కాకతీయుల కళాత్మకతకు నిలువెత్తు సాక్ష్యం.. రామప్ప దేవాలయం

Telugu BOX Office

రామప్ప గుడిగా పిలిచే రుద్రేశ్వర స్వామి ఆలయం తెలంగాణలోని ములుగు జిల్లా పాలంపేట గ్రామంలో ఉంది. ఇది హైదరాబాద్‌కి 200 కిలోమీటర్లు, వరంగల్‌కి 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రుద్రేశ్వరుడు అనే పేరుతో శివుడు ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. ఈ గుడి శిల్ప సంపద విశిష్టమైనది. దీంతో ఈ ఆలయాన్ని తాజాగా ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో చేర్చింది యునెస్కో. కాకతీయులు క్రీస్తు శకం 1123–1323 మధ్య తెలుగు రాష్ట్రాల్లో సింహ భాగాన్ని పాలించారు. 1213లో ఈ గుడి నిర్మాణం ప్రారంభం అయింది. నిర్మాణానికి సుమారు 40 ఏళ్లు పట్టిందని చరిత్రకారుల అంచనా.

కాకతీయ చక్రవర్తి గణపతి దేవుడి కాలంలో ఆయన సేనాని రేచర్ల రుద్రుడు ఈ గుడి కట్టించినట్టు శాసనాలు చెబుతున్నాయి. రేచర్ల రుద్రుడినే రుద్ర సేనాని, రుద్ర దేవుడని, రుద్ర రెడ్డి అని రాశారు. ఈ గుడి శిల్పి పేరు రామప్ప. శిల్పి పేరుతో ఖ్యాతి గడించిన గుడి లేదా నిర్మాణం అరుదు. 800 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ దేవాలయం కాల గర్భంలో ఎన్నో దాడులకు గురైనా నేటికీ అపూర్వంగా నిలవడం విశేషం. ఇప్పటికీ ఈ ఆలయాన్ని దర్శించిన ప్రతివాళ్ళూ నాటి మనవారి నిర్మాణ కౌశలాన్నీ, శిల్ప కళా చాతుర్యాన్నీ మెచ్చుకుంటున్నారంటే అతిశయోక్తి కాదు.

1310లో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాని మాలిక్ కఫూర్ దక్షిణ భారత దండయాత్రల్లో ఈ గుడి కొంచెం ధ్వంసం అయిందని చెబుతారు. ఆధునిక కాలంలో గుప్త నిధులు కోసం తవ్వేవాళ్లు మరికొంత ధ్వంసం చేశారు. కాకతీయుల రాజ్య పతనానంతరం 600 ఏళ్లపాటు ఆదరణ లేక కళా విహీనమైన ఈ దేవాలయాన్ని తిరిగి వెలుగులోకి తెచ్చినది హైదరాబాదుకు చెందిన అసిఫ్ జాహి రాజవంశమువారు. వారు ఈ ప్రాంతానికి వేట కోసం వచ్చినప్పుడు ఈ ఆలయాన్ని, రామప్ప చెరువు చూసి ఆ కళా ఖండాలు అలా శిధిలమయిపోకూడదని వాటి పునరుధ్ధరణ కార్యక్రమాలు చేబట్టారు. ఆ ప్రాంతపు పెద్దలు కూడా తమ పంటపొలాలను ఆలయ పోషణకు దానముగా ఇచ్చి తోడ్పడ్డారు.

 

గర్భగుడి ముందుండే మండపంలో అద్భుత శిల్పకళ ఉంటుంది. పురాణ గాథలు, నాట్యగత్తెలు, సంగీత వాయిద్యకారులు, పౌరాణిక జంతువులు.. ఇలాంటివి ఆ శిల్పాలపై చెక్కారు. హైహీల్స్ వేసుకున్న మహిళ శిల్పం ప్రత్యేక ఆకర్షణ. ప్రధాన ఆలయానికి ఎదురుగా ఉన్న మండపంలోని నంది శిల్పం కూడా మిగతా చోట్ల కంటే భిన్నంగా ఉంటుంది. స్తంభాల నుంచి పైకప్పు మధ్యలో ఉన్న నల్లరాతిలో చెక్కిన నాట్య భంగిమలు… మండపం పైకప్పు లోపలి భాగంలో చెక్కిన సూక్ష్మ శిల్పాలు, బయటి గోడలపైనా, స్తంభాలపైనా ఉన్న వివిధ శిల్పాలు ఇక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంటాయి. నల్లరాయి, ఎర్ర ఇసుక ఇటుకల మేళవింపు ఈ గుడి. ఈ ఆలయంపై ఉండే శిల్ప భంగిమలను ఆధారం చేసుకునే అంతరించిపోయిన పేరిణి శివతాండవం అనే నృత్యాన్ని తిరిగి పునరుద్ధరించారు నటరాజ రామకృష్ణ. జాయప సేనాని రాసిన నృత్య రత్నావళిలోని కొన్ని భంగిమలు కూడా ఈ గుడిపై శిల్పాలుగా చెక్కడం విశేషం.

ఆలయం స్తంభాలకు, పై కప్పుకు మధ్యగల ప్రదేశంలో ప్రస్తుతం 26 ఏనుగు పైన సింహము వున్న విగ్రహాలున్నాయి. కాకతీయ రాజుల బిరుదులైన రాయగజకేసరి, అరిగజకేసరిలకు గుర్తుగా ఇవి చెక్కబడి వుండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం. ఇవికాక ఆలయానికే పేరు తెచ్చిపెట్టిన 12 సాలభంజికలు మూర్తులు అపురూపాలు. ఒక్కొక్కటి ఒక్కొక్క విలక్షణమైన హావభావాలతో చెక్కబడ్డాయి. ఈ సుందర మూర్తులే రామప్ప దేవాలయానికి ప్రధాన ఆకర్షణ. ఇవ్వన్నీ నల్లరాతి శిల్పాలే. ఈ విగ్రహముల వస్త్రములు, ఆభరణములు, హావ భావాలు, భంగిమలు, కేశములు ఆ నాటి శిల్పుల కళానైపుణ్యాన్ని చాటి చెబుతున్నాయి. ఇలాంటి విశేషాలెన్నో రామప్ప గుడిలో చూడొచ్చు.

Share This Article
Leave a comment