తొలి తిరుపతి.. శ్రీవారు మొదటిగా వెలసిన క్షేత్రము

Telugu BOX Office

భక్తులు ఎన్ని అడుగుల ఎత్తులో ఉంటే అంత ఎత్తులోనే కనిపించే స్వామి దివ్య మంగళ స్వరూపం… కోరిన కోర్కెలను నెరవేర్చి భక్తులు చెల్లించే పటికబెల్లాన్ని ముడుపుగా స్వీకరించే శ్రీనివాసుడు… అరుదైన ఇలాంటి ప్రత్యేకతలతో అలరారే క్షేత్రమే కాకినాడ జిల్లాలోని తిరుపతి వేంకటేశ్వరస్వామి సన్నిధానం. తొలి తిరుపతిగా గుర్తింపు పొందిన ఈ ఆలయంలో స్వామి చిరుమందహాసంతో కనిపిస్తూ… శృంగార వల్లభుడిగా పూజలు అందుకుంటున్నాడు.

ప్రకృతి అందాల మధ్య కొలువుదీరి… చిరునవ్వుతో భక్తులను కటాక్షిస్తూ కోరిన కోర్కెలను నెరవేర్చే భక్త సులభుడిగా అలరారుతున్నాడు శృంగార వల్లభస్వామి. తొలి తిరుపతిగా పేరుపొందిన ఈ ఆలయం కాకినాడ జిల్లా, పెద్దాపురం మండలంలోని తిరుపతి గ్రామంలో ఉంది. సుమారు తొమ్మిదివేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయం తిరుమల కన్నా, సింహాచలం కన్నా పురాతనమైనదనీ విష్ణుమూర్తి శిలా రూపంలో మొదట ఇక్కడే కొలువుదీరాడనీ ఆలయంలోని శిలాశాసనాలు తెలియజేస్తున్నాయి. అందుకే ఈ క్షేత్రానికి తొలి తిరుపతి అనే పేరు వచ్చిందని ప్రతీతి.

స్థల పురాణం
ఉత్థానపాదుడు అనే రాజుకు సురుచి, సునీతి అని ఇద్దరు భార్యలు ఉండేవారు. పెద్దభార్య సునీతి కుమారుడు ధ్రువుడు. రాజు సురుచిని ఎక్కువగా ఇష్టపడటంతో సునీతి దాసీ జీవితాన్ని గడిపేది. ఓరోజు సురుచి కుమారుడైన ఉత్తముడు తండ్రి తొడపైన కూర్చోవడాన్ని చూసిన ధ్రువుడు తానూ తండ్రి వద్దకు వెళ్లేందుకు సిద్ధమయ్యాడట. అందుకు ఆగ్రహించిన సురుచి ధ్రువుడిని దూషించి పంపించేస్తుంది. దాంతో ధ్రువుడు తల్లి దగ్గరకు వెళ్లి బాధపడటంతో… తండ్రి ప్రేమను అందుకోవడంతోపాటు రాజుగా సింహాసనాన్ని అధిష్టించాలంటే విష్ణుమూర్తి అనుగ్రహాన్ని పొందమంటూ సలహా ఇచ్చిందట. దాంతో ధ్రువుడు స్వామికోసం తపస్సు చేసేందుకు అడవికి బయలుదేరాడట. అక్కడ నారదుడు నారాయణ మంత్రాన్ని ఉపదేశించడంతో ధ్రువుడు కఠిన తపస్సు చేయడం మొదలుపెట్టాడు. దానికి మెచ్చి విష్ణుమూర్తి సాక్షాత్కరించినప్పుడు స్వామి తేజస్సును చూసి ధ్రువుడు భయపడ్డాడట. అప్పుడు విష్ణుమూర్తి ధ్రువుడితో ‘నేనూ నీ అంతే ఉన్నాను కదా…’ అంటూ ధ్రువుడిని అనుగ్రహించి ఆ తరువాత ఇక్కడే శిలారూపంలో ఉండిపోయాడని కథనం. విష్ణుమూర్తి ధ్రువుడితో నీ అంతే ఉన్నానని చెప్పడం వల్లే తనని దర్శించుకునే భక్తులు ఎన్ని అడుగుల ఎత్తులో ఉంటే.. స్వామి కూడా అంతే ఎత్తులో కనిపిస్తాడు.

