శివలింగం ఆకారంలో… శక్తి స్వరూపిణి!

Telugu BOX Office

నది మధ్యలో శివలింగం ఆకారంలో కొలువుదీరి… తన చల్లని చూపులతో భక్తులను అనుగ్రహిస్తూ పూజలు అందుకుంటోంది కర్ణాటకలోని కటీలు దుర్గాపరమేశ్వరి. ప్రసన్నవదనంతో కనిపిస్తూ… కొబ్బరినీటి అభిషేకాన్ని ఇష్టపడే ఈ శక్తిస్వరూపిణిని పూజిస్తే సకల శుభాలూ కలుగుతాయి. జలదుర్గా పరమేశ్వరిగానూ పిలిచే ఈ అమ్మవారు ఇక్కడ స్వయంభువుగా కొలువైందని ప్రతీతి.

ప్రశాంతమైన వాతావరణంలో… నందినీ నది మధ్యలో కనిపిస్తుంది దుర్గాపరమేశ్వరి ఆలయం. ఈ మహిమాన్వితమైన క్షేత్రం కర్ణాటకలోని దక్షిణ కన్నడ జిల్లాలో కటీలు అనే ప్రాంతంలో ఉంది. కొన్ని వందల సంవత్సరాల క్రితం నది మధ్యలో శివలింగం ఆకారంలో స్వయంభువుగా కొలువుదీరి… భక్తుల కోర్కెలను నెరవేర్చే కల్పవల్లిగా పూజలు అందుకుంటున్న ఈ అమ్మవారి ఆవిర్భావం వెనుక ఆసక్తికరమైన కథనం ఉంది.

స్థల పురాణం
ఒకప్పుడు ఈ ప్రాంతంలో కరవు సంభవించడంతో జాబాలి అనే మహర్షి లోకకల్యాణార్థం యాగం చేయాలనుకున్నాడట. అందుకోసం దేవేంద్రుడి దగ్గరున్న కామధేనువును కావాలని అడిగాడట. అయితే కామధేనువు లేకపోవడంతో ఆ గోవు సంతానమైన నందినిని పంపించేందుకు సిద్ధమయ్యాడట దేవేంద్రుడు. నందినికి భూలోకానికి వెళ్లడం ఇష్టంలేక తిరస్కరించడంతో ఆగ్రహించిన జాబాలి భూమిమీద నదిరూపంలో ప్రవహించమంటూ శపించాడట. దాంతో తన తప్పును తెలుసుకున్న ఆ గోవు పార్వతీదేవి దగ్గరకు వెళ్లి శాపవిమోచనాన్ని కలిగించమంటూ వేడుకొందట. అప్పుడు పార్వతీదేవి… మహర్షుల శాపానికి పరిహారం ఉండదంటూనే నదిలా ప్రవహించమనీ.. తాను ఆ నదిలో నివాసం ఏర్పరుచుకుని శాపవిమోచనాన్ని కలిగిస్తానంటూ పంపించిందట. అలా ఇక్కడ నందినీ నది ఏర్పడిందని కథనం.

ఇక, దేవీ భాగవతం ప్రకారం.. జగన్మాత శుంభనిశుంభుల్ని అంతమొందించినప్పుడు అరుణాసురుడు అనే మరో రాక్షసుడు తప్పించుకుని అగాథంలోకి వెళ్లిపోయాడట. కొన్నాళ్లకు తపస్సు చేసి బ్రహ్మ అనుగ్రహం పొంది… తనకు మనుషులు, దేవతలు, పశుపక్ష్యాదులు, ఆయుధాలు… ఇలా ఏ విధంగానూ మరణం లేకుండా వరం ఇమ్మంటూ వేడుకున్నాడట. దానికి బ్రహ్మ – గాయత్రీమంత్రం జపిస్తున్నంతకాలం మరణం ఉండదని చెప్పడంతో ఓ వైపు గాయత్రీ మంత్రాన్ని జపిస్తూనే… అందరినీ ఇబ్బందిపెడుతూ ముల్లోకాలనూ ఆక్రమించేందుకు సిద్ధమయ్యాడట. ఇది చూసి దేవతలంతా జగన్మాతను వేడుకోవడంతో అమ్మవారు అరుణాసురుడిని అంతమొందించాలనుకుంది. అలా దేవి ఆ అసురుడి దగ్గరకు వచ్చినప్పుడు… అతడు దేవి మాయలో పడి కాసేపు గాయత్రి మంత్రాన్ని జపించడం ఆపేశాడట. అదే అదనుగా అమ్మవారు అక్కడున్న ఓ పెద్దబండరాయిలోకి వెళ్లి మాయమైపోయింది. అది చూసిన రాక్షసుడు ఆ బండరాయిని రెండుగా బద్దలు కొట్టేందుకు ప్రయత్నించినప్పుడు పెద్ద సంఖ్యలో భ్రమరాలు వచ్చి అతడిని చుట్టుముట్టాయనీ, అమ్మవారు కూడా భ్రమరం రూపంలో వచ్చి అంతమొందించి ఆ తరువాత నందినీనది మధ్యలో స్వయంభువుగా కొలువుదీరి ఆ గోవుకు శాపవిమోచనాన్ని కలిగించిందనీ పురాణగాథ. అసుర సంహారం తరువాత దేవిని శాంతింపచేసేందుకు కొబ్బరినీటితో అభిషేకాన్ని చేశారనీ… ఇప్పటికీ అదే సంప్రదాయం కొనసాగుతోందనీ అంటారు ఆలయ నిర్వాహకులు.

ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం దక్షిణ కన్నడలోని కటీలు అనే ప్రాంతంలో ఉంటుంది. విమానం ద్వారా రావాలనుకునేవారు మంగళూరు విమానాశ్రయంలో దిగి ప్రైవేటు వాహనాల ద్వారా ఆలయానికి చేరుకోవాలి. రైల్లో వచ్చే భక్తులు ముల్కి రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడినుంచి పది కి.మీ. దూరంలోని ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులూ, ఆటోలూ ఉంటాయి.

Share This Article
Leave a comment