విజయనగర సామ్రాజ్య తీపి గుర్తు… హంపి

Telugu BOX Office

హంపి పేరు వింటే చాలు వెంటనే మీకు విజయనగర పట్టణ అందచందాలు, వాటిని చుట్టుముట్టిన ప్రఖ్యాత శిధిలాలు గుర్తుకు వచ్చేస్తాయి. హంపి పట్టణం విజయనగర సామ్రాజ్యానికి రాజధాని. ఈ పట్టణంలో హోయసలుల నాటి శిల్ప సంపద కనపడుతూంటుంది. రాతి శిల్పాలైనప్పటికి సందర్శకులకు ఎంతో ఉత్సాహాన్ని కలిగిస్తాయి.

హంపి అతి ప్రాచీన పట్టణం. దీని గురించి రామాయణంలో కూడా చెప్పబడింది. అనంతమైన ఆధ్యాత్మిక సంపదను … చెరిగిపోని చారిత్రక నేపథ్యాన్ని సంతరించుకున్న చారిత్రక పుణ్యక్షేత్రం హంపి. కర్నాటకకు ఉత్తర భాగాన బెంగుళూరుకు 350 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతానికి చేరుకోవడం చాలా సులభమే. దీన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా అంతర్జాతీయ సంస్ధ యునెస్కో గుర్తించింది. ప్రతి సంవత్సరం వేలాదిమంది పర్యాటకులు దీనిని సందర్శిస్తారు. హంపి శిధిలాలు చూడాలంటే, స్ధానికంగా ఒక సైకిల్ అద్దెకు తీసుకొని తిరుగుతూ చూస్తే పూర్తిగా వాటిని ఆనందించినవారవుతారు. ఇక్కడున్న కొన్ని చారిత్రక ప్రదేశాల గురించి తెలుసుకుందా..

విరూపాక్ష ఆలయం
హంపిలోని విరూపాక్ష ఆలయం చాలా పెద్దది. ఇక్కడ ప్రధాన దైవం విరూపాక్షుడు. శివుడినే ఇక్కడ విరూపాక్షస్వామి అంటారు. ఇప్పటికీ ఇక్కడ పూజలు జరుగుతున్నాయి. హంపి వీధికి పశ్ఛిమ దిశగా ఎతైన గోపురం దేవాలయం లోపలికి స్వాగతం పలుకుతుంది. ఈ ఆలయం క్రీ. శ 10-12 శతాబ్దాలలో కట్టి ఉంటారనీ చరిత్ర కారుల అంచనా. ఈ ఆలయానికి చుట్టూ మూడు ప్రాకారాలున్నాయి. తూర్పున ఉన్న ఎత్తైన గోపురం దాటి లోపలికి వెళ్తే మొదటి ప్రాకారం వస్తుంది. అది దాటి వెళ్తే స్తంభాలతో కప్పబడిన వసారా వస్తుంది. ఇది దాటి వెళ్తేనే గర్భగుడి వస్తుంది. ఈ ఆలయ కప్పుమీద, స్తంభాల మీద అందమైన వర్ణచిత్రాలు చెక్కారు. శృంగేరీ పీఠాధిపతిని సకల రాజమర్యాదలతో పల్లకీలో విరూపాక్ష దేవాలయానికి తీసుకొస్తున్నట్లుగా చాలా గొప్పగా వర్ణసముదాయంతో చిత్రించారు. ఈ గర్భగుడికి ఒక ప్రత్యేకత ఉంది. తుంగభద్రా నది నుండి చిన్నపాయ ఒకటి ఆలయంలోకి ప్రవేశించి గర్భగుడికి నీరు అందిస్తూ బయటి ప్రకారం ద్వారా మళ్లీ బయటికి వెళ్లిపోతుంది.

 

పెద్దరాతి కొండ
అసంఖ్యాకంగా ఉన్న ఆలయాలకు, తుంగభద్ర నదీతీరాన పెద్దరాతి కొండ నడుమ పురాతన విరూపాక్ష ఆలయం చుట్టూ నిర్మించిన హంపి నగరపు కోటకు, వాటి గోడలకు, ద్వారాలకు అక్కడ కొండలలో లభ్యమైయ్యే గట్టి రాతిని వాడారు. విజయనగర శిల్పులు భారతీయ వాస్తుకళా వికాసంలో కొత్త పుంతలు తొక్కి తర్వాత తరాల వారికి పురాతన శిల్ప సంప్రదాయాన్ని జవసత్వాలతో నిండుగా అందించారు.

