Former Minister Seediri Appalaraju Arrested: హిట్ అండ్ రన్ కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు ఎట్టకేలకు అరెస్టు చేశారు. బైక్‌తో ఢీకొట్టి ఒక వ్యక్తి మరణానికి కారణమైన కేసు నుంచి తన కుమారుడిని రక్షించేందుకు, వేరొకరిపై ఆ నేరాన్ని తోసేసి బలిపశువును చేసేందుకు కుట్ర పన్నారనే ఆరోపణలపై ఆయనను అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో మాజీ మంత్రిపై ఏ3 (A3)గా కేసు నమోదు చేసిన పోలీసులు, శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం ఈ చర్యలు చేపట్టారు.

పోలీసులు తనను అరెస్టు చేయడానికి వస్తున్నారనే సమాచారం ముందే అందడంతో, అప్పలరాజు తన నివాసంలో తలుపులు వేసుకుని న్యాయవాదులు, కుటుంబ సభ్యులతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. అరెస్ట్ వార్త తెలుసుకున్న వైసీపీ శ్రేణులు, అనుచరులు పెద్ద సంఖ్యలో ఆయన ఇంటి వద్దకు చేరుకున్నారు. అదనపు ఎస్పీ కేవీ రమణ, శ్రీకాకుళం డీఎస్పీ వివేకానంద నేతృత్వంలోని పోలీసు బృందం లోపలికి వెళ్లి ఆయనను బయటకు తీసుకువచ్చే క్రమంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
అప్పలరాజును పోలీసు వాహనం ఎక్కించకుండా కార్యకర్తలు తీవ్రంగా అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు, అనుచరులకు మధ్య భారీ తోపులాట జరిగింది. మాజీ మంత్రిని కార్యకర్తలు ఒక్కసారిగా తమ భుజాలపైకి ఎత్తుకుని హడావుడి చేస్తూ, మళ్లీ ఇంట్లోకి తీసుకెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అప్రమత్తమై ఆయనను కారులోకి ఎక్కించారు. అనంతరం రోప్ పార్టీ సాయంతో కార్యకర్తలను పక్కకు తప్పిస్తూ, రాత్రి 7.30 గంటల సమయానికి ఆయనను కాశీబుగ్గ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కాగా, కూటమి ప్రభుత్వం కావాలని తప్పుడు కేసులతో తనను అరెస్టు చేస్తోందని, ఇలాంటి వాటికి తాము భయపడేది లేదని ఈ సందర్భంగా అప్పలరాజు వ్యాఖ్యానించారు. మరోవైపు, బైక్ ఢీకొని గొర్రెల కాపరి దానయ్య మృతి చెందిన కేసులో అప్పలరాజు కుమారుడు ఆరవ్ వర్మ దాఖలు చేసిన రెగ్యులర్, తాత్కాలిక బెయిల్ పిటిషన్లను సోంపేట ఆరో అదనపు జిల్లా జడ్జి కోడూరు కిశోర్ బాబు తిరస్కరించారు.. ఇక మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను న్యాయస్థానం గురువారానికి వాయిదా వేసింది.
