగా నిలబడ్డారు. హైదరాబాద్‌ స్థానంలో ఆది నుంచి లోక్‌సభకు పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థి బద్దం బాల్‌ రెడ్డి హయాంలో ఎంఐఎంకు గట్టిగా పోటీ ఇవ్వగలిగింది. 1991 ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి సలావుద్దీన్‌ ఓవైసీకి 4,54,823 ఓట్లు రాగా, బాల్‌రెడ్డికి 4,15,299 ఓట్లు వచ్చాయి. ఓవైసీ కేవలం 39,524 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పటివరకు ఎంఐఎంకు వచ్చిన అతి తక్కువ మెజారిటీ ఇదే. అలాగే 1998 ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి బాల్‌రెడ్డి 4,14,173 ఓట్లు, 1999 ఎన్నికల్లో 3,87,344 ఓట్లు సాధించి రెండో స్థానంలో నిలిచారు. నాటినుంచి బీజేపీ ఈ స్థానంలో తన పట్టును నిలుపుకుంటూ వచ్చినా 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్‌, 2014నుంచి నేటివరకు బీఆర్‌ఎస్‌ సాయంతో ఎంఐఎం గెలుస్తూ వస్తోంది. ఈసారి బీజేపీ అధిష్ఠానం మాధవీలతకు టిక్కెట్ ఇవ్వడంతో పోటీ ఎలా ఉంటుందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Share This Article
Leave a comment