అరుదైన పుణ్యక్షేత్రం.. అరసవిల్లి సూర్య దేవాలయం

Telugu BOX Office

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నో ప్రాచీన దేవాలయాలు ఉన్నాయి. వెంకటేశ్వర స్వామికి సంబంధించి తిరుపతి, మహాశివుడికి సంబంధించి శ్రీ కాళహస్తి, శ్రీ శైలం, వినాయకుడికి సంబంధించి కాణిపాకం, అమ్మవారికి సంబంధించి విజయవాడ కనకదుర్గ ఆలయం.. ఇలా ప్రతి దైవానికి సంబంధించి దేశంలోనే అత్యంత ప్రసిద్ధమైన ప్రాచీన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. వీటితో పాటు సమస్తలోకాలకు వెలుగును ప్రసాదించే సూర్యభగవానుడి అరుదైన ఆలయం కూడా ఒకటి ఇక్కడ ఉంది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ఏకైక ప్రాచీన సూర్యభగవానుడి ఆలయంగా, దేశంలోని అరుదైన సూర్యభగవానుడి ఆలయాల్లో ప్రముఖమైనదిగా ప్రసిద్ధి చెందింది.

ఆలయ విశిష్టత:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా శ్రీకాకుళం పట్టణానికి 2.5 కిలోమీటర్ల దూరంలో అరసవల్లిలో శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఉంది. ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఆరాధ్య దైవంగా ఇక్కడి సూర్య భగవానున్ని పూజిస్తారు. ఈ ఆలయానికి రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా దేశంలోని అనేక ప్రాంతాల నుంచి భక్తులు వస్తుంటారు. ఈ సూర్య నారాయణ స్వామి ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది.

అరసవల్లి సూర్య భగవానుడి పుణ్య క్షేత్రం ఏంతో విశిష్టమైనది. ఈ ఆలయాన్ని కళింగ రాజు దేవేంద్ర వర్మ క్రీ.శ 673 సంవత్సరంలో నిర్మించారు. ఏటా సంవత్సరంలో రెండు సార్లు మూడు రోజుల చొప్పున గాలి గోపురాన్ని దాటి ధ్వజ స్తంబాన్ని తాకుతూ గర్భాలయంలో ఉండే మూల విరాట్ పై సూర్య కిరణాలు పడతాయి. ఇదే ఇక్కడ చెప్పుకోదగ్గ మహిమ. ఈ కిరణాలు ప్రతి సంవత్సరం మార్చి 9,10, 11 తేదీల్లో ఒకసారి.. అక్టోబర్ 1,2,3 తేదీల్లో మరొకసారి అరసవెల్లిలో సూర్య దేవుణ్ణి భానుడి కిరణాలు తాకుతాయి. ఉదయం 6 గంటలకు గాలి గోపురం మీదుగా వచ్చే సూర్య కిరణాలు ధ్వజ స్తంభాన్ని తాకుతూ మూల విరాట్ పై పడతాయి. అరుణ శిలతో చెక్కిన ఈ విగ్రహం సూర్య కిరణాలు పడగానే బంగారు ఛాయలో మెరుస్తాయి. ఇలా సూర్య కిరణాలు మూల విరాట్ ను తాకడం భగవంతుని లీలగా భావిస్తారు. . ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు భక్తులు అశేషంగా తరలివస్తారు. ఈ అపురూపమైన దృశ్యాన్ని తిలకిస్తే అన్నీ పాపాలు తొలగిపోతాయనే నమ్మకం ఉంది.

వైభవంగా రధసప్తమి వేడుకలు:
అరసవిల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి వారికి రధసప్తమి వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఈ రోజు కోసం భక్తులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తుంటారు. వేద పండితులు స్వామి వారికి వేద మంత్రోచ్ఛారణల నడుమ మంగళధ్వనులతో మహాక్షీరాభిషేక సేవను నిర్వహిస్తారు. అరసవల్లి సూర్యభగవానుడికి విశేషమైన పర్వదినం ఇది. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు, ఆదిత్యుని దర్శనం చేసుకునేందుకు లక్షలాది సంఖ్యలో రాష్ట్ర నలుమూల నుంచి భక్తులు తండోప తండాలుగా తరలివస్తారు.

Share This Article
Leave a comment