వెండితెరపై ఆల్‌రౌండర్‌.. చంద్రమోహన్

Telugu BOX Office

శోభన్‌ బాబు.. కృష్ణంరాజు.. కృష్ణ.. ఇప్పుడు చంద్రమోహన్‌ మరణంతో.. తెలుగు తెరపై తమదైన ముద్ర వేసిన ఒక తరం హీరోల కథ ముగిసినట్లయింది. సూపర్‌స్టార్‌ కృష్ణ మరణించిన ఏడాది లోపే చంద్రమోహన్‌ కన్నుమూయడం తెలుగు ప్రేక్షకులకు విషాదం మిగిల్చింది. హీరోగా.. క్యారెక్టర్‌ ఆర్టి్‌స్టుగా.. చంద్రమోహన్‌ ప్రత్యేకతే వేరు. పాత్రల్లో జీవించి ఏడిపించారు. తనదైన శైలి హాస్య నటనతో నవ్వించారు. కొన్ని చిత్రాల్లో విలన్‌గానూ నటించి.. ఆల్‌రౌండర్‌ అనిపించుకున్నారు.

కృష్ణా జిల్లా ఉయ్యూరుకు సమీపంలోని పమిడిముక్కల.. చంద్రమోహన్‌ స్వగ్రామం. కృష్ణ, రామ్మోహన్‌రావు హీరోలుగా ఆదుర్తి సుబ్బారావు రూపొందించిన ‘తేనె మనసులు’ చిత్రం చూశాక చంద్రమోహన్‌కు సినిమాల్లో నటించాలన్న ఆసక్తి కలిగింది. దాంతో వెంటనే ఉద్యోగానికి సెలవు పెట్టేసి మద్రాస్‌ వెళ్లే ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఆ సమయంలోనే.. దిగ్దర్శకుడు బి.ఎన్‌.రెడ్డి రూపొందించిన ‘రంగులరాట్నం’ చిత్రంలో నటించే అవకాశం దక్కింది. చంద్రమోహన్‌ ఆ సినిమాలో హీరోగా నటించారు. తొలి చిత్రంతోనే నటుడిగా చంద్రమోహన్‌కు మంచి గుర్తింపు వచ్చింది. కానీ.. వేషాలు మాత్రం రాలేదు. దానికితోడు.. ‘‘నిన్ను హీరోగా పరిచయం చేశాను. తొందరపడి హీరో వేషాలు కాకుండా చిన్న చిన్న వేషాలు ఒప్పుకోవద్దు’’ అని బి.ఎన్‌.రెడ్డి చెప్పడం వల్ల చంద్రమోహన్‌ ధైర్యంగా ముందడుగు వెయ్యలేకపోయారు. ఆ సమయంలోనే బాపు దర్శకత్వంలో ‘బంగారు పిచుక’ సినిమాలో హీరోగా అవకాశం వచ్చింది. కానీ ఆ సినిమా కూడా హిట్‌ కాకపోవడంతో ఆయనలో ఊగిసలాట మొదలైంది.

‘‘ఇప్పుడేమి చేయాలి? మద్రాసులోనే మరికొంత కాలం ఉండిపోయి సినిమా అవకాశాల కోసం ఎదురు చూడడమా, లేక ఏలూరు తిరిగి వెళ్లిపోయి, మళ్లీ ఉద్యోగం వెతుక్కోవడమా’’ అనే సందిగ్థంలో పడ్డారు. ఆ సమయంలోనే కొందరు నిర్మాతలు చంద్రమోహన్‌కు తమ చిత్రాల్లో హీరో తమ్ముడిగానో, స్నేహితుడిగానో అవకాశాలు ఇస్తామన్నారు బి.ఎన్‌.రెడ్డి ఇచ్చిన సలహా ప్రకారం.. తొలుత ఆ ఆఫర్లను చంద్రమోహన్‌ తిరస్కరించారు. అయితే, అదే బీఎన్‌ రెడ్డి వల్ల ఆయన తన ఆలోచన తీరును మార్చుకున్నారు. ఆ కథేంటంటే.. బీన్‌ రెడ్డి ‘బంగారు పంజరం’ పేరుతో ఒక సినిమా తీయనున్నట్టు ప్రకటించి.. అందులో తారాగణం వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆ జాబితాలో తన పేరు లేకపోవడంతో చంద్రమోహన్‌ ఆయన వద్దకు వెళ్లి అడిగారు. దీనికి ఆయన.. ‘‘ఈ సినిమాలో నీకు తగిన పాత్ర లేదు. ఇద్దామనుకున్నా చేయడానికి నీ వయసు సరిపోదు’’ అన్నారు. ఆ సంఘటన తన కళ్లు తెరిపించిందని చెప్పేవారు చంద్రమోహన్‌.

