బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేస్తున్నట్లు కల్వకుంట్ల కవిత బుధవారం ప్రకటించారు. పార్టీ అధినేత కేసీఆర్ తనపై సస్పెన్షన్ వేటు వేయడంతో తన నిజాయితీని నిరూపించుకునేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె వివరించారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కవిత మాట్లాడారు. తన ఆత్మాభిమానం కాపాడుకునేందుకు తాను ఈ పదవికి, పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు. తాను చేసిన వ్యాఖ్యల వల్ల ఏదో జరిగిపోయినట్లు దుష్ట చతుష్టయం ప్రచారం చేస్తోందంటూ కవిత మండిపడింది. తన విషయంలో రెండు గ్యాంగులు జరగనిది జరిగినట్లుగా ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ వద్దకు వెళ్లితే.. తనను గన్‌మెన్లు అడ్డుకున్నట్లు రాయించారన్నారు. . బీఆర్ఎస్ పార్టీలో తాను దాదాపు 20 ఏళ్ల పాటు సేవా చేశానని ఈ సందర్భంగా కవిత గుర్తు చేసుకున్నారు. హరీష్ రావు, సంతోష్ రావులే పార్టీ కోసం పని చేశారా? తాను పని చేయాలేదా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతను ఆమె సూటిగా ప్రశ్నించారు. అయితే తనపై పుకార్లు చేసిన వారు.. చేయించిన వారు అంతకుఅంత అనుభవిస్తారంటూ శాపనార్థాలు పెట్టారు.

తాను కర్మ సిద్దాంతాన్ని నమ్ముతానని స్పష్టం చేసిన కవిత తన ప్రాణం పోయినా కేసీఆర్‌కు మాత్రం అన్యాయం జరగనివ్వనని తెలిపారు. తనపై ఇన్ని కుట్రలు, ఇన్ని అవమానాలు అవసరమా? అంటూ బీఆర్ఎస్ అగ్రనేతలను కడిగిపారేశారు. ఎన్నో జన్మల పుణ్యం ఉంటేనే కేసీఆర్‌కు తాను కుమార్తెగా జన్మించానని చెప్పారు. అలాంటి కేసీఆర్‌ను, ఆయన పార్టీని తాను ఎందుకు ఇబ్బంది పెట్టాలనుకుంటానని ఆమె పేర్కొన్నారు. అయితే కేసీఆర్‌పై ఒత్తిడి పెంచి తద్వారా తనను సస్పెండ్ చేయించారంటూ కల్వకుంట్ల కవిత ఆవేదన వ్యక్తం చేశారు.
హరీష్‌రావు టార్గెట్‌గా కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘రేపు కేటీఆర్‌కు ఇదే జరుగుతుంది.. కేసీఆర్‌కు ఇదే జరుగుతుంది. సీఎం రేవంత్, హరీష్‌రావు ఒకే విమానంలో ప్రయాణించారు. రేవంత్ కాళ్లు హరీష్‌రావు పట్టుకున్నాకే ఈ కుట్రలు మొదలయ్యాయి. హరీష్‌రావుకు పాల వ్యాపారం ఉండేది. అధికారంలోకి రాగానే హాస్టళ్లకు పాలు సరఫరా చేశారని ఆరోపణలున్నాయి. రూ.లక్ష కోట్ల కుంభకోణం జరిగిందని రేవంత్ అంటారు.. కానీ హరీష్‌రావు గురించి మాట్లాడరు.. కేసీఆర్‌ను మాత్రమే టార్గెట్ చేస్తారు. కేసీఆర్‌పై సీబీఐ విచారణ వచ్చిందంటే.. అందుకు కారణం హరీష్‌రావు, సంతోష్‌రావే.’ అంటూ కవిత ఆరోపించారు. ‘కేసీఆర్‌తో మొదటి నుంచి హరీష్‌రావు లేరు. టీడీపీ నుంచి బయటకు వచ్చే సమయంలో కూడా.. ఎందుకు ఈ నిర్ణయం అంటూ హరీష్‌రావు ప్రశ్నించారు. ఆయన ట్రబుల్ షూటర్ కాదు.. డబుల్ షూటర్. కేసీఆర్‌కు హరీష్‌రావు కట్టప్ప లాగా అంటారు.. హరీష్‌రావు ఒక దశలో తన పక్కన ఎమ్మెల్యేలను పెట్టుకోవాలని చూశారు’ అని కవిత విమర్శలు గుప్పించారు.