పటికబెల్లం ముడుపురూపంలో…
ఈ ఆలయంలో వేంకటేశ్వరుడు శృంగారవల్లభుడిగా కొలువుదీరి… చిరుమందహాసంతో భక్తులకు దర్శనమివ్వడం విశేషం. సాధారణంగా స్వామికి శంఖు చక్రాలు కుడి ఎడమవైపు ఉంటే… ఇక్కడ ఎడమ, కుడి వైపు కనిపిస్తాయి. స్వామి వెలసిన కొంతకాలానికి దేవతలు వచ్చి ఆలయాన్ని నిర్మించారనీ… శ్రీకృష్ణదేవరాయలు భూదేవి తామ్ర విగ్రహాన్ని ప్రతిష్ఠించాడనీ ఇక్కడున్న శిలాశాసనాల ద్వారా తెలుస్తుంది. శ్రీకృష్ణదేవరాయలు కాకుండా భోజమహారాజు, రుద్రమదేవి, పెద్దాపురం, పిఠాపురం సంస్థానాధీశులు, మహారాణులు ఈ స్వామిని దర్శించుకున్నారట. విక్టోరియా మహారాణి స్వామిని పూజించి వెండి కవచాన్ని చేయించిందనీ అంటారు.

ఈ ఆలయ ప్రాంగణంలోనే శివ-వైష్ణవాలయాలు ఉన్నాయి. వివాహం కానివారూ, సంతానం లేనివారూ, విద్య, ఉద్యోగ ప్రాప్తికోసం వచ్చేవారూ ఆలయంలోని బావి నీటితో స్నానాలు చేసి స్వామిని దర్శించుకుంటే అవి నెరవేరతాయని భక్తుల నమ్మకం. కోరికలు తీరిన భక్తులు స్వామికి పటిక బెల్లంతో తులాభారాన్ని సమర్పిస్తారు ఇక్కడ స్వామికి రోజువారీ చేసే పూజలతోపాటు శ్రీరామనవమి తర్వాత వచ్చే చైత్రశుద్ధ ఏకాదశినాడు అంగరంగవైభవంగా కల్యాణాన్ని నిర్వహిస్తారు. అప్పటినుంచీ ఆరురోజులపాటు నిర్వహించే ఉత్సవాలను చూసేందుకు భక్తులు వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి చేరుకుంటారు. అలాగే ధనుర్మాసంలో నెలరోజులపాటు విశేషమైన పూజా కార్యక్రమాలనూ జరిపిస్తారు.


ఎలా చేరుకోవచ్చు
ఈ ఆలయం రాజమహేంద్రవరం మధురపూడి విమానాశ్రయం నుంచి 50 కి.మీ. దూరంలో ఉంటుంది. రైల్లో రావాలనుకుంటే సామర్లకోట రైల్వే స్టేషన్‌లో దిగితే అక్కడినుంచి 10 కి.మీ. దూరంలో ఉండే ఆలయాన్ని చేరుకునేందుకు బస్సులు, ప్రైవేటు వాహనాలు అందుబాటులో ఉంటాయి. పిఠాపురం నుంచి వచ్చేవారు దివిలి మీదుగా ఆలయానికి చేరుకోవాల్సి ఉంటుంది. పెద్దాపురం, కాకినాడ మీదుగా ఆలయానికి చేరుకునేందుకూ బస్సులు, ఆటోలు ఉంటాయి.

Share This Article
Leave a comment