తిరుప్పార్‌కడల్‌: శివలింగంపై శ్రీనివాసుడి అభయం.. చిత్రగుప్తుడే పాపాలు తొలగించే క్షేత్రం

Telugu BOX Office

తమిళనాడులోని చెన్నై-రాణిపేట జిల్లా వాలాజాపేట సమీపంలో ఉన్న ‘తిరుప్పార్‌కడల్‌’ ఒక అత్యంత అరుదైన ఆధ్యాత్మిక క్షేత్రం. సాధారణంగా ఏ ఆలయంలోనైనా ఒకే ప్రధాన దైవం దర్శనమిస్తారు. కానీ, తిరుప్పార్‌కడల్‌లో కొలువైన ప్రసన్న వేంకటేశ పెరుమాళ్, ఆయనకు కేవలం రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగనాథస్వామి ఆలయాలను కలిపి దర్శించుకుంటేనే ఆధ్యాత్మిక యాత్ర పూర్తవుతుందని విశ్వసిస్తారు. విజయనగర రాజుల పోషణలో విలసిల్లిన ఈ రెండు క్షేత్రాలు భక్తులకు అభయాన్ని, పాప ప్రక్షాళనను అందిస్తున్నాయి.

శివలింగంపై శ్రీనివాసుడు

సాధారణంగా శ్రీ వేంకటేశ్వరస్వామి పద్మపీఠంపై నిలబడి భక్తులకు దర్శనమిస్తుంటారు. కానీ, తిరుప్పార్‌కడల్‌లోని ప్రసన్న వేంకటేశ పెరుమాళ్ ఆలయంలో స్వామివారు శివలింగంపై నిలబడి పూజలందుకోవడం ఈ క్షేత్ర ప్రత్యేకత. హరి (విష్ణువు), హరుడు (శివుడు) ఒకటే అని చాటిచెప్పే ఈ దృశ్యం భక్తులను మైమరిపిస్తుంది.

స్థల పురాణం

పూర్వం పుండరీకుడు అనే పరమ వైష్ణవ మహర్షి బ్రహ్మదేవుడి యాగానికి వెళ్లి వస్తూ ఈ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడ ఉన్న ఆలయంలో తన ఇష్టదైవమైన విష్ణుమూర్తిని దర్శించుకోవాలని గర్భగుడిలోకి వెళ్లగా, అక్కడ శివలింగం మాత్రమే కనిపించింది. దాంతో తీవ్ర నిరాశతో మహర్షి వెనుదిరిగాడు. మహర్షి నిష్టను పరీక్షించిన శ్రీమన్నారాయణుడు ఒక వృద్ధుడి రూపంలో వచ్చి, ఆ గర్భగుడిలో విష్ణుమూర్తే ఉన్నాడని చెప్పి మళ్లీ ఆలయంలోనికి తీసుకెళ్లాడు. మహర్షి లోపలికి వెళ్లి చూడగా, శ్రీమన్నారాయణుడు అభయముద్రతో శివలింగంపై నిలబడి ప్రసన్న వేంకటేశ్వరుడిగా దర్శనమిచ్చాడు. నాటి నుంచి స్వామివారు ‘ప్రసన్న వేంకటేశ పెరుమాళ్’గా పూజలందుకుంటున్నారు.

ఆలయ ప్రాశస్త్యం & నిర్మాణం

ఈ ఆలయ నిర్మాణ కాలంపై స్పష్టమైన ఆధారాలు లేనప్పటికీ, విజయనగర సామ్రాజ్య చక్రవర్తులు ఈ క్షేత్రాన్ని పునర్నిర్మించి అభివృద్ధి చేశారని చరిత్ర చెబుతోంది. ప్రధాన ఆలయంలో శ్రీనివాసుడితో పాటు అలమేలుమంగ తాయారు, ఆంజనేయస్వామి, గరుడాళ్వార్, రుక్మిణి, సత్యభామల ఉపాలయాలు ఉన్నాయి. గర్భగుడిపై ఉన్న పుండరీక విమాన గోపురం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఈ గోపురానికి దక్షిణం వైపు దక్షిణామూర్తి, పశ్చిమాన లక్ష్మీనరసింహస్వామి, ఉత్తరాన బ్రహ్మదేవుడు, తూర్పున గజేంద్రుడు కొలువుదీరి ఉన్నారు.

 సరస్వతీదేవి ఆగ్రహం – విష్ణువు అడ్డుకట్ట

 వేంకటేశ పెరుమాళ్ ఆలయానికి రెండు కిలోమీటర్ల దూరంలో స్వయంభువుగా వెలసిన రంగనాథస్వామి ఆలయం ఉంది. ఇక్కడి విగ్రహం ఒక అరుదైన మేడిపండు వృక్షం చెక్కతో రూపుదిద్దుకోవడం విశేషం. స్వామివారు ఆదిశేషుడిపై శయనించి, దక్షిణ దిశను చూస్తున్న భంగిమలో దర్శనమిస్తారు. బ్రహ్మదేవుడు తనను కాదని యాగం తలపెట్టడంతో ఆగ్రహించిన సరస్వతీదేవి ‘వేగావతి’ నదిగా మారి ఆ యాగాన్ని ముంచెత్తేందుకు ఉద్ధృతంగా ప్రవహించింది. బ్రహ్మ యాగాన్ని కాపాడేందుకు శ్రీమన్నారాయణుడు నదీ ప్రవాహానికి అడ్డుగా శయన భంగిమలో పడుకుని ప్రవాహాన్ని అడ్డుకున్నాడని, ఆ తర్వాత ఇక్కడే రంగనాథుడిగా స్థిరపడ్డాడని క్షేత్ర పురాణం చెబుతోంది.

చిత్రగుప్తుడికి రోగనివారణ – భక్తులకు వరప్రధానం

యమధర్మరాజు సహాయకుడైన చిత్రగుప్తుడు తీవ్రమైన అనారోగ్యానికి గురైనప్పుడు ఈ రంగనాథుడిని పూజించి నయం చేసుకున్నాడని నమ్ముతారు. దానికి కృతజ్ఞతగా, “ఎవరైతే తిరుప్పార్‌కడల్‌లో వేంకటేశ్వరుడితో పాటు రంగనాథుడిని కూడా దర్శించుకుంటారో, వారి పాపాలను తన చిట్టా నుంచి తొలగిస్తానని” చిత్రగుప్తుడు స్వామివారికి విన్నవించుకున్నాడట. అందుకే ఈ రెండు ఆలయాలను దర్శిస్తే అనారోగ్యాలు నశించి, సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం.

ఎలా చేరుకోవాలి?

  • విమాన మార్గం: చెన్నై అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వేలూరు వైపు ప్రయాణించి, కావేరీపాక్కం మీదుగా తిరుప్పార్‌కడల్‌ చేరుకోవచ్చు.
  • రైలు మార్గం: వాలాజాపేట జంక్షన్లో దిగితే, అక్కడి నుంచి ఆలయాలు కేవలం 4 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి.
  • ప్రత్యేక ఉత్సవాలు: ఏడాది పొడవునా విశేష పూజలు జరిగినప్పటికీ, వైకుంఠ ఏకాదశి పర్వదినాన ఈ క్షేత్రానికి భక్తులు పోటెత్తుతారు.
Share This Article
Leave a Comment