ఆంధ్రా శబరిమల.. ద్వారపూడి అయ్యప్ప ఆలయం

Telugu BOX Office

అయ్యప్పస్వామి దేవాలయం అంటే అందరికీ టక్కున గుర్తొచ్చేది కేరళలోని శబరిమల. ఏడాదిలో కొద్దిరోజులు మాత్రమే తెరచి ఉంచే ఈ ఆలయానికి ఆ సమయంలో దేశంలోని చాలా ప్రాంతాల నుంచి దీక్ష పూనిన అయ్యప్పస్వాములు లక్షలాదిగా తరలిరావడం అందరికీ తెలిసిందే. అయితే ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లోనూ ఓ అయ్యప్పస్వామి ఆలయం ఉంది. తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రికి సమీపంలో ద్వారపూడిలో ఉన్న ఈ అయ్యప్పస్వామి క్షేత్రానికి భక్తులు తరలి వస్తుంటారు. అంతేకాదు కేరళలోని శబరిమల క్షేత్రానికి వెళ్లలేని వారు అందుకు ప్రత్యామ్నాయంగా ద్వారపూడి క్షేత్రానికి వచ్చి తమ దీక్షను విరమించడం గమనార్హం.

ఒకప్పుడు సాధారణ గ్రామంగానే అందరికీ తెలిసిన ద్వారపూడి తర్వాత కాలంలో అయ్యప్పస్వామి దివ్యక్షేత్రంగా దినదినాభివృద్ధి చెందింది. సువిశాలమైన ప్రాంగణంలో నిర్మించిన ఈ ఆలయం చుట్టూ పరిహరాదుల దేవాలయాలతో పాటు మరెన్నో దేవాలయాలు కూడా ఉన్నాయి. అంతేకాకుండా ఇక్కడి అయ్యప్పస్వామివారి దేవాలయానికి ఉన్న పద్దెనిమిది మెట్లను తమిళనాడు నుంచి తెప్పించిన ఏకశిలపై నిర్మించడం విశేషం. కేరళలోని శబరిమల ఆలయాన్ని ఎంత భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారో ద్వారపూడిలోని క్షేత్రాన్ని కూడా అదే భక్తి ప్రవత్తులతో నిర్వహిస్తారు. అందుకే శబరిమలకు వెళ్ళలేని భక్తులు ఇరుముడి కట్టుకుని ద్వారపూడి క్షేత్రాన్నికి వెళ్ళి దర్శించుకుంటారు.

అయ్యప్ప దేవాలయంలో క్రింది భాగంలో వర్తులాకార హాలులో దుర్గ, సాయిబాబా, రాఘవేంద్ర స్వామి, వివేకానంద, రామకృష్ణ పరమహంస, వేమన వగైరా గురువర్యుల విగ్రహాలు చుట్టూ వున్నాయి. పై అంతస్తులో హరిహర సుతుడైన అయ్యప్ప స్వామి నిత్య పూజలందుకుంటున్నాడు. అయ్యప్ప స్వామి ఆలయంలోంచి ప్రక్కనే వున్న సాయిబాబా ఆలయానికి త్రోవ వున్నది. బాబా దర్శనమైనాక వెనుక వైపు వెళ్తే శయనించివున్న పెద్ద రంగనాధ స్వామి విగ్రహం కనబడుతుంది. ఆస్వామిని సేవించుకుని బయటకు వస్తే ఆ మార్గం ఎత్తుగా వున్న పెద్ద నందీశ్వరుని దగ్గరకు తీసుకు వెళ్తుంది. నందీశ్వరునికి ఎదురుగా పాలరాతితో నిర్మించబడిన నాలుగంతస్తుల శ్రీ ఉమా విశ్వేశ్వరస్వామి ఆలయం దర్శించుకోవచ్చు

ఈ ఆలయానికీ చాలా విశేషతలున్నాయి. ఇక్కడి శివ లింగం చాలా పొడుగ్గా పై అంతస్తు దాకా వుంటుంది. అమ్మవారు అఖిలాండేశ్వరి. అంతేకాదు .. గంగోత్రి, యమునోత్రి, కేదారనాధ్, బదరీనాధ్, బ్రహ్మకపాలం, అమరనాధ్, ఓంకార్, కాశీ, ఋషికేశ్, హరిద్వార్ మొదలగు క్షేత్రాలనుంచి తెచ్చిన 18 శివలింగాలను అన్ని అంతస్తులలో ప్రతిష్టించారు. పై అంతస్తులోని చతుర్మఖ శివలింగానికి అభిషేకం చేస్తే ఒకేసారి ఈ 18 శివలింగాలపై ఆ అభిషేక ద్రవ్యాలు పడి కన్నుల పండుగగా గోచరిస్తుంది. శివాలయం ముందు పెద్ద ఆంజనేయస్వామి, నటరాజు విగ్రహాలున్నాయి. అయ్యప్ప దేవాలయానికి ఈశాన్యంగా భూగర్భ ద్వాదశ జ్యోతిర్లింగ దేవాలయం వున్నది. ఇక్కడ వెండి శివలింగాన్ని ప్రతిష్టించారు. ఈ ఆలయ ప్రవేశానికి భక్తులు సంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలి.

1969లో తమిళనాడుకు చెందిన ఎస్.ఎల్. కనకరాజు అనే వ్యక్తి వస్త్ర వ్యాపారం నిమిత్తం ద్వారపూడి వచ్చి స్ధిర పడ్డారు. ఆయన అయ్యప్పస్వామికి మొక్కుకున్న ఫలితంగా తనకి కొడుకు పుట్టాడని సంతోషంతో ఇక్కడ అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సంకల్పించారు. ఆయన సంకల్పానికి భక్తులూ, దాతలూ ఇచ్చిన విరాళాలు తోడుకావడంతో 1983 లో ఆలయ శంకు స్ధాపన జరిగింది. అయ్యప్ప విగ్రహాన్ని 1989 లో కంచి కామకోటి పీఠాధిపతి అయిన జయేంద్ర సరస్వతి ప్రతిష్టింపజేశారు. అతి విశాలమైన ప్రాంగణంలో ప్రకృతి అందచందాలతో పోటీపడుతూ ఆకర్షణీయంగా వున్న ఈ దేవాలయ సమూహం చూసి తీరవలసిందే. అయ్యప్ప దీక్ష తీసుకున్నవారిలో కొందరు కారణాంతరాలవల్ల శబరిమలదాకా వెళ్ళి స్వామి దర్శనం చెయ్యలేకపోవచ్చు. అలాంటివారు ఇక్కడికి వచ్చి స్వామికి ఇరుముడి సమర్పించుకుంటారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలనుంచేకాక ఒరిస్సానుండి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఇక్కడికి వస్తారు.

Share This Article
Leave a comment