ఈ పెద్దాయన రూ.6200 కోట్లు దానం చేశారు

Telugu BOX Office

వ్యాపారం చేసి వేల కోట్లు ఆర్జించిన వాళ్లు వీలైతే ఆ సంపదను ఇంకా పెంచుతారు. లేకపోతే యావదాస్తినీ వారసులకు పంచుతారు. తామూ విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తుంటారు. శ్రీరామ్‌ గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకరైన త్యాగరాజన్‌ మాత్రం తాను సంపాదించిన దాదాపు రూ.6200 కోట్ల సంపదను వారసులకు కాకుండా ఉద్యోగులకు పంచేశారు. ఆడంబరాలకు దూరంగా ఓ చిన్న గదిలో జీవిస్తున్న ఆ పెద్ద మనిషి వ్యాపారవేత్తనని చెప్పుకోవడానికి కూడా ఇష్టపడరు. నూటికో కోటికో ఒక్కరుగా ఉండే ఇలాంటి వ్యక్తుల జీవితం ఎందరికో స్ఫూర్తిపాఠం.

దాదాపు ఆరున్నర వేల కోట్ల రూపాయల సంపదను వెనకేసుకున్న వ్యాపారవేత్త జీవితంలో ఎన్నెన్ని విలాసాలు ఉంటాయి. ఇంద్రభవనం లాంటి ఇల్లు ఏదంటే అది తెచ్చి పెట్టే నౌకర్లు- కాలు కింద పెట్టకుండా గుమ్మం ముందు రకరకాల కార్లు- ఇంకా ధరించే దుస్తులూ, వాడే వస్తువులూ… ఇలా అన్నీ ఖరీదైనవే ఉంటాయి కదా వాళ్ల దగ్గర. మరి అంతటి ఆస్తిపాస్తులను సొంతం చేసుకున్న శ్రీరామ్‌ గ్రూపు వ్యవస్థాపకుల్లో ఒకరైన రామమూర్తి త్యాగరాజన్‌ ఇంటికి వెళితే ఆ హడావుడి ఏమీ ఉండదు. ఓ సాదాసీదా గదిలో మంచం, కుర్చీ, రేడియో, న్యూస్‌ పేపర్లు మాత్రం కనిపిస్తాయి. దేనికీ ఖర్చుపెట్టకపోతే మరి కష్టపడి కూడగట్టిన డబ్బునంతా ఏం చేసుకుంటారు, ఆయన అంత సాధారణంగా జీవించడానికి కారణం ఏంటనే సందేహం రావచ్చు. ఎనభై ఆరేళ్ల త్యాగరాజన్‌ తన యావదాస్తినీ ఉద్యోగులకు రాసిచ్చేశారు. సెల్‌ఫోన్‌ను అంతగా ఇష్టపడని ఆయన ప్రస్తుతం శ్రీరామ్‌ గ్రూపు సలహాదారుగా కొనసాగుతున్నారు. ఆయనకంటూ ఆఫీసులో ప్రత్యేకంగా ఛాంబరు ఏర్పాటు చేసుకోవడానికి కూడా ఇష్టపడలేదు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఫైళ్లు ముందేసుకుని కూర్చుంటారు.