 

హజారా రామాలయం

హజారా రామాలయాన్ని రాజప్రతినిధుల కోసం అప్పట్లో నిర్మించారట. ఈ ఆలయ బయట గోడల మీద శ్రీకృష్ణుడిలీలలు, రామాయణ కథ మొత్తం చిన్నచిన్న శిల్పాలతో చాలా అందంగా చిత్రించారు. ఆలయం లోపల నల్ల గ్రానైట్‌ రాయితో స్తంభాలపై అందమైన శిల్పాలను చెక్కారు. ఈ ఆలయం దగ్గరే ఆ శిల్పాలను చూస్తూ చాలా సేపు ఆగిపోతాం. ఈ ఆలయం మీద రామాయణ గాథకు సంబంధించి శిల్పాలు లెక్కకు మించి ఉండడంతో ఈ ఆలయాన్ని సహస్ర రామాలయం… అంటే `హజారా రామాలయం’ అనే పేరు వచ్చిందంటున్నారు.

విఠలాలయం
హంపీలో ఆలయాలలో చెప్పుకోదగ్గది విఠలాలయం. ఆనాటి అతిపెద్ద ఆలయాలలో ఇది ఒకటి. విఠలాలయం సముదాయం చుట్టూ ప్రాకారం ఉంది. ఈ ప్రాకారానికి తూర్పున, దక్షిణాన, ఉత్తరాన గోపుర ద్వారాలున్నాయి. మండపాలు, ఉప మండపాలు, చుట్టూ పరివార ఆయతనాలున్నాయి. అన్నీ విజయనగర ఆలయాలలో మాదిరిగా ఇక్కడి మండపాలు, గోపురాలు చాలా పెద్దవి. దాదాపుగా అన్నీ వెయ్యి స్తంభాల మండపాలే. కుడ్య స్తంభాల మధ్య భాగాలు నాజూకుగా ఉన్నాయి. కొన్ని చోట్ల ఒకే రాతి నుంచి చెక్కిన మధ్య స్తంభమూ, చుట్టూ ఉప స్తంభాలూ లేదా జంతువులు ఉన్నాయి. ఈ స్తంభాలమీద మీటితే `సరిగమపదనిస’ స్వరాలు పలుకుతాయట.

ఏకశిలా రథం
ఇక్కడున్న ‘ఏకశిలా రథం’ ఒక అత్యద్భుమైన కట్టడం. ఒకేరాతిలో చెక్కిన రథం, పైన రెండు గోపురాలతో అద్భుతంగా చెక్కారు. పైన రెండు గోపురాలు నేడు శిథిలమైనా ఈ ఏకశిలారథం చక్కగా ఉంది. కొన్ని పాత ఆలయాల వెలుపలి ప్రాకారాల మధ్య బ్రహ్మాండమైన గోపురాలను చేర్చారు. వీటిని `రాయ గోపురాలు’ అని పిలుస్తారు. హంపీ నగరం ఇక్కడ ఏకశిలతో కట్టిన `ఉగ్రపరసింహ’ మూర్తి పెద్ద శిలలో తొలిచారు. పక్కనే `బీదలింగ’ మనే శివలింగం ఉంది. ఆ లింగం ప్రతిమ కింద నుండి విరివిగా జల వస్తూ ఆ జల అక్కడి పంటపొలాలకు వెళ్లడం చూస్తాం.

లోటస్ దేవాలయం
లోటస్ దేవాలయం మరియు లోటస్ ప్యాలెస్. ఈ నిర్మాణం భారతీయ మొగలుల శిల్ప నైపుణ్యానికి అద్దం పడుతుంది. ఇది హజారా రామాలయానికి దగ్గరలో ఉంది. కలువ పూవు రేకులవలే ఉన్నది కనుక దీనిని లోటస్ టెంపుల్ అని పిలుస్తారు. మరోపేరుగా కలువ మహల్ మరియు చిత్రాంగని మహల్ అని కూడా అంటారు. చక్కటి ఆర్చీలతో కూడిన ఈ రాజప్రాసాదం రెండు అంతస్తులు కలిగి ఉంటుంది. రాచ కుటుంబాలకు చెందిన రాణులు, వారి స్నేహితులు ఈ ప్యాలెస్‌లో సమావేశాలు చేసి ఆనందించేవారు. వేసవిలో ఈ ప్యాలెస్ ఎంతో చల్లగా ఉంటుంది.ఈ లోటస్ ప్యాలెస్ ను సున్నం, ఇటుకలతో నిర్మించారు.

