అందరివాడు అయినవిల్లి వినాయకుడు

Telugu BOX Office

డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణానికి కేవలం 12కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయినవిల్లి శ్రీసిద్ది వినాయక క్షేత్రం. ఈ ఆలయం చూడటానికి చిన్నగానే ఉంటుంది గానీ ప్రాముఖ్యం మాత్రం చిన్నది కాదు. అతి ప్రాచీన ఆలయంగా అద్భుతమైన పంచాయతనంగా అభీష్టసిద్ధి ప్రసాదించే సిద్ధి వినాయకుడి నిలయంగా అయినవిల్లి క్షేత్రం భక్తులకు సందర్శనీయం, ఆ దర్శనం సంతోషదాయకంగా ఉంది.

అయినవిల్లి సిద్ధి వినాయక క్షేత్రాన్ని కాశీలాంటి క్షేత్రం అని అంటారు. ఎక్కడో ఉన్న కాశీకి ఇక్కడ కోనసీమలో ఉన్న అయినవిల్లికి సంబంధం ఏమిటీ అని ఎవరైనా అనుకోవచ్చు. కాశీలో మాదిరిగానే ఇక్కడ పంచాయతనంగా కొలువుతీరారు దేవతలు. కాణిపాకం లాంటి ప్రముఖ వినాయక క్షేత్రాల్లో వినాయకుడు ఒక్కడే కొలువుతీరి కనిపిస్తాడు. అయితే వినాయకుడితో పాటు అదే ప్రాంగణంలో విశ్వేశ్వరుడు, అన్నపూర్ణాదేవి, శ్రీదేవీ-భూదేవి సమేత కేశవ స్వామి, కాళభైరవుడు అందరూ పంచాయతనంగా ఏర్పడటం అక్కడ కాశీలో… ఇక్కడ అయినవిల్లిలో మాత్రమే చూడగలం. అదీ ఈ ఆలయానికి ఉన్న ప్రత్యేకత, విశిష్టత.


ఇక్కడి వినాయక మూర్తి ఎవరో తయారు చేసిన విగ్రహం కాదు. ఆయన స్వయంభు. భక్తుల పూజలు గ్రహించడం కోసం భక్తులను ప్రేమతో అనుగ్రహించడం కోసం ఆయన తనకుతానే ఆవిర్భవించాడని అంటారు. అయితే ఈ విగ్రహాన్ని ప్రతిష్టించింది మాత్రం వ్యాసమహర్షి అట. నరజాతికి జ్ఞానాన్ని పంచిన ఆ బాదరాయనుడు వేదాల్నే నాలుగుగా విభజించి వేదవ్యాసుడయ్యాడు. ఆయన తన దక్షిణ భారతదేశ యాత్ర ప్రారంభసమయంలో స్వయంభు అయిన ఆ సిద్ది వినాయకుడి విగ్రహాన్ని ఇక్కడ అయినవిల్లిలో ప్రతిష్టించాడని స్థలపురాణం చెబుతోంది.

కలియుగంలో మనం చెప్పుకుంటున్న ఈ సిద్ధి వినాయక ఆలయం నిజానికి యుగాల నాటిది. చాలా పురాతనమైనది. ఎంత పురాతనమైనదంటే కృష్ణుడు ఉన్న ద్వాపర యుగంలోనూ, రాముడున్న త్రేతాయుగంలోనూ కూడా ఇక్కడ ఈ ఆలయం ఉన్నట్లు చెబుతారు. అసలు ఈ ఆలయం కృతయుగం నాటిదట. యుగాల కాలం నుంచి ఉన్న ఈ సిద్ధి వినాయక ఆలయాన్ని కాలక్రమంలో ఎవరో ఉద్దరించడం జరిగింది. అయితే అసలు మూలమైన అతిపురాతమైన సిద్ధి వినాయక ఆలయాన్ని ఇక్కడ దేవతలే స్వయంగా నిర్మించారని ప్రజలు విశ్వసిస్తారు.

అయినవిల్లి సిద్ధి వినాయక ఆలయం కృతయుగం నాటిదని నిరూపించే స్థల పురాణాలు ఎన్నో లభ్యమవుతున్నాయి. ప్రప్రథమంగా సృష్టి జరిగినప్పుడు ప్రజాపతుల్లో ఒకడుగా ఆవిర్భవించినవారు దక్షప్రజాపతి. ఆ దక్షుడే స్వయంగా ఇక్కడ పూజలు చేశాడని చెబుతారు. పురాణాల్లో ఎంతో ప్రాధాన్యం కలిగిన దక్షయజ్ఞ కథ ఇక్కడే ఆరంభమైందని చెప్పొచ్చు. ఎందుకంటే దక్షయజ్ఞాన్ని ప్రారంభించడానికి ముందు దక్షుడు అయినవిల్లి సిద్ధి వినాయకుడికి పూజలు జరిపాడని స్థలపురాణం చెబుతోంది. అయితే శివాగ్రహానికి గురికావడం వల్లే దక్షుడికి సిద్ధి వినాయకుడి అనుగ్రహం లభించలేదని అందుకే దక్ష యజ్ఞం భగ్నమైందని భక్తులంటారు.

వినాయక క్షేత్రం అనగానే చాలా మందికి కాణిపాకం పేరు గుర్తుకువస్తుంది. అయితే అయినవిల్లి వరసిద్ధి వినాయక క్షేత్రం కాణిపాకం కన్నా చాలా పురాతనమైంది. స్థలపురాణ సాక్షాలను బట్టి చూస్తే ఈ విషయం మనకు అర్థం అవుతుంది. అసలు అయినవిల్లి క్షేత్రానికి కాణిపాకం క్షేత్రానికి కూడా ఓ సంబంధం ప్రాచీన గ్రంథాల్లో కనిపించడం ఓ విశేషం. ప్రసిద్ధి చెందిన ప్రతీ ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. అయినవిల్లి సిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఒకటి కాదు ఎన్నో ప్రత్యేకతలు కనిపిస్తాయి. పురాణపరంగా మాత్రమే కాదు చారిత్రకంగా, విశ్వాసాల పరంగా ఈ వినాయకుడికి ఉన్న ప్రాధాన్యం అంతా ఇంతా కాదు.

అయినవిల్లి ఆలయం సువిశాలమైంది కాదు. అయితేనేం అయినవిల్లి సిద్ధి వినాయకుడి దర్శనం కోసం నిత్యం దేశంలో ఎన్నో ప్రాంతాల నుంచి జనం వస్తూ ఉంటారు. అప్పుడప్పుడూ విదేశీయులు కూడా స్వామిని దర్శించుకోవడానికి వస్తుంటారు. కాశీలాంటి క్షేత్రం కావడం వల్ల స్థల పురాణానికి ఉన్న సాక్ష్యాల వల్ల దీనికి ఇంతటి ప్రాధాన్యం ఏర్పడింది.

అయినవిల్లి వినాయకుడు అందరివాడు. అందరికీ అయినవాడు. అసలైన దేవుడు. ఆయనకు ఆడంబరాలు తక్కువ. ఆయన పూజకు గరిక, పొట్టపూజకు కుడుములు చాలు. అదీ ఆయన నిరాడంబరత. అయితేనేం ఆయనను భక్తితో కొలిచే భక్తులు ఉన్నప్పుడు పూజలకు కొదవేముంటుంది. అయినవిల్లి సిద్ధి వినాయకుడి ప్రత్యేకతల గురించి చెప్పుకోవాలంటే అక్కడ నిత్యాన్నదానం, ప్రత్యేక పూజల గురించి తప్పకుండా ప్రస్తావించాలి.

Share This Article
Leave a comment