సొరకాయలు ముడుపుగా కట్టే ఆలయం.. ఈ స్వామి గురించి మీకు తెలుసా

Telugu BOX Office

హిందూ మతంలో విగ్రహారాధనకు ఉండే ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. దేవతలనే కాకుండా ఈ భువిపై మహాపురుషులుగా నడయాడిన ఎంతోమందిని దేవుళ్లుగా పూజిస్తుంటారు. ఈ తరహాలోనే తిరుపతి జిల్లాలో ఓ ప్రత్యక్ష దైవం ఉన్నారు. ఆంధ్రా-తమిళనాడు సరిహద్దు ప్రాంతాల ప్రజలతో నిత్య పూజలందుకొంటున్న ఆయనే సొరకాయల స్వామి.

షిరిడి సాయిబాబా, పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, రామకృష్ణ పరమహంస, రాఘవేంద్రస్వామి, పుట్టపర్తి సత్యసాయి వంటి‌ మహాపురుషులు, యోగులు, సిద్దులు ఒక్కొక్క నిర్ధిష్ట కార్యం కోసం భూమిపై అవతరించారు. ఆ కోవకు చెందిన వారే సొరకాయల స్వామి. అవధూత రూపంలో జన్మించిన సొరకాయల స్వామి జీవ సమాధి అయిన ఆలయానికి ఎంతో ప్రత్యేకత ఉంది. ఇక్కడకు వచ్చి మొక్కుకున్న తర్వాత కోర్కెలు తీరిన భక్తులు స్వామివారికి సొరకాయలను ముడుపుగా కట్టడం ఆచారంగా వస్తోంది.

తిరుపతి జిల్లాలోని ఆంధ్ర – తమిళనాడు సరిహద్దులో గల నారాయణవనంలో సొరకాయల స్వామి ఆలయం కొలువై ఉంది. 1700లో జన్మించిన స్వామివారు 1902లో శ్రావణమాసం గరుడపంచమి నాడు జీవ సమాధి పొందారు. ఆయన 202 ఏళ్లు బ్రతికినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. మద్రాసులో కొన్నాళ్ళు పాటు సంచరించిన ఆయన… తర్వాత తిరుమల శ్రీ వేంకటేశ్వరుడి దర్శనార్ధం తిరుమలకు వచ్చి… పద్మావతి, శ్రీవారి వివాహమైన పవిత్రమైన చోటైన నారాయణవనంలో స్ధిరపడినట్లు తెలుస్తోంది. సొరకాయల స్వామి వారు జీవ సమాధి అయి నేటికి 121 ఏళ్ళు గడుస్తున్నా భక్తులు అంతే భక్తి శ్రద్ధలతో ఆయన్ని కొలుస్తుంటారు.

నారాయణవనంలో స్ధిరపడిన తర్వాత ఓ ఎండిన సొరకాయ డొప్పను భుజానికి తగిలించుకుని, తనతో పాటుగా  కొన్ని శునకాలతో ఊరూరూ సంచరించేవారట. ఆ సొరకాయ డొప్పనే పాత్రగా చేసుకుని భిక్షాటన చేసేవారట. ఊరు పేరు తెలియని స్వామి కావడం.. సొరకాయను భుజంపై వేసుకుని తిరగడం ద్వారా అందరూ ఆయన్ని సొరకాయల స్వామి అని పిలుచేవారు. చివరికి ఆ పేరే ఆయనకు స్థిరపడిపోయింది.

సొరకాయ స్వామి భిక్షాటన చేస్తూ తిరుగుతున్న సమయంలో అనారోగ్యంతో భాదపడుతున్న వారికి తన వెంట తెచ్చిన బూడిద, పసుపు, వేప, మరికొన్ని ఔషధాలతో జబ్బును నయం చేసేవారట. దీంతో ప్రజలు ఆయన్ని వైద్యుడిగా చూసేవారు. ఆ కాలంలో నారాయణవనం ప్రాంతంలో చేతబడులు, క్షుద్ర పూజలు అధికంగా జరిగేవి. వాటితో అనేక మంది ఇబ్బందులు పడుతున్న సమయంలో స్వామివారు క్షుద్ర ప్రయోగాలను నిర్వీర్వం చేసి ప్రజలను రక్షించేవారు. 1902లో సొరకాయల స్వామి జీవ సమాధి కావడంతో ఆ ప్రాంతంలోనే భక్తులు ఆయనకు ఆలయం కట్టి పూజిస్తున్నారు. సొరకాయలస్వామి జీవ సమాధి అవుతున్న సమయంలో ఆయనే స్వయంగా ధునిని వెలిగించారు. అప్పటి నుంచి ఇప్పటివరకు ఆలయంలో జీవసమాధికి అభిముఖంగా అగ్నిగుండం అఖండ జ్యోతిలా వెలుగుతూనే ఉండటం ఇక్కడి విశిష్టత.

సొరకాయల స్వామి జీవసమాధికి పైభాగంలో ప్రతిష్టించిన స్వామి విగ్రహానికి అమావాస్య, పౌర్ణమి దినాల్లో ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆ సమయంలో స్వామిని దర్శించుకునేందుకు ఆంధ్రా, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. కోర్కెలు తీరిన భక్తులు స్వామివారికి ముడుపుగా సొరకాయలు కడతారు. అలా భక్తులు కట్టిన సొరకాయలతో ఈ ఆలయం ప్రత్యేకతను సంతరించుకుంటోంది. అదేవిధంగా స్వామివారు జీవించి ఉన్న సమయంలో ఉపయోగించిన సొరకాయ బుర్ర, పాదరక్షలు, వస్త్రాలు, ఇత్తడి బిందె, కట్టెలకు ఉపయోగించిన గొడ్డలి, కత్తి, శునకాల కట్టేందుకు ఉపయోగించిన తాళ్లు, స్వామివారు ఉపయోగించిన దూది వస్త్రాలు వంటివి ఆలయంలో నేటికీ భక్తులు దర్శించవచ్చు.

Share This Article
Leave a comment