ఏనుగుల నివాసాలు
పర్యాటకులు జెనానా ఎన్ క్లోజర్ వెలుపలగల ఏనుగుల నివాసాలను తప్పక చూడాలి. హంపిలోని నిర్మాణాలన్నింటిలోకి ఏనుగు నివాసాలు ఇండో ఇస్లాం శిల్పశైలికి మంచి ఉదాహరణగా నిలుస్తాయి. ఈ నిర్మాణంలో 11 పెద్ద గదులుంటాయి. సీలింగ్ ఎంతో ఎత్తున ఉంటుంది. పదకొండు గదులలోను పది విశాలమైన డోమ్ లు కలిగి ఉంటాయి. ఇటుకలు, మోర్టార్తో కట్టబడ్డాయి. ఈ గోపురాలు వివిధ రూపాలలో నిర్మించారు. ప్రధాన డోమ్ అతి పెద్దది దీనిని సంగీతకారులు మరియు బ్యాండ్ ట్రూపుల కొరకు నిర్మించారు. ఏనుగుల నివాసాలు చూసే పర్యాటకులు ఏనుగులను కట్టేందుకు పెట్టిన కొక్కేలను కూడా చూడవచ్చు.

శ్రీకృష్ణాలయం
ఇది చిన్నికృష్ణుని ఆలయం. ఇపుడు పూర్తిగా శిథిలమైపోయి ఉంది. కళింగ దేశంపై రాయలు విజయానికి చిహ్నంగా కట్టించాడని ఇక్కడ శాసనం ఉంది. ఈ ఆలయం పరివార ఆలయాలతో, మండపాలతో, స్తంభబుూలతో, మాలికలతో, అందమైన గోపురం ఉన్న మనోజ్ఞమైన ఆలయం. అయితే ఇపుడు శిథిలమైనా తప్పక చూడాల్సిందే.

మహానవమి దిబ్బ
మహానవమి దిబ్బ నలుచదరపు నిర్మాణం. హంపిలో మరో ప్రధాన ఆకర్షణ. దీనిని చక్రవర్తి క్రిష్ణదేవరాయలు తాను ఉదయగిరి (ప్రస్తుత ఒడిశా)పై పట్టు సాధించిన తర్వాత నిర్మించారట. హంపి నిర్మాణాలలో ఇది పొడవైన నిర్మాణం. కనుక ఏ ప్రదేశానికి వెళ్ళినా కనపడుతుంది. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాల్సిందే.

శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం
ఈ దేవాలయంలో శ్రీ లక్ష్మీ నరసింహ విగ్రహం 6.7 మీటర్ల ఏక శిలగా ఉంటుంది. ఏడు తలల పాము ఆదిశేషుడి తల్పంపై కూర్చుని ఉంటుంది. ఈ దేవాలయ శాసనాల మేరకు ఈ దేవాలయం 1528 లో కృష్ణదేవరాయలు కాలంలో నిర్మాణం పూర్తి చేసుకుంది. సహజంగా ఇది లార్డ్ నరసింహడి తొడపై కూర్చున్న మాత లక్ష్మీ దేవి.

ఎలా చేరుకోవాలి

విమానాశ్రయం
హంపికి దగ్గరలో ఉన్న విమానాశ్రయం బళ్ళారి మరియు బెల్గాం. ఈ రెండు విమానాశ్రయాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమానాలు నడుపుతుంటారు.

రైల్వే స్టేషన్
హంపీకి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ హోస్పేట్. ఈ ప్రాంతం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు రైళ్లు వెళుతుంటాయి.

రోడ్డు మార్గం
గుంతకల్లు నుండి బళ్లారికి 50 కిలోమీటర్లు.. బళ్లారి నుండి హోస్పేటకు 60 కిలో మీటర్లు. హోస్పేట నుండి హంపి 13 కిలో మీటర్లు. ఇక్కడ మొత్తం హంపి నగర సందర్శనకు టూరిస్ట్ గైడ్లు విరివిగా ఉన్నారు.

ప్రైవేట్ వాహనాలు
హోస్పేట్ నుంచి ఆటోలు, కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే కొన్ని ప్రాంతాలలోకి కారు ఆటోలు వెళ్లవు. తప్పనిసరిగా ద్విచక్ర వాహనం, సైకిళ్ల మీదనే వెళ్లాలి. వీటిని కూడా అద్దెకు ఇస్తారు. ఇక్కడ ఎక్కువగా విదేశీయులు తారసపడతారు. వాళ్లంతా సైకిల్‌, ద్విచక్రవాహనంమీద తిరుగుతారు.

Share This Article
Leave a comment