రోజురోజుకీ విస్తరిస్తోన్న హైదరాబాద్ మహానగరం నుంచి నిత్యం కొన్ని వందల రైళ్లు దేశంలోని ఇతర నగరానికి ప్రయాణిస్తుంటాయి. నగరంలో నాంపల్లి, సికింద్రాబాద్, కాచిగూడల్లో రైల్వేస్టేషన్లు ఉండగా.. ఇటీవలు చర్లపల్లి రైల్వేస్టేషన్ కూడా అందుబాటులోకి వచ్చింది. అయినప్పటికీ ఈ స్టేషన్లలో రద్దీ తగ్గడం లేదు. ఈ నేపథ్యంలోనే దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్ల రద్దీ నేపథ్యంలో హైదరాబాద్ మహానగరం చుట్టూ కొత్తగా మూడు భారీ రైల్వే టెర్మినళ్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రణాళికలు రూపొందించింది. దిల్లీ, బెంగళూరు, కోల్‌కతా వంటి నగరాలకు శివారు ప్రాంతాల్లో రైల్వే టెర్మినళ్లు ఉన్నాయి.

దూర ప్రాంతాల నుంచి వచ్చే రైళ్లను, ఆయా నగరాల మీదుగా ఇతర ప్రాంతాలకు వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లను వాటి శివారు ప్రాంతాలకు పరిమితం చేస్తున్నారు. అదే రీతిలో హైదరాబాద్ చుట్టూ మూడు రైల్వే టెర్మినళ్లను ఔటర్‌కు, రీజనల్ రింగు రోడ్డుకు మధ్యలో నిర్మించేందుకు దక్షిణ మధ్య రైల్వే ప్రణాళికలు సిద్ధం చేసింది. వరంగల్ మార్గంలో చర్లపల్లి టెర్మినల్‌ను నిర్మించి అందుబాటులోకి తీసుకురాగా.. వికారాబాద్-ముంబయి మార్గంలో నాగులపల్లి టెర్మినల్(రామచంద్రాపురం మండలం) డిమాండ్ ఇప్పటికే ఉంది. దీంతోపాటు మహబూబ్‌నగర్-బెంగళూరు(జూకల్-శంషాబాద్), నిజామాబాద్-నాందేడ్(డబిల్‌పుర్-మేడ్చల్) మార్గాల్లోనూ కొత్త టెర్మినళ్లపై రైల్వేశాఖ దృష్టి పెట్టింది. ప్రతిపాదిత ఈ స్టేషన్ల వివరాల్ని గురువారం సీఎం రేవంత్‌రెడ్డితో జరిగిన సమావేశంలో ద.మ.రైల్వే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది.
ప్రస్తుతం సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి అధికంగా ఉంది. హైదరాబాద్ శివారు ప్రాంతాల నుంచి స్టేషన్లకు చేరుకునేందుకు గంట, గంటన్నర సమయం పడుతోంది. ఉదయం ఆయా స్టేషన్లలో ప్లాట్‌ఫారాల సమస్య అధికంగా ఉంది. ఈ నేపథ్యంలో రైల్వేశాఖ మూడు టెర్మినళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. అవి అందుబాటులోకి వస్తే ప్రయాణికుల ఇబ్బందులతోపాటు ప్రధాన స్టేషన్లపై ఒత్తిడి తగ్గుతుంది. జీహెచ్‌ఎంసీ పరిధిలో 2025లో 1.13 కోట్లుగా ఉన్న జనాభా… 2031లో 1.84 కోట్లకు 2047లో 3.30 కోట్లకు పెరుగుతుందని రైల్వేశాఖ అంచనా వేసింది. . ప్రస్తుత అవసరాలతో పాటు రానున్న రెండు దశాబ్దాల్లో పెరిగే హైదరాబాద్ మహానగర జనాభాకు అనుగుణంగా వృద్ధి చెందే రైలు ప్రయాణాల డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకుని మూడు భారీ టెర్మినళ్లకు రైల్వేశాఖ రూపకల్పన చేసింది.
