నారదుడి కోసం వెలసిన భావనారాయణుడు.. 5వేల ఏళ్ల చరిత్ర

Telugu BOX Office

దేవతలు స్వయంభువుగా కొలువుదీరిన ఆలయాలు కొన్నయితే… భక్తులు ప్రతిష్ఠించేవి కొన్ని. కానీ ఈ భావనారాయణస్వామి ఆలయంలో మాత్రం విష్ణుమూర్తి స్వయంభువు విగ్రహంగానే కాకుండా నారదుడూ, అనంతుడూ ప్రతిష్ఠించిన మరో రెండు రూపాల్లోనూ కనిపిస్తాడు. అందుకే ఈ ఆలయాన్ని దర్శించే భక్తులకు 108 విష్ణుమూర్తి క్షేత్రాలను చూసిన పుణ్యం కలుగుతుందని ప్రతీతి. 5 వేల సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ ఆలయంలో ఎక్కడా లేనివిధంగా విష్ణుమూర్తి గరుడవాహనంపైనా దర్శనమివ్వడం విశేషం.

తెలుగు రాష్ట్రాల్లో భావనారాయణస్వామి ఆలయాలు… పంచభావనారాయణ క్షేత్రాలుగా భాసిల్లుతుంటే.. వాటిల్లో కాకినాడ సమీపంలోని సర్పవరం క్షేత్రం మహిమాన్వితమైనదిగా పేర్కొంటారు. నారద క్షేత్రంగానూ పిలిచే ఈ ఆలయంలో రాజ్యలక్ష్మీ సమేతంగా కొలువుదీరిన స్వామి రూపంతో పాటు, స్వయంభువుగా వెలసిన… అనంతుడనే సర్పం ప్రతిష్ఠించిన విగ్రహాలు మరో రెండు ఉంటాయి. ఇక గరుడవాహనంపైన కొలువైన స్వామి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుందనీ ఈ మూర్తిని పాతాళ భావనారాయణుడిగా పూజిస్తారనీ చెబుతారు.

స్థల పురాణం
ఒకప్పుడు అనంతుడనే సర్పం ఇక్కడ తపస్సు చేయడం వల్ల ఈ ప్రాంతానికి సర్పవరం అనే పేరు వచ్చిందట. ఇక, బ్రహ్మవైవర్త పురాణం, కాశీఖండం, భీమఖండంలో స్వామి ఆవిర్భావానికి సంబంధించిన కథలు ఉన్నాయి. ఓ సారి భూలోక సంచారానికి వెళ్లిన నారదుడు అక్కడున్న సరస్సులో పవిత్ర స్నానం ఆచరించేందుకు దిగి ఆ తరువాత స్త్రీగా మారిపోయాడట. సరిగ్గా ఆ సమయంలో అక్కడికి వచ్చిన పిఠాపురం మహారాజు స్త్రీ రూపంలో ఉన్న నారదుడిని చూసి మోహించి వివాహం చేసుకుంటాడు. కొన్నాళ్లకు ఆ జంటకు అరవైమంది సంతానం కలిగినా ఓ యుద్ధంలో పిఠాపురం మహారాజుతో పాటూ ఆ సంతానమూ చనిపోయారట. ఆ పుత్ర శోకంతో నారదుడు బాధపడుతున్నప్పుడు మహావిష్ణువు వచ్చి.. ఎడమచేతిని తడపకుండా సరస్సులో స్నానమాచరించమని ఆదేశించాడట. స్వామి చెప్పినట్లు చేయగానే నారదుడు తన పూర్వరూపాన్ని పొందినా వామ హస్తం మాత్రం గాజులతోనే ఉంటుంది. దాంతో మళ్లీ స్వామి కోసం తపస్సు చేయడంతో… శ్రీమన్నారాయణుడు భావనారాయణుడి రూపంలో దర్శనమిచ్చి నారదుడిని అనుగ్రహించి అనంతరం ఇక్కడ స్వయంభువుగా కొలువుదీరాడని ప్రతీతి.

ఆ తరువాత నారదుడు రాజ్యలక్ష్మీ సమేతంగా స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడట. అలాగే అనంతుడు అనే సర్పం మోక్ష ప్రాప్తికై ఘోర తపస్సు చేసి స్వామి అనుగ్రహం పొంది ఆ తరువాత విష్ణుమూర్తి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లుగా చెబుతారు. అలా ఇక్కడ శ్రీమన్నారాయణుడు స్వయంభువుగా కొలువు దీరడంతోపాటూ…నారద మహర్షి, అనంతుడు ప్రతిష్ఠించిన విగ్రహాలూ ఉంటాయి.


గర్భాలయంలో స్వామి చతుర్భుజుడిగా.. రాజ్యలక్ష్మీ సమేతంగా భక్తులకు దర్శనమిస్తాడు. ఇక్కడ రోజువారీ చేసే పూజలతోపాటూ మాఘమాసంలో వచ్చే ఆదివారాల్లో స్వామిని పూజించేందుకు ప్రాధాన్యం ఇస్తారు. ముఖ్యంగా మాఘమాసంలో వచ్చే మూడో ఆదివారం నాడు తెలుగు రాష్ట్రాలతోపాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు వేల సంఖ్యలో ఆలయానికి చేరుకుని ఆవు పిడకలతో వేసిన మంటపైన ప్రసాదాలు వండి స్వామికి నివేదిస్తారు. అలాగే స్వామికి గోధుమలు, పటిక బెల్లాన్ని సమర్పించి పన్నెండు ప్రదక్షిణలు చేసి ఏది మొక్కుకున్నా అది నెరవేరుతుందని భక్తుల నమ్మకం. భావనారాయణస్వామిదీ, సూర్యుడిదీ జన్మ నక్షత్రం ఒకటే కావడం వల్ల రథసప్తమి సమయంలోనూ విశేషమైన పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారు. వైశాఖ మాసంలో స్వామివారికి ఏడు రోజులపాటు జరిపే బ్రహ్మోత్సవాలనూ ప్రతి పౌర్ణమికీ నిర్వహించే సుదర్శన హోమాన్నీ చూసేందుకు రెండు కళ్లూ చాలవు. ఈ ఆలయ ప్రాంగణంలోనే కనిపించే నారదుడు, గోపాలకృష్ణుడి విగ్రహాలు భక్తుల్ని ఆకట్టుకుంటాయి.

ఎలా వెళ్లాలంటే
విమానం ద్వారా రావాలనుకునే భక్తులు వైజాగ్‌ విమానాశ్రయంలో దిగితే… అక్కడినుంచి ఆలయానికి వెళ్లేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ ఉంటాయి. రైల్లో వచ్చేవారు కాకినాడ రైల్వేస్టేషన్‌లో దిగితే అక్కడినుంచి ఆలయం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే బస్సుల్లో రావాలనుకునే భక్తులు.. కాకినాడ మీదుగా ఆలయానికి చేరుకోవచ్చు.

Share This Article
Leave a comment