దసరా పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. ఇది ముఖ్యంగా నవరాత్రులు (శరన్నవరాత్రులు) ముగింపును సూచిస్తుంది, ఈ సమయంలో దుర్గామాత మహిషాసురుడిని వధించి విజయదశమి రోజు విజయం సాధించిందని నమ్ముతారు. అలాగే, రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయాన్ని కూడా దసరా సూచిస్తుంది. ఈ పండుగ ద్వారా భక్తులు దేవి యొక్క శక్తిని మరియు మంచి యొక్క అంతిమ విజయాన్ని స్మరించుకుంటారు. దసరా పండుగ సమయంలో తొమ్మిది రోజుల పాటు దుర్గాదేవి యొక్క తొమ్మిది అవతారాలైన నవదుర్గలను పూజిస్తారు. ఈ అవతారాలు శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి మరియు సిద్ధిదాత్రి. ప్రతి రోజు అమ్మవారి ఒక అవతారంలో దర్శనమిస్తుంది. అజ్ఞానానికి సంకేతం కూడా రాక్షసత్వమే. ప్రజల్లో అలాంటి అజ్ఞానాన్ని పోగొట్టి విజ్ఞానాన్ని నింపాలనే సద్భావనతో ప్రపంచానికి మేలు చేసేందుకు అమ్మవారు వివిధ అవతరాల్ని ధరించారు. దసరా వేడుకల్లో చిట్టచివరి రోజైన విజయదశమి వేళ శ్రీరాజరాజేశ్వరిగా అపరాధితగా అత్యంత భక్తి శ్రద్ధలతో పూజిస్తాం.అన్నీ తానై, అంతా తానై ఉన్న శక్తి స్వరూపిణి విశ్వరూప స్వరూపమే శ్రీమహారాజ్ఞి రాజరాజేశ్వరి.

విజయ దశమి రోజంతా మంచిదే అయినప్పటికీ.. ఇందులో విజయ ముహూర్తం ఎంతో ప్రత్యేకమైనదని జ్యోతిష పండితులు పేర్కొంటున్నారు. విజయ దశమి రోజున రవికి ఎనిమిది, ఏడు స్థానాల్లో సూర్యోదయ లగ్నానికి ఐదు, ఆరు లగ్నాల్లో ఉన్నటువంటి సమయాన్ని విజయ ముహూర్తం అంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం ముహూర్తం అంటే 48 నిమిషాలు. వర్జ్య దుర్ముహూర్తాల్లేకుండా రవి బలంగా ఉన్నటువంటి సమయం విజయదశమి రోజు వస్తే దాన్ని విజయ ముహూర్తంగా పేర్కొంటారు. ఈ సమయంలో ఆరంభించే కార్యక్రమాలేవైనా తప్పకుండా విజయం వరిస్తుందని విశ్వాసం. 2025 అక్టోబర్ 2న విజయ ముహూర్తం మధ్యాహ్నం 2.10గంటల నుంచి 2.58గంటల వరకు ఉంది. ఈ 48 నిమిషాల కాలం ఎంతో బలమైనది. ఎంతో శక్తిమంతమైన ఈ ముహూర్తంలో ఏ కొత్త ఆలోచన చేసినా, ఏ కార్యక్రమాలు, వ్యాపారాలు ప్రారంభించినా విజయం సిద్ధిస్తుందని ప్రగాఢ విశ్వాసం.
రావణ సంహారం
త్రేతాయుగంలో శ్రీరాముడు లోక కంటకుడైన రావణాసురుని సంహరించింది కూడా విజయదశమి రోజే అని అంటారు. అందుకే ఈ రోజు ఉత్తరభారతంలో అనేక ప్రాంతాల్లో రావణ దహనం జరుగుతుంది.

కురుక్షేత్రంలో పాండవుల విజయం
ద్వాపర యుగంలో జరిగిన మహాభారతానికి వస్తే ధర్మరాజు శకునితో మాయా జూదంలో పరాజయం పాలైన తర్వాత పాండవులు పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయాల్సివచ్చింది. అప్పుడు పాండవులు అరణ్యవాసం ముగించుకొని అజ్ఞాతవాసం కోసం విరాటరాజు కొలువులోకి ప్రవేశించేముందు శమీ చెట్టుపై తమ ఆయుధాలను దాచి ఉంచారు. తిరిగి సంవత్సరం తరువాత పాండవులు తమ ఆయుధాలను జమ్మి చెట్టుపై నుంచి తిరిగి తీసుకున్నదే ఈ విజయదశమి రోజునే! విజయదశమి రోజున ఆ ఆయుధాలను పూజించి కురుక్షేత్ర సంగ్రామంలో కౌరవులపై విజయం సాధించారు. ఇలా విజయదశమి పండుగ వెనుక ఎన్నో విజయగాథలు దాగి ఉన్నాయి. అందుకే విజయదశమి రోజు ఏ పని తలపెట్టినా విజయం తథ్యం అని అంటారు.
అపరాజితాదేవి అవతరించిన దశమి
అపరాజితా దేవి అవతరించిన రోజు విజయదశమి. అపరాజితా దేవి అంటే పరాజయమన్నది ఎరుగని దేవత. త్రిశక్తి స్వరూపమైన ఈ దేవిని పూజిస్తే పరాజయమన్నదే ఉండదు. అమ్మవారు మధు, కైటభులనే రాక్షసులను సంహరించి ప్రజలకు సుఖఃశాంతులను అందించినది కూడా ఈ రోజే!
శమీ వృక్ష పూజ
విజయదశమి పండుగ రోజు జమ్మి చెట్టుకు పూజ చేయడం ఒక విశిష్టమైన ఆచారం. ఈ సంప్రదాయం తెలుగు రాష్ట్రాల్లో బాగా కనిపిస్తుంది. విజయదశమి రోజున జమ్మి చెట్టును పూజించి జమ్మి ఆకులను బంగారంలా భావించి ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఇలా జమ్మి చెట్టును పూజించడం వల్ల అన్నీ రంగాల్లో విజయం, శ్రేయస్సు లభిస్తుందని నమ్ముతారు. అలాగే తెలంగాణ సంప్రదాయం ప్రకారం విజయదశమి రోజు పాలపిట్టను చూడడం కూడా శుభప్రదమని భావిస్తారు.
విజయానికి సంకేతంగా భావించే విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుంది. దుర్గాదేవి మహిసాసురుడనే రాక్షసుడిని సంహరించడం, శ్రీరాముడు రావణాసురుని అంతమొందించడం వంటి కథలే ఇందుకు ఉదాహరణ. అలాగే విజయదశమి సామరస్యం, ఐక్యతకు చిహ్నంగా భావిస్తారు. ఎందుకంటే, విజయదశమి దేశంలోని వివిధ ప్రాంతాల్లో వివిధ రూపాల్లో అందరూ కలిసిమెలిసి జరుపుకునే పండుగ. ఇది మనుషుల మధ్య సామరస్యాన్ని, ఐక్యతను పెంపొదిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే విజయదశమి రోజున ఏ పని ప్రారంభించినా ఖచ్చితంగా విజయం లభిస్తుందని బలంగా నమ్ముతారు. అందుకే విజయదశమి రోజున కొత్త వ్యాపారాలు, శుభకార్యాలు ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు.
teluguboxoffice.com తరపున వీక్షకులందరికీ విజయదశమి శుభాకాంక్షలు
