ఈ అమ్మవారికి రాహుకాలంలో పూజలు చేస్తారు

Telugu BOX Office

రాహుకాలాన్ని దాదాపు అందరూ అశుభంగా భావిస్తే… ఈ ఆలయంలో మాత్రం ఆ సమయంలోనే విశేషమైన పూజలు జరుగుతాయి. ఆ పూజల్లో పాల్గొనేందుకు భక్తులూ వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవికి ఎన్నో అవతారాలు ఉంటే వాటిల్లో ఒకటి బనశంకరీదేవి. వనశంకరిగానూ, శాకంబరిగానూ పిలిచే ఈ అమ్మవారు బెంగళూరులోని కనకపుర రోడ్డులో కొలువుదీరి… భక్తుల పూజల్ని అందుకుంటోంది. ఈ అమ్మవారిని రాహుకాలంలో పూజిస్తే సమస్యలు తొలగిపోయి సకలశుభాలూ కలుగుతాయని భక్తుల నమ్మకం. అందుకే… రాహుకాలంలో నిర్వహించే పూజల్లో పాల్గొనేందుకు భక్తులు వేల సంఖ్యలో వస్తారు. దేశవిదేశాల నుంచి ఎంతోమంది భక్తులు దర్శించుకునే ఈ ఆలయం నిర్మాణం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.

స్థల పురాణం
మన దేశంలో బిజాపూర్‌లోని బాదామిలో బనశంకరి దేవి ఆలయం కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉంది. బెంగళూరుకు చెందిన సోమన్న శెట్టి అనే అమ్మవారి భక్తుడు అప్పుడప్పుడూ ఆ ఆలయానికి వెళ్లొచ్చేవాడట. అలా ఆ భక్తుడు 1915లో అక్కడినుంచి దేవి విగ్రహాన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ప్రతిష్ఠించి ఆలయాన్ని నిర్మించాడనీ… క్రమంగా దాన్ని అభివృద్ధి చేశారనీ కథనం.

విశాలమైన ప్రాంగణంలో కనిపించే బనశంకరి ఆలయంలో అమ్మవారు సింహవాహినిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఇక్కడ అమ్మవారికి ఇతర ఆలయాల మాదిరిగానే ప్రతిరోజూ అభిషేకాలూ, ఇతర పూజలూ చేయడం మామూలే. అయితే… వాటన్నింటికన్నా ఇక్కడ రాహుకాలంలో చేసే పూజల్లో పాల్గొనేందుకే భక్తులు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రతిరోజూ మారే రాహుకాలానికి అనుగుణంగా పూజల్ని చేస్తారిక్కడ. ఆ సమయంలో బనశంకరిని దర్శించుకుని పూజిస్తే కష్టాలు తొలగిపోతాయనీ, కోరిన కోర్కెలు నెరవేరతాయనీ భక్తుల నమ్మకం. అందుకే రాహుకాలంలో భక్తులు ఆలయానికి వచ్చి నిమ్మకాయల డొప్పలతో చేసిన దీపాలను ఐదు, ఏడు, తొమ్మిది చొప్పున వెలిగిస్తారు. ఆ దీపాలను వెలిగించి, దేవిని పూజిస్తే ఎంతో మంచిదని అంటారు.

అలాగే మంగళవారం, శుక్రవారం, ఆదివారాల్లోనూ దేవిని దర్శించుకునేందుకూ ప్రాధాన్యం ఇస్తారు. అదేవిధంగా… ఇక్కడి అమ్మవారిని శాకంబరిదేవిగానూ కొలుస్తారు గనుక… ఆలయ నిర్వాహకులు చెప్పిన కూరగాయల్ని భక్తులు తీసుకొస్తే… వాటితో అమ్మవారిని శాకంబరిగా అలంకరిస్తారు. ఈ పూజలతో పాటూ ఏడాదికోసారి అమ్మవారి జన్మదినాన్ని పురస్కరించుకుని విశేష కార్యక్రమాలను జరిపిస్తారు. అదేవిధంగా పుష్యమాసంలో జాతరను ప్రారంభించి పౌర్ణమితో ముగిస్తారు. ఆ సమయంలో అంగరంగవైభవంగా నిర్వహించే రథోత్సవాన్ని తిలకించేందుకు రెండు కళ్లూ సరిపోవు.

ఈ జాతరలో పాల్గొనేందుకు బెంగళూరు, కర్ణాటక, మహారాష్ట్రతోపాటు ఇతర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో భక్తులు ఆలయానికి వస్తారు. ఇక, దసరా, ధనుర్మాసం సమయంలోనూ అమ్మవారికి ప్రత్యేక పూజలూ జరిపిస్తారిక్కడ. ఇతర దేవతామూర్తులూ కొలువుదీరిన ఈ దేవస్థానానికి చేరుకునే భక్తులకు అన్నప్రసాదాన్నీ అందిస్తారు ఆలయ నిర్వాహకులు.

Share This Article
Leave a comment