ప్రజల మధ్య నుంచి పుట్టిన నాయకుడు… న్యాయం కోసమే జీవించే న్యాయవాది – రాపోలు భాస్కర్

Telugu BOX Office

రాపోలు భాస్కర్ జీవితం ఒక సాధారణ వ్యక్తి అసాధారణంగా ఎదిగిన కథ. గ్రామీణ వాతావరణంలో, సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన ఆయన చిన్నతనంలోనే జీవితం అంటే ఏమిటో తెలుసుకున్నారు. చదువుకునే రోజుల్లోనే ఎన్నో కష్టాలు ఆయన్ని వెంటాడాయి. ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ బాధ్యతలు, గ్రామీణ ప్రాంతాల్లో అవకాశాల లేమి ఈ అన్నింటినీ ఎదుర్కొంటూనే చదువును ఆయుధంగా చేసుకుని ముందుకు సాగారు. చదువు ఒక్కటే తనను, తనలాంటి ఎంతోమందిని పైకి తీసుకెళ్తుందన్న నమ్మకమే ఆయన్ని రాజకీయాలు, న్యాయవాద వృత్తి వైపు నడిపించింది.

నల్గొండ జిల్లా వేములపల్లి మండలం మొల్కపట్నం గ్రామానికి చెందిన రాపోలు రాములు, రామలక్ష్మమ్మ దంపతులకు చివరి సంతానంగా భాస్కర్ జన్మించారు. ఆయనకు ఇద్దరు అన్నలు, ఇద్దరు అక్కలు ఉన్నారు. భాస్కర్ మూడేళ్ల వయసులోనే తండ్రి రాములు చనిపోవడంతో కుటుంబం చిన్నాభిన్నమైంది. దీంతో తల్లి రామలక్ష్మమ్మ కూలి పనులు చేస్తూ పిల్లల్ని పోషించారు. తల్లి కష్టాన్ని చూసిన భాస్కర్ విద్యతోనే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని నిర్ణయించుకున్నారు. ఐదో తరగతి వరకు స్వగ్రామం మొల్కపట్నంలోనే చదువుకున్న ఆయన ఆ తర్వాత గ్రామంలో ఉన్నత విద్యకు అవకాశం లేకపోవడంతో కుటుంబసభ్యులు అక్కడితో చదువు ఆపేయాలని చెప్పారు. అయితే విద్యపై ఆసక్తితో అందరినీ ఎదిరించిన భాస్కర్ వేములపల్లి మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువు కొనసాగించారు. ఇందుకోసం ఆయన రోజు నిత్యం రానుపోను 16 కిలోమీటర్లు నడుచుకుంటూ స్కూల్‌కి వెళ్లేవారు. దీంతో అనారోగ్య సమస్యలు రావడంతో వేములపల్లిలోని బీసీ హాస్టల్‌లో చేరి చదువు కొనసాగించారు. అక్కడే ఎస్ఎఫ్ఐలో సభ్యుడిగా చేరారు.

ప్రజల సమస్యల్ని తన సమస్యలుగా భావించిన రాపోలు భాస్కర్, చిన్న వయసులోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఉస్మానియా యూనివర్శిటీలో ఎంఏ చేస్తున్న సమయంలో సీపీఎం నాయకుడు రాఘవరెడ్డి ప్రోత్సాహంతో మొల్కపట్నం ఎంపీటీసీగా గెలిచి వేములపల్లి ఎంపీపీగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మండలంలోని 20 గ్రామ పంచాయతీలు, 42 గ్రామాల్లో తిరుగుతూ ప్రజల బాధలు కళ్లారా చూశారు. రోడ్లు లేని గ్రామాలకు రహదారులు, చీకటిలో ఉన్న ఇళ్లకు కరెంటు, స్కూళ్లలో మౌలిక వసతులు, విద్య, వైద్యం, ఆరోగ్యం, విద్యుత్, రహదారులు, పేదలకు ఇళ్ల నిర్మాణం ఇవన్నీ ఆయన అజెండాగా మారాయి. రాజకీయ నాయకత్వం అంటే పదవుల కోసం కాదు… ప్రజల కోసం ఉండాలని ఆయన ఆచరణలో చూపించారు.