గాంధేయవాది అయిన త్యాగరాజన్‌ తమిళనాడులోని వ్యవసాయ కుటుంబంలో పుట్టి పెరిగారు. పేదరికం వల్ల ఆయన కుటుంబం ఎన్నో ఇబ్బందులు పడింది. పస్తులతో గడిపిన రోజులూ, నిద్రలేని రాత్రులూ త్యాగరాజన్‌కు ఇంకా గుర్తే. పట్టుదలతో బాగా చదువుకున్న ఆయన మద్రాస్‌లో డిగ్రీ చేశారు. తండ్రికి ఇష్టంలేకపోయినా కోల్‌కతాలోని ఇండియన్‌ స్టాటిస్టికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లో నెలకు 125 రూపాయల స్టైఫండ్‌ ఇస్తారని అక్కడికి వెళ్లి పీజీలో చేరారు. 1961లో చదువయ్యాక ఒక బీమా సంస్థలో మేనేజ్‌మెంట్‌ ట్రైనీగా చేరిన త్యాగరాజన్‌ ఇరవై ఏళ్లపాటు అక్కడే పనిచేశారు. ఆ సమయంలో బ్యాంకుల నుంచి లోన్లు పొందలేక ఇబ్బంది పడే పేదవారి బాధను ప్రత్యక్షంగా చూసిన ఆయన కమర్షియల్‌ ఫైనాన్స్‌ వ్యాపారం ప్రారంభించాలనుకున్నారు. అలా-37 ఏళ్ల వయసులో స్నేహితులూ, బంధువులతో కలిసి శ్రీరామ్‌ సంస్థను ఏర్పాటు చేసి పేదలకు రుణాలు ఇవ్వడం మొదలుపెట్టారు. అంచెలంచెలుగా వ్యాపారాన్ని వివిధ రంగాల్లో విస్తరించారు. ఆ క్రమంలో ఆరువేల కోట్లకు పైగా వ్యక్తిగత ఆస్తిని ఆర్జించారు. అంతటితో సంతృప్తి పడిఉంటే- త్యాగరాజన్‌ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండేది కాదు. దేశంలోని ఎంతోమంది వ్యాపారవేత్తల్లో ఆయనా ఒకరు అయ్యి ఉండేవారంతే.

‘ఎవరూ సొంతంగా సంపదను సృష్టించలేరు. ఇతరుల భాగస్వామ్యం తప్పనిసరి. ఉద్యోగుల సహకారంతో సృష్టించిన సంపదను వారితోనే పంచుకోవడం న్యాయం’ అన్నది త్యాగరాజన్‌ అభిప్రాయం. అందుకే 2006లో ఉద్యోగులే పార్టనర్స్‌- ఓనర్స్‌గా ఉండేలా ఒక ట్రస్ట్‌ను స్థాపించారు. సంస్థ నుంచి ఆ ట్రస్టుకు కొంత డబ్బును అందిస్తూ… పదవీ విరమణ సమయంలో వారికి అదనంగా డబ్బును అందజేస్తుంటారు. అంతేకాకుండా, త్యాగరాజన్‌ తన వ్యాపారం ద్వారా సంపాదించిన డబ్బులో- తన ఆరోగ్య అవసరాలకోసం ఓ నలభై లక్షల రూపాయల్ని ఉంచుకుని మిగతా రూ.6200 కోట్ల రూపాయల్ని ఆ ట్రస్టుకే బదిలీ చేశారు.

Ramamurthy Thyagarajan, Founder, Shriram Group

ఉద్యోగుల బాగోగుల గురించి ఆలోచించిన ఆ పెద్దమనిషి హోదా అనేది సొంతంగా తెచ్చుకోవాలిగానీ వారసత్వంగా రాకూడదు అని నమ్ముతారు. అందుకే తన పిల్లలకు శ్రీరామ్‌ గ్రూపు యాజమాన్య బాధ్యతలను ఇవ్వలేదు. ఆయన పెద్ద కొడుకు ఇంజినీరుగా పనిచేస్తుంటే, చిన్న కొడుకు సీఏగా ఆ సంస్థలోనే సాధారణ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం ఓ చిన్నగదిలో నివసిస్తున్న త్యాగరాజన్‌కు దుబారా అంటే నచ్చదు. అవసరాలకోసం ఐదు లక్షలరూపాయల మామూలు కారునే వాడుతుంటారు. ఫోనును టైమ్‌ వేస్ట్‌గా భావించే ఆయన సమయం దొరికితే విదేశీ ఫైనాన్స్‌ పత్రికలు చదువుతారు, శాస్త్రీయ సంగీతం వింటారు. డబ్బుకు ధర్మకర్తగా ఉండాలన్న గాంధీజీ సిద్ధాంతాలను తు.చ.తప్పకుండా పాటించిన ఆయనకు భారత ప్రభుత్వం ‘పద్మభూషణ్‌’ పురస్కారాన్ని ప్రదానం చేసింది.

Share This Article
Leave a comment