ఆ తర్వాత తనకు సమకాలికులైన కృష్ణ, శోభన్‌బాబు చిత్రాల్లో వారికి తమ్ముడిగానో, స్నేహితుడిగానో నటించడం మొదలు పెట్టారు. ఇదే ఆయన్ని ఎంతో బిజీ చేసింది. పాత్ర చిన్నదైనా.. పెద్దదైనా చేస్తూ పరుగు పందెంలో ఉండడం ముఖ్యం అనుకున్నారు. కమెడియన్‌, సహాయ నటుడు, విలన్‌.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా చేయగల ఆల్‌రౌండర్‌ అనే పేరు రావడంతో దర్శక, నిర్మాతలు చంద్రమోహన్‌కు ఆఫర్లు ఇచ్చేవారు.

నాలుగు తరాల నటులతో

ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, శోభన్‌బాబు, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లు అర్జున్‌.. ఇలా నాలుగు తరాల హీరోలతో పని చేసిన ఘనత చంద్రమోహన్‌ది. ‘నువ్వు స్టార్‌వి కాదురా.. ఆర్టి్‌స్టవి. కొంచెం ఎత్తు ఉండి ఉంటే సినీ రంగాన్ని ఏలేవాడివి’ అంటుండేవారు ఎస్వీ రంగారావు. అక్కినేని కూడా.. ‘‘నీకూ నాకూ ఒకటే డిఫెక్ట్‌ అయ్యా.. పొట్టి’’ అని నవ్వుతూ కామెంట్‌ చేసేవారట. ‘‘అల్లుళొస్తున్నారు జాగ్రత్త’’ చిత్రంలో చిరంజీవితో కలిసి హీరోగా చేసిన చంద్రమోహన్‌.. అదే చిరంజీవికి ‘ఇద్దరు మిత్రులు’ సినిమాలో తండ్రిగా నటించారు. ఆయనెప్పుడూ వచ్చిన పాత్రను ఎంత అద్భుతంగా పండించాలని ఆలోచించేవారే తప్ప పెద్దదా, చిన్నదాఅని చూసే వారు కాదు.

సినీ పరిశ్రమలో చంద్రమోహన్‌ దాదాపు యాభై ఏళ్లపాటు నిర్విరామంగా పని చేశారు. తన ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేసి రాత్రింబవళ్లూ పనిచేసిన రోజులున్నాయి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలని ఎవరైనా హెచ్చరించినా.. ‘ఇనుముకు చెదలు పడతాయా?’ అని అడిగేవారు. తన ఆరోగ్యం అంత గట్టిదని ఆయన నమ్మకం. కానీ అదే ఆయన ఆరోగ్యాన్ని దెబ్బతీసింది. జూనియర్‌ ఎన్టీఆర్‌ హీరోగా వచ్చిన ‘రాఖీ’ చిత్రంలో ఒక భావోద్వేగ సన్నివేశాన్ని చేసిన వెంటనే చంద్రమోహన్‌కు గుండెపోటు వచ్చి ఆస్పత్రికి వెళ్లాల్సి వచ్చింది. ఆయన అనారోగ్యం కారణంగా అల్లు అర్జున్‌ ‘దువ్వాడ జగన్నాథం’ షూటింగ్‌కు బ్రేక్‌ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో.. తన వల్ల నిర్మాతలు ఇబ్బంది పడకూడదని చంద్రమోహన్‌ రిటైర్‌మెంట్‌ తీసుకున్నారు.