1995 నుంచి 2000 వరకు ఎంపీపీగా పనిచేస్తూనే ఆయన చదువును వదల్లేదు. ప్రజాసేవ చేస్తూనే ఎంఏతో పాటు లా పూర్తి చేయడం ఆయన క్రమశిక్షణకు నిదర్శనం. పదవి బాధ్యతలు, ప్రజా సమస్యలు, చదువు మూడు ఒకేసారి నడపడం సాధారణ విషయం కాదు. ఎంపీపీ పదవీకాలం తర్వాత జడ్పీటీసీగా పోటీ చేసి  స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినా ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం ఓడిపోలేదు. ఓటమినీ ఓ పాఠంగా తీసుకుని మరింత బలంగా ప్రజల కోసం నిలబడ్డారు. లా పూర్తి చేసిన తర్వాత, 2005 వరకు అనేక ప్రజా సమస్యలపై న్యాయస్థానాల్లో కేసులు వేస్తూ పరిష్కారం కోసం పోరాడారు. ఆయనలో ఒకవైపు లీడర్, మరోవైపు ప్లీడర్ ఉన్నారు. రాజకీయ నాయకుడిగా ప్రజల మధ్య తిరిగిన అనుభవం, న్యాయవాదిగా చట్టంపై అవగాహన ఈ రెండు కలిసి ఆయన అమాయకులకి ఆశగా మారారు. డబ్బులేని పేదవాడు కోర్టు గడప దాటలేని పరిస్థితుల్లో, భాస్కర్ అతని తరపున నిలబడ్డారు. 2006లో మరోసారి ఎంపీపీగా గెలిచి ప్రజాసేవను కొనసాగించారు.

మిర్యాలగూడ నుంచి తన న్యాయవాద వృత్తిని కూడా కొనసాగిస్తూ స్థానిక సమస్యలపై న్యాయపరంగా నిరంతరం పోరాటం చేశారు.  ఒకవైపు ప్రజాప్రతినిధిగా, మరోవైపు న్యాయవాదిగా రెండు పడవలపై ప్రయాణిస్తూ కూడా సమతుల్యత కోల్పోకుండా ముందుకు సాగారు. ప్రజాప్రతినిధిగా పనిచేసిన కాలంలో ఒక్క రూపాయి జీతం కూడా తీసుకోకుండా, న్యాయవాదిగా వచ్చిన సంపాదనతోనే తన జీవితాన్ని కొనసాగించారు. ఇది ఆయన నిజాయితీకి, సేవాభావానికి నిదర్శనం. న్యాయవాదిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అన్ని కోర్టుల్లో ప్రాక్టీస్ చేసిన ఆయన 2014లో తెలంగాణ హైకోర్టుకు చేరుకున్నారు. అప్పటి నుంచి సివిల్, క్రిమినల్ కేసులు వాదిస్తూ న్యాయం వైపే నిలబడ్డారు. అధికారం ఉన్నవారి కంటే, హక్కులు లేని వారి పక్షాన నిలబడటం ఆయన స్వభావం. అందుకే ఆయన కేవలం లాయర్‌గా కాకుండా “ప్రజా న్యాయవాది”గా ప్రశంసలు అందుకుంటున్నారు.

“ఈ దేశంలో అన్ని కులాలు, అన్ని మతాల వారికి, అన్ని సమస్యలపై పరిష్కారం చూపగలిగే ఏకైక వ్యక్తి న్యాయవాది” అనే నమ్మకంతోనే ఈ వృత్తిని ఎంచుకున్నానని రాపోలు భాస్కర్ చెబుతారు. ఆయన న్యాయవాద వృత్తి కేవలం ఉపాధి కాదు… అది ఒక బాధ్యత, ఒక ధర్మం. ఈ ప్రయాణంలో కుటుంబం ఆయనకు అండగా నిలిచింది. కుమారుడు అభినవ్, కుమార్తె శ్రీనిధి కూడా న్యాయవాద వృత్తిని చేపట్టి తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. తన జీవితంలో ఈ స్థాయికి రావడానికి తల్లి, భార్య రమాదేవి అందించిన మద్దతే తన అసలైన బలం అని భాస్కర్ భావోద్వేగంగా చెబుతారు.

రాపోలు భాస్కర్ కథ ఒక వ్యక్తి‌కి సంబంధించనది మాత్రమే కాదు… ప్రజల కోసం బ్రతికిన ఒక జీవిత కథ.
పదవులు మారినా, స్థాయిలు పెరిగినా, ఆయన దారి మాత్రం ఎప్పుడూ ప్రజల వైపే. 

Share This Article
Leave a Comment