వాడ్రాపల్లి శివాలయం.. ఏటా పెరిగే స్వయంభు శివలింగం

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో అరుదైన శివాలయాలు ఉన్నాయి. జ్యోతిర్లింగం, పంచారామాలతో పాటు మహాశివునికి సంబంధించిన మరెన్నో చారిత్రక దేవాలయాలను ఇక్కడ చూడవచ్చు. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇలాంటి దేవాలయాల గురించి తెలుసుకోవడం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. మహాశివుని మహిమలకు ఇవి తార్కాణాలుగా నిలుస్తుంటాయి. అలాంటి దేవాలయాల్లో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయం ఒకటి. విశాఖ జిల్లా మునగపాక మండలం వాడ్రాపల్లి గ్రామంలో ఉన్న ఈ దేవాలయంలో శివలింగం తెల్లని స్పటిక రూపంలో ఉంటుంది. అంతేకాదు స్వయంభువుగా వెలసిన ఈ లింగం ప్రతి ఏటా పెరుగుతుండడం విశేషం.

వాడ్రాపల్లిలో దక్షిణ కాశీ విశ్వేశ్వర ఆలయంగా వెలుగొందుతున్న ఈ దేవాలయం వెనుక ఓ ఆసక్తికరమైన కధ ఉంది. దాదాపు 250 సంవత్సరాల క్రితం ఈ గ్రామానికి శివారులో ఉన్న పంట పొలాల్లో రైతులు కాలువ గట్లు వేసేందుకు అక్కడ ఉన్న పుట్టలను తవ్వడం ప్రారంభించారు. ఈ క్రమంలో ఓ పుట్టను తవ్వుతుండగా తెల్లని రూపంలో ఈ శివలింగం బయటపడింది. దీంతో గ్రామస్తులు ఆ శివలింగాన్ని ఆ పంట పొలాల నుంచి తరలించి గ్రామంలో ప్రతిష్టించాలని భావించారు. దీని కోసం శివ లింగాన్ని బయటకు తీసేందుకు భూమిలో దాదాపు 25 అడుగుల మేర తవ్వారు. ఎంత తవ్వినా అంతస్తుల అడుగుల కొద్దీ శివలింగం కనిపిస్తుంది కానీ లింగం చివరి భాగం మాత్రం బయటపడలేదు. పైగా భూమిలో నుంచి సర్పాలు కూడా రావడంతో భయపడిన గ్రామస్తులు శివలింగాన్ని అక్కడి నుంచి కదపాలనే ఆలోచనను విరమించుకుని ఆ ప్రదేశంలోనే దేవాలయాన్ని నిర్మించారు.

​దక్షిణ ముఖాన ఉన్న అరుదైన దేవాలయం
సాధారణంగా అన్ని శివాలయాలు తూర్పు ముఖంగా ఉంటుంటాయి. కొన్ని చోట్ల పశ్చిమ ముఖంగా ఉన్న ఆలయాలు కూడా చూసి ఉంటారు. కానీ ఈ ఆలయంలో శివ లింగం మాత్రం దక్షిణ ముఖంగా దర్శనమివ్వడం విశేషం. ఆలయ ధర్మకర్త సూరిశెట్టి పరమేశ్వర రావు తన పూర్వీకుల నుంచి ఈ ఆలయ నిర్వాహణ బాధ్యతలు స్వీకరించి అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఇక్కడ గ్రామస్తులు శివలింగాన్ని స్వయంగా తాకి అభిషేకాలు నిర్వహిస్తుంటారు. ఈ అవకాశాన్ని వారు తమ అదృష్టంగా భావిస్తుంటారు. ఆలయానికి ఉన్న విశిష్టత దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ దీనిని తమ అధీనంలోకి తీసుకుంది.

ప్రధమ పూజలందుకునే వినాయకుడు, మహాశివుని సతీమణి పార్వతీదేవిల విగ్రహాలు ఈ ఆలయంలో లేకపోవడంతో ఇప్పటి వరకూ కేవలం శివలింగ ఆరాధన మాత్రమే జరుగుతుంది. అయితే 2020 సంవత్సంలో ఆలయ ధర్మకర్త సూరిశెట్టి పరమేశ్వరరావు దాతల సహాయ సహకారాలతో దేవాలయంలో వినాయక, దాక్షాయణి దేవిల విగ్రహాలను ప్రతిష్టించారు. దీంతో ఆలయానికి పరిపూర్ణత్వం చేకూరినట్లు భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మహాశివరాత్రి పర్వదినాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.

​నీటి మధ్యలో శివలింగం
వాడ్రాపల్లి ఆవలో బోటు షికారుకు వెళ్లే వారు గొప్ప ఆధ్యాత్మిక అనుభవానికి గురవుతారు. ఈ నీటి అడుగున ఒక శివ లింగం ఉంటుంది. పడవలో వెళ్లేటప్పుడు ఇక్కడికి కూడా సందర్శకులను తీసుకువెళ్తుంటారు. నీటిపై నుంచి శివలింగాన్ని ముట్టుకుని దర్శించుకోవడం చాలా అద్భుతంగా ఉంటుంది. వేసవి కాలంలో ఇక్కడ నీటి మట్టం కాస్త తగ్గడంతో శివలింగం పూర్తిగా బయటపడుతుంది. అప్పుడు భక్తులు నడుచుకుంటూ వెళ్లి ఈ లింగాన్ని దర్శించుకోవచ్చు.

​ఎలా చేరుకోవాలి?
విశాఖపట్నం నగరం నుంచి ఈ ఆలయానికి సులభంగా చేరుకోవచ్చు. టూరిస్టులు ముందుగా విశాఖపట్నం నుంచి బస్సు లేదా రైలు మార్గంలో 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనకాపల్లి పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. నగరం నుంచి పట్టణానికి తరచుగా రైళ్లు, బస్సులు నడుస్తుంటాయి. అనకాపల్లి నుంచి వాడ్రాపల్లికి 10 కిలోమీటర్ల దూరం. టూరిస్టులు ఆటో లేదా ట్యాక్సీ ను మాట్లాడుకుని దక్షిణేశ్వర ఆలయానికి నేరుగా చేరుకోవచ్చు. పచ్చని పొలాలు, స్వచ్చమైన ప్రకృతి వాతావరణం మధ్య సాగే ఈ ప్రయాణం మీకు ఎప్పటికీ మరపురాని అనుభవాన్ని మిగులుస్తుంది.

Share This Article
Leave a comment