హీరోగా నిలబెట్టిన విశ్వనాథ్‌
చంద్రమోహన్‌కు హీరో వేషం ఇచ్చి నిలబెడదామని కొంతమంది దర్శకనిర్మాతలు ప్రయత్నించారు. కానీ అంతకుముందు ఆయన పోషించిన పాత్రల ప్రభావం వ్యాపార పరంగా అడ్డుపడే ప్రమాదం ఉండడంతో.. ఎవరూ ధైర్యంగా ముందడుగు వేయలేకపోయారు. చివరకు.. చంద్రమోహన్‌‌కు వరుసకు సోదరుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌ ధైర్యం చేసి.. ‘ఓ సీత కథ’ చిత్రంలో హీరోగా అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత కూడా కొన్ని చిత్రాల్లో హీరోగా నటించినా అవేవీ చంద్రమోహన్‌ కెరీర్‌కు పెద్దగా సహాయపడలేదు. అయినా.. మళ్లీ ‘సిరిసిరిమువ్వ’ చిత్రంతో మరో మంచి అవకాశం ఇచ్చారు విశ్వనాథ్‌. ఇక అప్పటినుంచి సింగిల్‌ కాల్షీటు పాత్రలు అంగీకరించకుండా జాగ్రత్త పడ్డారు చంద్రమోహన్‌. అప్పుడే ‘పదహారేళ్ల వయసు’ చిత్రంలో అవకాశం రావడంతో హీరోగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకోగలిగారు. అయితే ఇదంతా జరగడానికి చాలా ఏళ్లు పట్టింది. ‘రంగులరాట్నం’ చిత్రం తర్వాత.. పరిశ్రమలో హీరోగా తను పోగొట్టుకున్న స్థానాన్ని మరి 14 ఏళ్ల తర్వాత కానీ పొందలేకపోయారాయన.

ఎన్టీఆర్‌తో అనుబంధం
చంద్రమోహన్‌ ఎన్టీఆర్‌ అభిమాని. ఆయనంత అందగాడు ఏ సినీ ఇండస్ట్రీలో లేడని అంటుండేవారు. ఎన్టీఆర్‌ పోషించిన కృష్ణుడు, దుర్యోధనుడు వంటి పాత్రలు తను వెయ్యలేను గనుక ఆ అభిమానం మరింత పెరిగిందని చెబుతుండేవారు. ‘రంగులరాట్నం’ కోసం చంద్రమోహన్‌ను సెలెక్ట్‌ చేసిన తర్వాత.. బీఎన్‌ రెడ్డి ఆయన్ను ఎన్టీఆర్‌ దగ్గరకు తీసుకెళ్లి ఆశీస్సులు ఇప్పించారు. ఆ సినిమా వంద రోజుల వేడుకలో ఎన్టీఆర్‌ చంద్రమోహన్‌ను.. ‘‘మా బీఎన్‌ గారి పేరు నిలబెట్టావు. కీపిటప్‌ బ్రదర్‌’’ అని అభినందించారు. ఎన్టీఆర్‌తో కంటే ఏఎన్నార్‌తోనే ఆయన ఎక్కువ సినిమాల్లో నటించారు.

శోభన్‌బాబుతో స్నేహం
ఇండస్ట్రీలో తనకు అత్యంత ఆత్మీయుడు శోభన్‌బాబు అని చంద్రమోహన్‌ తరచూ చెప్పేవారు. వారిద్దరిదీ.. ‘ఏరా అంటే ఏరా’ అని పిలుచుకునేంత సన్నిహిత స్నేహబంధం. శోభన్‌బాబు తనకు మంచి ఫ్రెండే కాక గైడ్‌ కూడా అని చంద్రమోహన్‌ చెప్పేవారు. తన సంపాదన మొత్తాన్నీ రియల్‌ ఎస్టేట్‌లో పెట్టిన శోభన్‌బాబు.. ఏదైనా ఆస్తి కొన్న ప్రతిసారీ చంద్రమోహన్‌ చెయ్యి మంచిదంటూ ఆయన దగ్గర డబ్బు తీసుకుని, ఆ సొమ్మునే అడ్వాన్స్‌గా చెల్లించేవారు. శోభన్‌బాబు సలహాతోనే చంద్రమోహన్‌ కూడా భూములు కొన్నారు.

అవార్డులు ఏవీ?
మంచి నటుడైన చంద్రమోహన్‌కు.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది పురస్కారాలు కొన్ని వచ్చాయిగానీ, పద్మ పురస్కారాలు మాత్రం రాలేదు. కానీ చంద్రమోహన్‌ ఇవేమీ పట్టించుకొనే వారు కాదు. ‘నా సీనియర్స్‌ సావిత్రి, కన్నాంబ, ఎస్వీ రంగారావు, సూర్యకాంతం.. వీరంతా గొప్ప గొప్ప అవార్డులకు అర్హులు. వారికి ఇచ్చి ఉంటే నిజంగా అవార్డులకు గౌరవం వచ్చేది. నాకంటే ఎంతో ప్రతిభ కలిగిన వారికే పద్మశ్రీ వంటి పురస్కారాలు దక్కలేదు. అందుకే వాటి మీద నాకు ఆసక్తి లేదు’ అని చెప్పేవారు చంద్రమోహన్‌.

Share This Article
Leave a comment