ఈ అంజన్నకు సోమవారం ప్రీతి.. ఆ రోజు ఊళ్లో వంట చేయరు

Telugu BOX Office


సాధారణంగా హిందూ ఆలయాలకు వచ్చే భక్తులకు ప్రసాదాలు పెట్టడం, ప్రత్యేక పర్వదినాల్లో అన్నదానాలు చేయడం మామూలే. కానీ… ఈ అంజన్న ఆలయంలో మాత్రం ప్రతి సోమవారం పెద్ద ఎత్తున అన్నదానం జరుగుతుంది. ఆ రోజున ఊరి జనంతో కలిపి సుమారు పదివేలమంది భక్తులు అక్కడే భోజనం చేసి స్వామి సేవలో తరిస్తారు. ఈ స్వామిని పూజిస్తే… అనుకున్న పనులు నెరవేరతాయని ఓ నమ్మకం.

సుమారు 500 సంవత్సరాల క్రితమే ఈ ప్రాంతంలో ఓ ఆలయం ఉంటే… అక్కడ శివుడినీ, హనుమంతుడినీ పూజించేవారట. కాలక్రమంలో ముస్లిం పాలకుల వల్ల ఆలయం కొంతవరకూ ధ్వంసం కావడంతోపాటూ ఊరివాళ్లూ విగ్రహారాధనను నిర్లక్ష్యం చేశారట. కొన్నాళ్లకు మారుతి సోమానే అనే బ్రహ్మచారికి స్వామి కలలో కనిపించి తనను ఆలయంలో నిర్బంధించారని చెప్పి, గుడి గోపురాన్ని తొలగించి పునాదిపైనే పునఃప్రతిష్ఠించి మునుపటిలా పూజలు చేయాలనీ… మహిళలకు ప్రవేశం కల్పించొద్దనీ కోరాడట. ఇలా స్వామి పలుమార్లు కలలో కనిపించి చెప్పినా… ఎవరూ నమ్మరనే ఉద్దేశంతో ఆ భక్తుడు మౌనం వహించాడట. కొన్నాళ్లకు గ్రామంలో కరవు కాటకాలు మొదలవడం, కొందరు పాముకాటుతో మృత్యువాత పడటం వంటి సమస్యలు తలెత్తడంతో ఆ బ్రహ్మచారి తనకు వచ్చిన కలను ఊరిపెద్దలకు చెప్పాడట. దాంతో అంతా కలిసి పండితుల్ని సంప్రదించి… ఆలయం పైకప్పు రేకులను తొలగించి మునుపటిలా ఆరాధించడం మొదలుపెట్టారట. అప్పటినుంచీ గ్రామంలో సమస్యలు తగ్గాయనీ అలా స్వామిని రోక్డాబాగా పిలవడం ప్రారంభించారనీ క్రమంగా ఆ పేరే రోక్డేశ్వర్‌గా మారిందనీ ఒక కథనం.

ఇప్పటికీ మహిళలెవరూ స్వామి కొలువైన పీఠం దగ్గరకు వెళ్లకుండా… బయటి నుంచే పూజిస్తారు. ఒకవేళ ఎవరైనా మాంసం, మద్యం సేవించి ఆలయంలోకి వచ్చినా, తెలిసీ తెలియక మహిళలు ప్రవేశించినా స్వామి అలిగి, గోదావరి నది ఒడ్డుకు వెళ్లిపోతాడని నమ్ముతారు భక్తులు. ఆ సమయంలో వంటలు చేసినా సరిగ్గా కుదరవనీ ఊళ్లో ఏదో ఒక సమస్య మొదలవుతుందని స్థానికులు చెబుతారు. అలిగిన స్వామిని మళ్లీ ఆలయంలోకి ఆహ్వానించేందుకు ఓ గుర్రాన్ని గోదావరికి తీసుకెళ్లి శుభ్రం చేసి అలంకరించి పూజలు నిర్వహించి వదిలేస్తారు. అలా వదిలిన గుర్రం ఎవరి ప్రమేయం లేకుండా తిరిగి ఆలయ ప్రాంగణంలోకి ప్రవేశిస్తే స్వామి మళ్లీ మందిరంలోకి చేరాడని భావిస్తారు.

చిన్న గ్రామంలో.. ఊరి మధ్యలో బహిరంగ ప్రదేశంలో ఓ పీఠంపైన కొలువుదీరి రోక్డేశ్వర్‌గా పూజలు అందుకుంటున్న ఈ హనుమంతుడికి ఆపదలను తొలగించే ఆపద్బాంధవుడని పేరు. స్వామి శుభదృష్టి పడితే కష్టాలు తొలగిపోతాయని నమ్మే భక్తులు… ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు చెప్పుల్లేకుండా కిలోమీటర్లకొద్దీ నడిచి మరీ వస్తారు. సాధారణంగా హనుమంతుడిని మంగళవారం లేదా శనివారం కొలిస్తే… ఇక్కడ మాత్రం సోమవారం పూజిస్తారు. ఆ రోజున నిర్వహించే అన్నదానాన్ని స్వీకరించేందుకు ఆ ఊరివాళ్లే కాదు… వివిధ ప్రాంతాల నుంచి ఎంతోమంది భక్తులు తరలివస్తారు. ఆ రోజున… ఇక్కడెవరూ వంటచేయరు సరికదా వ్యక్తిగత పనులనూ మానేసి స్వామి సేవలోనే తరిస్తారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న ఈ ఆలయం నిర్మల్‌ జిల్లా సరిహద్దు, మహారాష్ట్ర బిలోలి తాలూకా ధర్మాబాద్‌ సమీపంలోని పాటోదా(బి)లో ఉంది.

ఎలా వెళ్లాలంటే…
హైదరాబాద్‌, నిజామాబాద్‌, నాందేడ్‌ల నుంచి ధర్మాబాద్‌ వరకూ రైలు సౌకర్యం ఉంటుంది. అక్కడి నుంచి నర్సి మార్గంలో రహదారిని ఆనుకుని 18కిలోమీటర్ల దూరంలోని పాటోదా(బి) రోక్డేశ్వర్‌ గ్రామాన్ని చేరుకునేందుకు బస్సులూ, ప్రైవేటు వాహనాలూ అందుబాటులో ఉంటాయి.

Share This Article
Leave a comment