బాక్సాఫీస్ వద్ద ‘కొరియన్ కనకరాజు’ రచ్చ.. 3 రోజుల్లో 37.4 కోట్ల గ్రాస్ కలెక్షన్స్

Telugu BOX Office

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిం‌చిన తాజా హారర్ కామెడీ చిత్రం ‘కొరియన్ కనకరాజు’ థియేటర్లలో రికార్డు స్థాయి వసూళ్లతో దూసుకుపోతోంది. విలక్షణ దర్శకుడు మేర్లపాక గాంధీ మార్క్ నవ్వులు, వైవిధ్యమైన కొరియన్ ఆత్మ కథాంశంతో రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటుతోంది. మూడు రోజులు ముగిసేసరికి ప్రపంచవ్యాప్తంగా ఏకంగా రూ. 37.4 కోట్ల గ్రాస్ కలెక్షన్లను సాధించినట్లు నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 7న విడుదలైన ఈ సినిమా మొదటి రోజే ప్రీమియర్లతో కలిపి దాదాపు రూ. 10.2 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి ఘనమైన బోణి కొట్టింది. శనివారం నాటికి ఈ జోరు మరింత పుంజుకుని రెండు రోజుల్లోనే రూ. 23.6 కోట్ల మైలురాయిని దాటింది.

ఇక ఆదివారం (మూడో రోజు) ఆక్యుపెన్సీ మరింత పెరగడంతో కలెక్షన్స్ లో పెద్ద జంప్ కనిపించింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలతో పాటు కర్ణాటక వ్యాప్తంగా అనేక థియేటర్లలో హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజే మొదటి రెండు రోజుల కంటే ఎక్కువ వసూళ్లు నమోదు కావడం ఈ చిత్రానికి లభిస్తున్న ప్రజాదరణకు నిదర్శనం. సాధారణంగా థియేట్రికల్ బిజినెస్ రికవరీ కావడానికి వారం రోజులకు పైగా సమయం పడుతుంది, కానీ ‘కొరియన్ కనకరాజు’ సండే పూర్తయ్యేసరికే ప్రాఫిట్ జోన్‌లోకి అడుగుపెట్టడంతో డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు అత్యంత ఆనందంలో ఉన్నారు. ఓవర్సీస్‌లోనూ ఈ చిత్రం విశేష ఆదరణ పొందుతూ 4లక్షల డాలర్ల గ్రాస్ మార్కును దాటేసి హాఫ్ మిలియన్ దిశగా దూసుకెళ్తోంది.

అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో చెక్కభజన బృందాన్ని నడిపే కనకరాజు (వరుణ్ తేజ్) శరీరంలోకి ఒక కొరియన్ వ్యక్తి ఆత్మ ప్రవేశించడం, ఆ తర్వాత జరిగే హాస్యభరిత పరిణామాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. కెపాసిటీకి తగ్గట్టుగా నటుడు సత్య అందించిన కామెడీ టైమింగ్, రితికా నాయక్ గ్లామర్, థమన్ అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ప్లస్ పాయింట్స్‌గా నిలిచాయి. కొన్నాళ్లుగా సరైన విజయం కోసం ఎదురుచూస్తున్న వరుణ్ తేజ్‌కు ఈ హారర్ కామెడీ చిత్రం బిగ్ రిలీఫ్‌ను అందించడమే కాకుండా ఆయన కెరీర్‌లో బిగ్గెస్ట్ సక్సెస్‌గా నిలిచింది. కొడుకు విజయాన్ని చూసి ఆయన తండ్రి నాగబాబు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ చేశారు. వీకెండ్ కలెక్షన్ల జోరు చూస్తుంటే వర్కింగ్ డేస్‌లోనూ ఈ చిత్రం స్థిరంగా రాణించి రూ. 50 కోట్ల క్లబ్‌లోకి సులువుగా చేరడం ఖాయంగా కనిపిస్తోంది.

Share This Article
Leave a Comment