మహా కుంభమేళాలో అందరి చూపు ఈమె వైపే.. ఇంతకీ ఎవరీ సాధ్వీ?

Telugu BOX Office

 

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో జరుగుతోన్న మహా కుంభమేళాకి సాధువులు, భక్తులు, యాత్రికులు, విదేశీయులూ పోటెత్తుతున్నారు. 144 ఏళ్లకు ఓసారి జరిగే ప్రత్యేక కుంభమేళా కావడంతో భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి పుణ్యస్నానాలు చేసి తరిస్తున్నారు. 45 రోజుల పాటు జరిగే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో సుమారు 40 కోట్ల మంది పాల్గొంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

జనవరి 13వ తేదీన మొదలైన ఈ కుంభమేళాలో తొలిరోజే ఏకంగా కోటి 75 లక్షల మంది స్నానాలు చేశారు. రెండో రోజైన మకర సంక్రాంతి నాడు ఏకంగా మూడున్నర కోట్ల మంది స్నానాలు చేసి రికార్డు నెలకొల్పారు. కనుమ నాడు కూడా సుమారు 3 కోట్ల మంది స్నానాలు చేసినట్లు యూపీ ప్రభుత్వం అంచనా వేసింది. ఇలా తొలి మూడురోజుల్లోనే 8 కోట్ల మందికి పైగా కుంభమేళాలో పాల్గొనడం విశేషం. ఈ కుంభమేళాలో పుణ్యస్నానాలు చేసేందుకు విదేశీయులు సైతం భారీగా తరలివస్తున్నారు. మానసిక ప్రశాంతత కోసం తాము ఆధ్యాత్మికం వైపు మళ్లామని.. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తమను ముగ్గుల్ని చేస్తున్నాయని విదేశీయులు కొనియాడుతున్నారు.

అసలు విషయానికొస్తే.. కోట్లాది మంది పాల్గొంటున్న ఈ మహా కుంభమేళాలో ఓ మహిళ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నారు. ఆమే ఉత్తరాఖండ్‌కు చెందిన హర్షా రిచారియా. సంప్రదాయ వస్త్రధారణ, నుదుటిన తిలకం, రుద్రాక్షమాలతో ఉన్న ఆమెను కుంభమేళాకు వచ్చిన వారంతా ప్రత్యేకంగా చూస్తున్నారు. జాతీయ మీడియా ఆమెను ఇంటర్వ్యూలు చేసేందుకు పోటీ పడుతుండటంతో గత మూడు రోజులు రిచారియా పాపులర్ అయిపోయింది. ఆమె ఫొటోలు, వీడియోలు, ఇంటర్వ్యూలు తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆమె వేషధారణ చూసి కుంభమేళాకు వచ్చినవారంతా ఆమెను మహిళా సాధ్విగా భావిస్తున్నారు. అయితే తాను సాధ్విని కాదని, కేవలం మంత్రాలు మాత్రమే జపిస్తున్నానని రిచారియా స్పష్టం చేశారు. తాను ఉత్తరాఖండ్‌లోని నిరంజనీ అఖాడాకు చెందిన ఆచార్య మహామండలేశ్వర్‌ స్వామి కైలాసానంద్‌ గిరి జీ మహారాజ్‌ శిష్యురాలినని చెబుతున్నారు.

యాంకరింగ్, యాక్టింగ్, మోడలింగ్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న 30 ఏళ్ల రిచారియా సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండేవారు. ఫారిన్ టూర్లకు వెళ్తూ అక్కడ తీసుకున్న ఫోటోలను షేర్ చేసేవారు. అయితే మోడ్రన్ జీవితంపై విరక్తి చెందిన ఆమె రెండేళ్ల క్రితం ఆధ్యాత్మిక మార్గంలోకి ప్రవేశించినట్లు చెబుతున్నారు. పవిత్రమైన త్రివేణీ సంగమం వద్ద మంగళవారం తొలి అమృత్ స్నానం ఆచరించానని, ఆ క్షణాలను జీవితాంతం మరిచిపోలేనని చెప్పుకొచ్చారు. మహాదేవ్ మరియు పరమపూజ్య గురుదేవ్ ఆశీర్వాదంతో 144 సంవత్సరాలకొకసారి వచ్చే ఈ సంపూర్ణ మహాకుంభమేళాలో భాగమైనందుకు తాను అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

Share This Article
Leave a Comment