పెరుగుతున్న ధరలు… కన్నీళ్లు పెట్టిస్తోన్న ఉల్లి

Telugu BOX Office

నెల రోజుల క్రితం వరకూ వినియోగదారులను హడలెత్తించిన టమాటా ధరలు ఇప్పుడు పాతాళానికి పడిపోయాయి. కిలో రూ.200ల వరకూ అమ్ముడైన టమాటా ప్రస్తుతం రూ.వందకు 6 కిలోలు కొనండంటూ బస్తీలను, కాలనీలను చుట్టి వస్తోంది. రైతుబజారులో కిలో రూ.13కు అమ్ముతున్నారు. అదే హోల్‌సేల్ మార్కెట్లలో అయితే కిలో ఒక్క రూపాయి పలుకుతోంది. దీంతో మొన్నటివరకు రైతులను కోటీశ్వరులను చేసిన టమాటా నేడు కన్నీరు పెట్టిస్తోంది. అయితే తాజాగా టమాటా స్థానాన్ని ఉల్లి ఆక్రమిస్తోంది. గత కొన్నిరోజులుగా ఉల్లిపాయలు ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. రాబోయే రోజుల్లో ఆ ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు చెబుతున్నారు.

హైదరాబాద్ విషయానికొస్తే ఆగస్టు 5న రైతుబజారులో ఉల్లిగడ్డ కిలో ధర రూ.20 ఉంటే ప్రస్తుతం రూ.28కు విక్రయిస్తున్నారు. సూపర్‌బజార్లతో పాటు రిటైల్‌ మార్కెట్లలో ఆగస్టులో కిలో ధర రూ.25 ఉంటే నేడది రూ.35 నుంచి 40కి చేరింది. ఉల్లి ధర కూడా ఊహించని విధంగా పెరిగేదే కానీ విదేశీ ఎగుమతులపై పన్ను 40 శాతానికి పెంచడంతో ధరలు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం 5వేల నుంచి 6వేల క్వింటాళు మాత్రమే ఉల్లి మార్కెట్‌కు వస్తోంది. దీంతో ధరలు కాస్త పెరుగుతున్నాయి. నవంబరులో కొత్త పంట కూడా చేతికి వచ్చే వరకు ఇదే పరిస్థితి ఉండనుంది.

Share This Article
Leave a comment